Andhra Pradesh: మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత సీరియస్‌గా ఉంది..? ఒక చిన్న అగ్నిప్రమాదానికే ఏకంగా హెలికాప్టర్(Helicopter) వేసుకుని డీజీపీ(DGP) వెళ్లి స్వయంగా పరిశీలించడమేంటి..? ముఖ్యమంత్రి నేరుగా గంటగంటకు అప్‌డేట్ చేయడం..స్వయంగా సీఎంవో కార్యాలయమే ఈ కేసును ఫాలోఅప్ చేయడం వెనక ఆంతర్యమేంటి.? రెవెన్యూశాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ మూడురోజులుగా అక్కడే మకాం వేసి లెక్కలు తేల్చే పనిలో ఉండటానికి కారణమేంటి..?
పుంగనూరులో ఏం జరుగుతోంది..?
మదనపల్లె(Madanapalli) సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని విలువైన దస్త్రాలన్నీ కాలిపోయిన సంగతి తెలిసిందే. చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో జరిగే తంతే ఇక్కడా జరిగిందని అందరికీ తెలిసిందే. ఇదేమీ కొత్తకాదు కూడా. చాలాచోట్ల లెక్కల్లో బొక్కలు వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేసే పనే ఇది. పోలీసుస్టేషన్‌లో మంటలు చెలరేగడం పాత కేసులకు సంబంధించిన వివరాలన్నీ తగలబడిపోవడం...షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించిందని చెప్పడం షరామామూలే. సరిగ్గా ఇదే పథకాన్ని ఇక్కడా అమలు చేసి ఉంటారని అనుమానం. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం చిన్న విచారణ జరిపి ఆ తర్వాత దాని గురించి వదిలేస్తుంది. కానీ జరిగింది మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం కావడం, ఆ రెవెన్యూ డివిజన్ మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఏలుబడిలో ఉన్న ప్రాంతంలోనిది కావడంతో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది.
ఘటనల జరిగిన తర్వాత రోజు ఉదయం 6 గంటలకే లైన్‌లోకి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) వచ్చి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ఇది కేవలం ప్రమాదంగా చూడొద్దని...ఆధారాలు ఏవీ పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటూ స్థానిక అధికారులకు సీఎంవో నుంచి హుకుం జారీ అయ్యింది. అంతే కలెక్టర్, ఎస్పీ వెంటనే అక్కడికి వాలిపోయారు..ప్రాథమిక దర్యాప్తు చేస్తుండగానే విజయవాడ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో డీజీపీ(DGP), నిఘా విభాగం అధిపతి అక్కడి చేరుకోవడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇంత చిన్న అగ్నిప్రమాదానికి ప్రభుత్వం అంత ఆసక్తి చూపడమేంటని నిర్ఘాంతపోయింది. తీరా ప్రభుత్వం ఊహించిందే నిజమని తేలింది. అక్కడ కాలిపోయిన దస్త్రాల్లో చాలావరకు మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకున్న భూములకు సంబంధించిన ఆధారాల దస్త్రాలే ఉన్నట్లు తేలింది.విద్యుత్‌శాఖ అధికారులు సైతం అక్కడికి చేరుకుని ఇది షార్ట్‌సర్యూట్ వల్ల జరిగిన ప్రమాదం కాదని తేల్చి చెప్పారు. పైగా పదిరోజులుగా అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం. ప్రమాదం జరగడానికి ముందురోజు ఆదివారమైనా ఆ కార్యాలయంలో పనిచేసే ఓ సిబ్బంది రాత్రి వరకు అక్కడే ఉండి విలువైన పేపర్లు కోసం సోదాలు చేయడం చూస్తే ఖచ్చితంగా ఇది కావాలని చేసిన ప్రమాదమేనని ప్రభుత్వం నిర్థారణకు వచ్చింది. అయితే సీఎం చంద్రబాబు(Chandra Babu) ఈ కేసును ఇంత ప్రత్యేకంగా తీసుకోవడానికి కారణమేంటో ఒకసారి చూద్దాం..
పాతమిత్రులే శత్రువులు
సీఎం చంద్రబాబు, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరూ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ స్టూడెంట్‌లే. ఇరువురికీ కాలేజీ రోజుల నుంచే విభేదాలు ఉన్నాయి. నాయకత్వ ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు పోటీపడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత స్నేహితులుగా మారారు. అయితే చంద్రబాబుకు అవకాశం వచ్చి ముందుగానే ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లిచేసుకోవడం, ఆ తర్వాత చంద్రబాబు తెలుగుదేశంలో చేరడం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్‌పార్టీలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 89లో కాంగ్రెస్ ఊపులో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు. అదే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. అప్పటి నుంచి చిత్తూరు జిల్లాపై పట్టుకోసం ఇరువురు పోటీపడుతూనే ఉన్నారు. ఇద్దరూ ప్రత్యర్థి పార్టీల్లో ఉండటం కూడా వారిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమైంది.ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ చిత్తూరు జిల్లాపై తగినంత పట్టు నిలుపుకోలేకపోయారు. కానీ పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం సగం జిల్లాపై పట్టుసాధించింది.
