KCR Dussehra Wishes: నేడు తెలంగాణ పెద్ద పండుగ విజయదశమిని పురస్కరించుకుని నేతలు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సద్దుల బతుకమ్మ సంబరం ముగిశాక తెలంగాణలో దసరాకు అత్యంత ప్రాధాన్యత ఉంది. విజయాలను అందించే ఈ విజయదశమిని పురస్కరించుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు నేతలు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.


ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సంప్రదాయం గొప్పది. విజయానికి సంకేతమైన దసరా నాడు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.






వెంకయ్య నాయుడు దసరా విషెస్..
తెలుగు ప్రజలందరికీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘విజయదశమి దుష్టసంహారానికి చిహ్నం. అవినీతి, వివక్ష వంటి సామాజిక జాఢ్యాలపై ఈ విజయదశమి జన బాహుళ్యంలో పోరాట స్ఫూర్తిని రగిలించాలని, వివక్షలకు తావు లేని నవభారతం సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నానని’ వెంకయ్య ట్వీట్ చేశారు.






బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు హిందూ బంధువులకు విజయదశమి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. శక్తికీ, సంకల్పానికి, విజయానికి ప్రతీక అయిన ఈ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సహాలతో జరుపుకోవాలని, అందరికీ సకల శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నానని తన ట్వీట్ లో రాసుకొచ్చారు బండి సంజయ్.






చెడుపై మంచి గెలిచిన శుభదినం విజయదశమి అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జమ్మిచెట్టు పూజ, పాలపిట్ట దర్శనంతో విజయదశమి వేడుకలు ప్రతీ ‌కుటుంబం ఘనంగా జరుపుకోవాలని.. ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ.. దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.






అధర్మంపై అంతిమంగా విజయాన్ని ఇస్తుంది..
‘#Dussehra అంటే శక్తిపూజ. అధర్మంపై పోరాడేకొద్దీ మనలో శక్తి ఎదుగుతుంది. అది అంతిమంగా విజయాన్ని ఇస్తుంది. చెడును నిర్మూలిస్తుంది. దుర్గ అవతారాలు మనకు చెప్పేది ఇదే. మీ సంకల్పాలను నెరవేర్చుకునే శక్తిని ఆ జగన్మాత మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ... మీకు, మీ కుటుంబసభ్యులకు దసరా శుభాకాంక్షలు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ ద్వారా తన విషెస్ తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు అన్ని పనుల్లో విజయాలు సాధించాలని, చెడుపై మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.