YSRCP praising Pawan Kalyan:  వైఎస్ఆర్‌సీపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే నిన్నటి వరకూ ఓ దత్తపుత్రుడు, నిత్య పెళ్లికొడుకు..ఇంకా ఎన్నో. కానీ ఇవాళ పవన్ కల్యాణ్ అంటే ఓ పార్టీ అధినేత.  అంతే కాదు ఆయనకు ఫలితాలను అటూ ఇటూ మార్చేయగల శక్తి ఉన్న రాజకీయనాయకుడు. అంతేనా చంద్రబాబును మించి పోతున్నారని ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ వల్లే ఓడిపోయామని చెబుతున్నారు. హఠాత్తుగా వైసీపీ నేతల్లో వచ్చిన మార్పు చూసి రాజకీయవర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.ఇటీవల ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అనే వెటకారం చేశారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు పొగడ్తలు అందుకుంటున్నారు. వైసీపీలో జగన్ ను తప్ప  ఎవర్ని పొగిడినా సమస్యలు వస్తాయని వారికి తెలుసు. మరి ఎందుకు పొగుడుతున్నారు ?


పవన్ ను పొగడాలని పార్టీ నేతలకు వైసీపీ హైకమాండ్ సంకేతాలు?


గుడివాడ అమర్నాథ్, మార్గాని భరత్ నుంచి అంబటి రాంబాబు వరకూ ఇటీవల మీడియాతో మాట్లాడినప్పుడు తాము యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చినప్పుడో ఉద్దేశపూర్వకంగా పవన్ కల్యాణ్ గురించి పాజిటివ్ మాటలు మాట్లాడుతున్నారు. గుడివాడ అమర్నాత్ ..తనకు పవన్ కల్యాణ్ ను  తిట్టవద్దని చాలా మంది సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆయనను తిట్టడం వల్ల తాను కాదని మొత్తం 164 స్థానాల్లో ఓడిపోయామని చెప్పి పవన్ కు బాహుబబలి ఎలివేషన్ ఇచ్చారు. మార్గాని భరత్ కూడా అంతే. ఇతర నేతలూ అదే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ అంటే ఒంటి కాలిపై లేచే అంబటి రాంబాబు తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. .పవన్ కల్యాణ్ కు స్థరిమైన ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ అధ్యక్షుడిగా సంబోధించారు. ఆయనపై  గతంలో చేసిన కామెంట్లు చేయలేదు. వీరి తీరు చూస్తే పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన సంకేతాలను బట్టే ఇలా పవన్  కు ఎలివేషన్‌లు ఇస్తున్నారని అంటున్నారు. 


Also Read:  ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి


హైకమాండ్ అనుమతి లేకపోతే పొగడ్తలు కొనసాగవు !


హైకమాండ్ అనుమతి లేకపోతే ఈ పొగడ్తలు కొనసాగే అవకాశం ఉండదు. కానీ రోజు రోజుకు ఇవి పెరుగుతున్నాయి. బహుశా కొద్ది రోజుల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తెరపైకి వచ్చి పవన్ కల్యాణ్ వల్లే ఓడిపోయామని ఆయన  బాగా పనిచేస్తున్నారని ప్రశంసించినా ప్రశంసించవచ్చని అంటున్నారు. దానికి తగ్గ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ ఆస్థాన దినపత్రికలో పవన్ కల్యాణ్‌కు పాజిటివ్ గా వార్తలు కనిపిస్తున్నాయి. చంద్రబాబును మించిపోతున్న పవన్ కల్యాణ్ అని ఓ కథనం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. పవన్ పై విమర్శలు చేసేందుకు ఇప్పుడు ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతోందని అంటున్నారు. భవిష్యత్ రాజకీయ వ్యూహంతోనే ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు. 



Also Read: Tirumala: తిరుమలలో రాజకీయాలు మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ - కేసులు నమోదు చేయాలంటున్న భక్తులు



వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు మారుతాయని జగన్ భావిస్తున్నారా?


ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే.. మరో పార్టీ గెలవడం అసాధ్యం అన్న భావన రాజకీయవర్గాలకు ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఏ నియోజకవర్గంలో చూసినా మినిమం యాభై వేలు అంటూ వచ్చిన మెజార్టీలు చూసి ఎక్కువ మంది అదే అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వచ్చే ఎన్నికల నాటికి సామాజిక సమీకరణాలను మార్చుకోవాలి. కనీసం కలిసి పోటీ చేయకుండా అయినా చేయాలి. అదే వ్యూహాన్ని ఇప్పటి నుంచే పాటిస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల ననాటికి జనసేనతో పొత్తులు కాకపోయినా ఆ పార్టీకి ఎలివేషన్లు ఇచ్చి అయినా ఒంటరిగా పోటీ చేయాలన్న రాజీయ వ్యూహాన్ని వైసీపీ పాటిస్తోందని అంటున్నారు.