పీలేరు నుంచి పుంగనూరుకు పెద్దిరెడ్డి మారినా, పీలేరులోనూ ఆయన అనుచరగణం ఉంది. తంబళ్లపల్లెలో తమ్ముడు, ఎంపీగా కుమారుడు మిథున్‌రెడ్డి గెలుస్తూ వచ్చారు. వైసీపీలో చేరి జగన్ పంచన చేరిన తర్వాత పెద్దిరెడ్డి కుటుంబానికి ఎదురేలేకుండా పోయింది. జిల్లాదాటి రాష్ట్రస్థాయిలోనూ ఆయన హవా కొనసాగింది. మైనింగ్, కాంట్రాక్ట్‌లు, ఇసుక దోపిడీ గురించి ఇక చెప్పాల్సిన పనేలేదు. వైసీపీలో నెంబర్ 2గా ఎదిగారు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా...పెద్దిరెడ్డిని ఢీకొట్టలేకపోయారనే చెప్పాలి. ఆయన రాజ్యంలో తెలుగుదేశం అడుగుపెట్టలేకపోయింది. ఇక గత వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి మరింత రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా కుప్పంపైనే కన్నేశారు. చంద్రబాబును ఎలాగైనా ఓడించి తన పంతం నెరవేర్చుకునేందుకు ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే అక్కడ పావులు కదపడం మొదలుపెట్టారు. ఏడుసార్లు వరుసగా అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా...చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి కూడా తన నియోజకవర్గంలో అడుగుపెట్టలేకపోయారంటే...పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకం ఏ స్థాయిలో నడిచిందో అర్థం చేసుకోవచ్చు. కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడమే గాక...చంద్రబాబు మీటింగ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు.
Also Read: చెరో దారిలో ఇద్దరు మిత్రులు - బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ ఇక కలసి రాజకీయం చేయలేవా ?
అంగళ్లు గొడవ, కేసులతోపాటు పెద్దిరెడ్డి అరాచకాలను ప్రజలకు తెలిపేందుకు రిజర్వాయర్ పరిశీలనకు వచ్చిన చంద్రబాబును కనీసం పుంగనూరు పొలిమేర కూడా తొక్కనివ్వలేదు. అప్పుడే చంద్రబాబు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి పుంగనూరులో పెద్దిరెడ్డికి చెక్‌పెట్టాలని నిర్ణయించుకున్నారు.అందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో ఎక్కువసార్లు పుంగనూరు నియోజకవర్గానికే వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభంజనం సృష్టించినా...పుంగనూరు, తంబళ్లపల్లెలో మాత్రం పెద్దిరెడ్డి సోదరులను తెలుగుదేశం ఇప్పుడు కూడా ఓడించలేకపోయింది.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనను తీవ్రంగా ఇబ్బందులుపాలు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నా...జస్ట్ మిస్సవ్వడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు. అందుకే ఆయన సాగించిన అక్రమాలు, అరాచకాలను వెలుగులోకి తెచ్చి ఆయన నిజస్వరూపం ప్రజలకు చూపించాలని వేచిచూస్తున్నారు.
అదే సమయంలో మదనపల్లె ఘటన జరగడంతో వచ్చిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఎలాగైనా ఈ కేసును అడ్డుపెట్టుకుని తనను సాధించిన పెద్దిరెడ్డిని లాక్ చేసేందుకు చంద్రబాబు పూనుకున్నట్లు అర్థమైంది. అందుకే అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ఏమాత్రం ఛాన్స్ తీసుకోవద్దని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని వ్యక్తిగతంగా శిక్షించవద్దని...అన్ని ఆధారాలతో చట్టప్రకారమే చర్యలు తీసుకుందామని ఇటీవల పార్టీ నేతలకు చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ కేసులో ఆధారాలతో సహా పట్టించి వారందిరకీ ఇదే రోల్‌మోడల్‌గా చూపించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన మదనపల్లె ఘటనను అంత సీరియస్‌గా తీసుకున్నారు. ఇంకా రాష్ట్రంలో వేరే ఎవరైనా అధికారులు ఇలాంటి పిచ్చిపిచ్చి వేషాలు వేయాలని చూసినా...ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో హెచ్చరించేందుకేనని సీఏంవో వర్గాలు అంటున్నాయి.