National Party: తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నారు. అంతే జాతీయ పార్టీ అయిపోయినట్లేనని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినట్లేనని చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆ పార్టీ నేతలు చెప్పుకోవచ్చు. మీడియా ఆ హోదా ఇవ్వొచ్చు కానీ అధికారికంగా మాత్రం కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని మైలురాళ్లు సాధించాలి. లేకపోతే జాతీయ పార్టీ గుర్తింపు రాదు.
జాతీయ కార్యవర్గాలు పెట్టుకున్నంత మాత్రాన జాతీయ పార్టీ కాదు !
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 జాతీయ పార్టీలు, 54 ప్రాంతీయ పార్టీలు, 2,797 గుర్తింపు లేని పార్టీలు నమోదై ఉన్నాయి. ఎనిమది జాతీయ పార్టీల్లో టీడీపీ లేదు. వైఎస్ఆర్‌సీపీ లేదు. కానీ ఆ రెండు పార్టీలకూ జాతీయ కార్యవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఆ రెండు పార్టీల తరహాలోనే జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించుకుంటారు. కాకపోతే ఆ రెండు పార్టీలకు ఉన్న జాతీయ కార్యవర్గంలో అందరూ ఏపీ, తెలంగాణ నుంచి మాత్రమే ఉంటారు. కానీ కేసీఆర్ మాత్రం ఇతర రాష్ట్రాల వారిని కూడా భాగం చేయబోతున్నారు.
పేరు మార్చుకోవడం చాలా సులభం
రాజకీయ పార్టీలు తమ పేర్లను ఎప్పుడయినా సవరించుకొనే అవకాశం ఉంటుంది. పార్టీలు పేరు మార్చుకోవడానికి సంబంధించి ప్రత్యేకంగా నిబంధనలేమీ లేవు. పార్టీ విస్తృత సమావేశంలో తీర్మానం చేసి, ఎన్నికల సంఘానికి లేఖ సమర్పించాలి. ఈసీ దానిని పరిశీలించిన తర్వాత అభ్యంతరాలు ఉంటే తెలుపాల్సిందిగా నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు లేదా.. ఆ పార్టీ ఇచ్చిన లేఖను స్వీకరించి ఆమోదించవచ్చు. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటాయని భావిస్తే పత్రికా ప్రకటన ఇచ్చి అభ్యంతరాలు స్వీకరిస్తుంది. 30 రోజుల వ్యవధిలో ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే తుది నిర్ణయం వెలువరిస్తుంది. అధికారికంగా కొత్త పేరు మనుగడలోకి వస్తుంది. టీఆర్‌ఎస్ దరఖాస్తుకు ఎన్నికల సంఘం నుంచి ఆమోదం లభిస్తే టీఆర్‌ఎస్ కొత్త పేరు, గుర్తుతో ఎన్నికల్లో నిలుస్తుంది.
దేశంలో ప్రస్తుతం 8 జాతీయ పార్టీలు
ప్రస్తుతం దేశంలో ఎనిమిది గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీలు రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - సీపీఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) - సీపీఎం రెండింటికీ జాతీయ పార్టీగా గుర్తింపు ఉంది. అలాగే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కూ జాతీయ పార్టీ గుర్తింపు ఉంది. నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది కాబట్టి జాతీయ పార్టీగా అవతరించింది. బహుజన్ సమాజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ , నేషనల్ పీపుల్స్ పార్టీలకూ ఈ గుర్తింపు ఉంది. ఇతర పార్టీలు జాతీయపార్టీ హోదా గుర్తింపును సాధించలేకపోయాయి.
అసలు నిబంధనలు ఇవీ !
కేంద్ర ఎన్నికల సంఘం 1968 ప్రకారం చివరి సారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. ఈ నిబంధనల ప్రకారం ఉంటే ఈసీ జాతీయ పార్టీ గుర్తింపు ఇస్తుంది. లేకపోతే మీడియాలో ప్రచారం చేసుకోవడానికి మాత్రం బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మిగులుతుంది.