Telugu Desam Polit Bureau Meet :  టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం దాదాపుగా మూడు గంటల పాటు సాగింది.  త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఇందుకు సంబంధించిన జాబితా రెడీ అవుతోందని చంద్రబాబు తెలిపారు. అలాగే  జన్మభూమి-2 కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఎవరికీ అన్యాయం జరగకుండా జిల్లా యూనిట్‍గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని .. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించారు.  పార్టీ కోసం కష్టపడిన వారి జాబితా చంద్రబాబు వద్ద ఉంది...అందరి మన్ననలు పొందేలా నామినేటెడ్ పోస్టుల జాబితా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.   


పార్టీ సభ్యులకు ఐదు లక్షల ప్రమాద బీమా                                           


తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని నిర్ణయించామని పొలిట్ బ్యూరో సభ్యుడు అచ్చెన్నాయుడు మీటింగ్ తర్వాత తెలిపారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నారు.  పార్టీ సభ్యత్వ రుసుం రూ.100లతో ప్రారంభిస్తామని..  సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షలు వచ్చే విధంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించామని అచ్చెన్న తెలిపారు.  పేదరిక నిర్మూలనపై ప్రధానంగా చంద్రబాబు చర్చించారని. పేదరిక నిర్మూలనపై విధివిధానాలు రూపొందిస్తామని..  విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 


త్వరలో జన్మభూమి  2 ప్రోగ్రాం అమలు                                       


జన్మభుమి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారని..  జన్మభూమి2 గా ఈ కార్యక్రమానికి నామకరణం చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.  మొన్నటి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సరిగ్గా దృష్టి పెడితే వైసీపీ గెలిచిన సీట్లలో మరో నాలుగు నుంచి ఐదు సీట్లు టీడీపీ గెలిచేదన్నారు.  జన్మభూమి -2 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని మరో పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.  వర్షాలతో ప్రాజెక్టులన్ని నిండుకుండలా ఉన్నాయి. ప్రాజెక్టులు నిండటంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గుండె నీరు కారుతోంది. నామినేటెడ్ పోస్టులను అతి త్వరలో భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇసుకలో అక్రమాలు సహించబోనని అధినేత మరోసారి హెచ్చరించారని తెలిపారు. 


దక్షిణాదికి అన్యాయంపై చర్చ 


జనాభా నియంత్రణతో డీలిమిటేషన్‌లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందన్న అంశంపైనా చర్చించామన్నారు.  ఒక యూపీలో 140 పార్లమెంటు స్థానాలు వస్తే దక్షిణ భారతదేశంలో160 మాత్రమే ఉంటాయి. జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయని సోమిరెడ్డి తెలిపారు.  విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనే దానిపై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడారు. అభ్యర్థిని ఒకటి, రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు.