పార్టీ ప్రకటనకు ముందే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. జాతీయ స్థాయిలో చాలా మంది ఈ పార్టీపై ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోని చాలా మంది నాయకులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ వేదికగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ కాసేపట్లో బీఆర్‌ఎస్‌గా మారబోతోంది. భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనుంది. ఈ ప్రయత్నాన్ని ఇప్పటికే చాలా మంది జాతీయ నాయకులు స్వాగతించారు. ఎన్నో లోకల్ పార్టీలు కేసీఆర్‌ను కలిసి తమ మద్దతును ప్రకటించాయి. పార్టీ ప్రకటనకు చాలా మంది జాతీయస్థాయి నాయకులు వచ్చి సంఘీభావం ప్రకటించారు.
ఇంకొన్ని పార్టీలు భారత్ రాష్ట్ర సమితిలో విలీనం అయ్యేందుకు రెడీగా ఉన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో లోకల్ పార్టీలు బీఆర్‌ఎస్‌లో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
తమిళనాడుకు చెందిన విదుతాలై చిరుతైగల్ కచ్చె(వీసీకే) బీఆర్‌ఎస్‌లో విలీనానికి రెడీగా ఉందట. ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్ ఇప్పటికే హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కొత్త పార్టీ ప్రకటన తర్వాతే తమ విలీనంపై ఆయన ఓ ప్రకటన చేస్తారట.
వీసీకేతోపాటు కర్ణాటకకు చెందిన రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఓ పార్టీ బీఆర్‌ఎస్‌లో విలీనం కాబోతోందని సమాచారం. ఇప్పటికే వీళ్లందరికీ ఆహ్వానాలు వెళ్లినట్టు టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది ప్రముఖులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇందులో జేడీఎస్ నేత కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్ణ, కొందరు ఎంపీలు ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రగతి భవన్ వచ్చిన కుమారస్వామి బృందాన్ని, తిరుమావళవన్ బృందాన్ని సీఎం కెసిఆర్, కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్., టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు., ఎమ్మెల్సీలు., తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మళ్లీ టీఆర్‌ఎస్ గూటికి చేరారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. చాలా రోజుల క్రితం ఓదెలు తన భార్య భాగ్యలక్ష్మితో కలిసి టీఆర్‌ఎస్‌ను వీడారు. కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు మళ్లీ ఆయన మనసు మార్చుకున్నారు. మళ్లీ కారు ఎక్కారు.