KCR New National Party: తెలంగాణ రాజ‌కీయ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం ప్రారంభమయింది.  భార‌త్ రాష్ట్ర స‌మితిగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్ర‌స్థానంలో మ‌రో మలుపు చోటు చేసుకుంది. ప‌లు రాష్ట్రాల నేత‌ల స‌మ‌క్షంలో కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.  టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ  ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించారు.


ముహుర్తం ప్రకారం టీఆర్ఎస్ పేరును  బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటన


బీఆర్ఎస్ ఆవిర్భావ తీర్మానానికి టీఆర్ఎస్ పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఆమోదించింది.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది.  సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్‌ సభ్యులు, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు సహా 283 మంది కీలక ప్రతినిధులు భేటీకి హాజరయ్యారు. అలాగే సమావేశానికి పలు రాష్ట్రాల నేతలు సైతం హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని ప్రకటించారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో దీన్ని కీలక మలుపుగా అభివర్ణించారు. పార్టీ సర్వసభ్య సమావేశానికి హాజరైన పలు రాష్ట్రాల నేతల సమక్షంలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. దీంతో హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద  బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచి, బాణసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు.


కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఇతర పార్టీల ప్రతినిధులు హాజరు 


కర్నాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్‌ నేత హెడీ కుమారస్వామి, ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్‌తో పాటు ఎంపీలు భేటీకి హాజరయ్యారు.ప్రస్తుతం జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో సభ్యులకు కేసీఆర్‌ వివరించారు.  అనంతరం టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.   తీర్మానానికి ఆమోదం తెలుపుతూ 283 మంది సభ్యులు ఆమోదముద్ర వేశారు.  ఆ తర్వాత సంతకాలు చేశారు.  


ఈసీ అనుమతి పొందిన తర్వాతనే అధికారికంగా మార్పు 


అయితే కార్యవర్గ సమావేశంలో తీర్మానం మాత్రమే చేశారు. ఈసీ ఆమోదించాల్సి ఉంది. ఈ తీర్మానంతో .. టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి ఎన్నికలసంఘం ప్రతినిధులతో భేటీ అవుతుంది. వారికి సమర్పించి తెలంగాణ రాష్ట్ర సమితిపేరును రద్దు చేయించి..  భారత రాష్ట్ర సమితిగా మార్పు చేయిస్తారు. ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకూ  తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుంది. 


పేరు మారిస్తే జాతీయ పార్టీ అయిపోతుందా ? అసలు రూల్స్ ఇవిగో !