Chandrababu Southern Strategy :  తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల హక్కుల గురించి చర్చించారు. డీ లిమిటేషన్ కు సమయం దగ్గర పడినందు వల్ల రాష్ట్రాల హక్కులకు భంగంకలిగే ప్రమాదం ఉందని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని చర్చించారు. ఏపీకి కూడా నేష్టం జరుగుతుంది. జనాభా నియంత్రణను ఓ టాస్క్ గా తీసుకుని పాలసీని గట్టిగా అమలు చేసినందున దక్షిణాదిలో జనాభా తగ్గారు. కానీ ఉత్తరాదిలో మాత్రం.. ఆ పాలసీ ఫెయిల్ అయింది. అక్కడి ప్రజలు పట్టించుకోలేదు. ఫలితంగా జనం భారీగా పెరిగారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్,  ఆదాయ పంపిణీ చేస్తే.. దక్షిణాది ఘోరంగా అన్యాయమైపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని.. దక్షిణాది నుంచి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నందున .. న్యాయం జరిగే  బాధ్యతను తానే తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆ కోణంలోనే పొలిట్ బ్యూరోలో చర్చించినట్లుగా తెలుస్తోంది. 


ముందుగానే సలహా ఇచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్


పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు హడావుడి ఉన్న సమయంలో ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. తిరిగి అమరావతి వచ్చేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో.. అదే ఎయిర్ పోర్టులో ఇండియా  కూటమిలో కీలక భాగస్వామి, తమిళనాడు సీఎం స్టాలిన్ కలిశారు. ఈ సందర్భంగా స్టాలిన్.. చంద్రబాబును అభినందించడంతో పాటు.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినందున.. దక్షిణాది హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తేవాలని.. దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. స్టాలిన్ అలా కోరడానికి కారణాలు.. జనాభా ప్రాతిపదికన ఆదాయ పంపిణీ.. లోక్ సభ సీట్ల డీలిమిటేషన్ చేపడతారని భావించడమే. చంద్రబాబు కూడా దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూడాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. 


ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్లు విరాళంగా ఇచ్చిన ప్రవాసాంధ్రుడు కృష్ణా చివుకుల


లోక్‌సభ సీట్ల డీలిమిటేషన్‌లో ప్రాధాన్యం కోల్పోకుండా చూసుకోవడం అత్యంత కీలకం 


1976లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2021 జనగణన వరకు లోక్‌సభ స్థానాలను పెంచకుండా చట్టం చేశారు. 2002లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చేసి 2026 తరువాత జరిగే తొలి జనాభా లెక్కల ప్రకారం స్థానాల సంఖ్య పెంచాలని నిర్దేశించింది. అంటే 2026 తర్వాత పార్లమెంట్ నియోజకర్గాల పునర్విభజన జరగనుంది. ఇక్కడ అసలు సమస్య దక్షిణాదిలో జనాభా నియంత్రణ పాటించడం వల్ల జనాబా తగ్గింది. ఉత్తరాదిలో జనాభా పెరిగింది. నియంత్రణ పాటించలేదు.  జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది.   ప్రస్తుత ఎంపీ స్థానాలకు 1971 నాటి జనగణన ప్రాతిపదిక. ఆ లెక్క ప్రకారం తెలంగాణకు 17, ఆంధ్రప్రదేశ్‌కు 25 లోక్‌సభ స్థానాలున్నాయి. 2026 నాటికి ఈ రెండు రాష్ట్రాలలో జనాభా పెరుగుదల నిష్ఫత్తి  ఇప్పుడున్నదానికన్నా భారీగా తగ్గుతుంది. దీంతో రెండు రాష్ట్రా లు కలిసి కనీసం ఏడెనిమిది స్థానాలు కోల్పోతాయని నిపుణులు అంచనా వేశారు. మొత్తం దక్షిణాదికీ ఇదే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 లోక్‌సభ స్థానాలున్నాయి. తాజా పునర్విభజనలో వీటి సంఖ్య 103కు పడిపోయే అవకాశం ఉంది.   ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సంఖ్య 174 కాగా పునర్విభజనతో వీటి సంఖ్య ఏకంగా 204 స్థానాలకు చేరుకుంటుందని అంచనా వేశారు.   పార్లమెంట్ సీట్లు కూడా పెంచాలనుకుంటున్నారు. అలా అయినా సీట్లు పెరిగే నిష్ఫత్తి చూస్తే దక్షిణాదికి ఘోరమైన అన్యాయం జరుగుతుంది. ఒక్క యూపీలోనే 140కిపైగా సీట్లు వస్తాయి. అయితే ఈ లెక్కలన్నీ అనధికారికం.  


ఏపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం - కేసులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ


ఆదాయంలోనూ దక్షిణాదికి అన్యాయం


దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో  వివక్షపై ఉధృతంగా ప్రచారం సాగుతోంది. దీనికి కారణంగా ప్రోగ్రెసివ్ స్టేట్స్ గా ఉన్న దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున ఆదాయం తీసుకుంటున్నారు కానీ తిరిగి ఇస్తోంది మాత్రం చాలా తక్కువ అని చెబుతున్నారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికిన మళ్లీ ఆదాయం పంచాలని చూస్తే ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ఫైనాన్స్ కమిషన్ ఇలాంటి సిఫారసులే చేస్తోంది. అందుకే గత పదేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. అయితే ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలే బలంగా ఉండటం.. వాటిలో కొన్ని బీజేపీతో సన్నిహితంగా ఉండటం.. ఇతర కారణాల వల్ల నోరు మెదకపోవడంతో.. ఆ వాయిస్‌కు బలం చేకూరలేదు. 


ఇప్పుడు చంద్రబాబుదే బాధ్యత !


దక్షిణాది హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి మీద ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఆయనే భరోసా ఇస్తున్నారని.. ఆ బలంతో తన రాష్ట్రానికి ఏం కావాలో అది చేసుకుంటున్నందున.. దక్షిణాది హక్కులను కూడా కాపాడే బాధ్యతలు తీసుకోవాలంటున్నారు. అదే సమయంలో జనాభాను నియంత్రించి మంచి పురోగతి సాధించిన దక్షిణాదిని అన్యాయం చేయబోమని ప్రధాని మోదీ చెబుతున్నారు. ఎలా న్యాయం చేస్తారన్నదానిపై స్పష్టత లేదు. డీలిమిటేషన్ , ఆదాయ పంపిణీ విధివిధానాలు ఖరారు చేసేటప్పుడు.. చంద్రబాబే దక్షిణాది ప్రయోజనాలను కాపాడాల్సి ఉంది. ప్రజల్లో అంతర్గతంగా ఉన్న దక్షిణాది భావన పైకి రాకుండా ఉండాలంటే కేంద్రం కూడా ఈ విషయంలో ప్రోగ్రెసివ్ రాష్ట్రాల పట్ల అంతే బాద్యతగా వ్యవహరించాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.