Tirumala News : తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట రాజకీయాలు మాట్లాడటాన్ని నిషేధిస్తూ కొత్త టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఎవరూ మాట్లాడటం లేదు. అయితే తెలంగాణకు చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ నిబంధన ఉల్లంఘించారు. ఆయన వీఐపీ దర్శనం చేసుకుని రంగనాయకుల మండపంలో సన్మానం కూడా తీసుకుని బయటకు వచ్చి ఆరోపణలు చేశారు.  తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బాగుపడింది ఆంధ్రావాళ్లేనని... తిరుపతిలో తెలంగాణ రాజకీయ నాయకుల మీద వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చే తెలంగాణ ప్రజలను పట్టించుకోవడం లేదని.. గతంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. తిరుమలలో తెలంగాణ రాజకీయ నేతల్ని కూడా ఏపీ రాజకీయ నేతలతో సమానంగా చూసేలా చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు. 



శ్రీనివాస్ గౌడ్ ఈ డిమాండ్లు చేయడంపై ఎవరికీ అభ్యంతరం లేదు కానీ.. పవిత్రమైన ఆలయం ముందు రాజకీయాలు మాట్లాడకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఉల్లంఘించడం కరెక్ట్ కాదంటున్నారు. ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది టీటీడీ చూసుకుంటుందని..దానికి స్వామి వారి దర్శనం తర్వాత ఆరోపణలు చేయడం ఏమిటన్న ప్రశ్నలు నెటిజన్లు వేస్తున్నారు. కొండపై రాజకీయాలు మాట్లాడితే కొండ దిగే లోపు కేసులు పెడతామని గతంలో ప్రకటించారు. టీటీడీ ఇప్పుడు కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు  





 తిరుమలలో కేవలం గోవిందనామమే మార్మోగాలని భక్తులు కోరుకుంటారు. అయితే అక్కడ మాట్లాడితే ఎక్కువ అటెన్షన్ వస్తుందన్న కారణంగా అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారు పెరిగిపోయాయి. గత ఐదేళ్ల కాలంలో మంత్రిగా ఉన్నప్పుడు రోజా ప్రతి వారం శ్రీవారిని దర్శించుకుని మీడియా ముందు దారుణమైన వ్యాఖ్యలు చేసేవారు.  ఇతర  నేతలు కూడా అదే పని చేశారు. ఈ అంశంపై భక్తులలోనూ అసంతృప్తి వ్యక్తమయింది. కొత్త టీటీడీ బోర్డు ఈ విషయంలో భక్తుల అభిప్రాయాలను గౌరవించి.. రాజకీయాలు మాట్లాడకుండా నిషేధం విధించారు.                                     



Also Read: అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్‌- పనులకు డెడ్‌లైన్ పెట్టిన మంత్రి నారాయణ