KCR National Party : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయంగా తిరుగులేని స్థానం ఇచ్చింది తెలంగాణ. ఇక్కడ తెలంగాణ ప్రాంతం కాదు. ఉద్యమం. తెలంగాణ ఉద్యమం.ప్రజల్లో తెలంగాణపై ఉన్న ప్రేమను ఉద్యమంగా మార్చడం.. ఆ ఉద్యమానికి నేతృత్వం వహించడం వల్ల కేసీఆర్‌కు రాజకీయంగా బాహుబలిలాగా ఎదిగారు.  ఎలాంటి  పరిస్థితుల్లో అయినా ఆయనకు తెలంగాణ ఉద్యమమే అండగా నిలిచింది. అంటే కర్ణుడికి కవచకుండలాల్లా కేసీఆర్‌కు తెలంగాణ అలా అజేయశక్తిగా నిలిపిందనుకోవాలి. మరి ఇప్పుడు కేసీఆర్ ఆ కవచ కుండలాల్ని ఉద్దేశపూర్వకంగా వదిలేస్తున్నారు. తెలంగాణ అనే భావనను మర్చిపోతున్నారు. ఇక నుంచి తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్పలేరు. దేశం గురించి మాత్రమే మాట్లాడాలి. మరి ఉన్న బలాన్ని వదిలేసి కేసీఆర్ ఏం చేయబోతున్నారు ? కొత్తబలాల్ని ఎలా పొందుతారు ?


తెలంగాణ లేని కేసీఆర్ పార్టీని ప్రజలు ఊహించగలరా !?


తెలంగాణ అంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్. కేసీఆర్ పేరు చెప్పినా.. టీఆర్ఎస్ ను గుర్తు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చేది తెలంగాణనే. తమ లక్ష్యం  తెలంగాణ రాష్ట్ర సాధన అని టీఆర్ఎస్‌ను స్థాపించారు. సెంటిమెంట్‌ను రగిలిగించారు. ప్రజలందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు. రెండు సార్లు అదే సెంటిమెంట్‌తో అధికారాన్ని చేపట్టారు. కానీ ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా తెలంగాణను మర్చిపోవాలని నిర్ణయించుకున్నారు. ఏ ఉద్యమం.. ఏ టీఆర్ఎస్ అయితే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందో ఆ తెలంగాణను మార్చేయాలని డిసైడ్ అయ్యారు. తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని చరిత్రలో కలిపేస్తున్నారు.కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నారంటే.. అది తెలంగాణ ప్రజలకు దూరమైనట్లే. 


ఇది మీ పార్టీ అని తెలంగాణ ప్రజలకు ఇక ముందు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ భరోసా ఇవ్వగలదా ?


తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పింది .. చేసింది ఒక్కటే. ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి మత్రమే మన పార్టీ. మిగిలినవన్నీ ఆంధ్రా పార్టీలు. జాతీయ పార్టీలను కూడా తెలంగాణ పార్టీలుగా పరిగణించలేదు. ఆంధ్రా పార్టీలతో మనకెందుకు తెలంగాణ రాష్ట్ర సమితి  మన ఇంటి పార్టీ.,. వేరే పార్టీల మాయలో పడవద్దని కేసీఆర్ చెప్పే మాటలకు ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యే వారు. మన పార్టీ అనే భావన.. సెంటిమెంట్ టీఆర్ఎస్‌కు రక్షణ కవచంగా ఉండేది. ఉద్యమ సమయంలో ఇతర పార్టీలన్నింటీనీ వేరే ప్రాంత పార్టీలు అన్న ముద్ర వేయడంతో  మన పార్టీ అనే భావన పెరిగింది. ఇప్పుడు మన పార్టీని కేసీఆర్ అంతర్థానం చేస్తున్నారు. టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ చేసిన తర్వాత.. తెలంగాణ ప్రజలకు ఇది మన పార్టీ అనే భరోసాను ఇవ్వడం అసాధ్యం. ఎందుకంటే.. కేసీఆర్ ఆ  పార్టీని దేశం మొత్తం కోసం పెడుతున్నారు. అందుకే ఇక ప్రత్యేకంగా తెలంగాణ కోసం గొంతెత్తలేరు. 


కేసీఆర్  అంటే ఎవరికైనా ప్రాంతీయ నేతే  గుర్తుకొస్తారు.. జాతీయ స్థాయిలో ఎలా నెట్టుకొస్తారు ?


కేసీఆర్ ముందు మరో సవాల్ ఉంది.  కేసీఆర్ అంటే ప్రాంతీయ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. ఆయన తమ ప్రాంతం కోసం పోరాడారని అనుకుంటారు. ఆయనను జాతీయ నాయకుడిగా చూసే ముందు తెలంగాణ  ప్రయోజనాల కోసమే కొట్లాడారని గుర్తు పెట్టుకుంటారు. అలాంటి రాజకీయ నేత ఇప్పుడు దేశ మొత్తానికి మెరుగైన  రాజకీయం చేస్తానని బయలుదేరితే ఎవరైనా నమ్మడం కష్టమే.  కేసీఆర్ చేసిన ప్రాంతీయ ఉద్యమాలకు.. ఆయన చెబుతున్న దేశ రాజకీయాలకు పొంతన ఉండదు. ఇతర రాష్ట్రాల ప్రజల సంగతేమో కానీ.. కేసీఆర్ తెలంగాణనూ వదిలేశారని అక్కడి ప్రజలు నమ్మితే పునాదులు కదిలిపోతాయి. అందుకే కేసీఆర్ పులి మీద స్వారీ చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ పార్టీల్లో వినిపిస్తోంది. 


కేసీఆర్ ముందు క్లిష్టమైన సవాళ్లు- ఎదుర్కోలేకపోతే ఇప్పటి వరకూ సాధించింది బూడిదలో పోసిన పన్నీరే !


కారణం ఏదైనప్రపటికే కేసీఆర్ తెలంగాణను ద్వితీయ ప్రాధాన్యతలోకి తీసుకుని జాతీయ రాజకీయాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఓ ప్రాంతీయ పార్టీ అధినేత ఇలా జాతీయ పార్టీ పెట్టి రంగలోకి దిగడం దేశ రాజకీయాల్లో కొత్త అనుకోవచ్చు. కేసీఆక్ ఓ రకంగా సాహసం చేస్తున్నారు. తాను రాజకీయంగా ఎదిగిన తెలంగాణ సెంటిమెంట్ అనే అస్త్రాన్ని వదిలేసి .. రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ వద్ద ఎలాంటి ఆయుధం లేదు. దాన్ని ఆయన ఇప్పుడు సమీకరించుకుని పోరాటం చేయాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇప్పటి వరకూ సాధించినదతంతా నిష్ప్రయోజనం అవుతుంది.