అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలు అయ్యింది. శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala)తో ఏడు అడుగులు వేయడానికి యువ సామ్రాట్ నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) రెడీ అవుతున్నారనేది టాలీవుడ్ టాక్. సమంతతో విడాకులు తర్వాత కొన్నాళ్లకు వాళ్లిద్దరి రిలేషన్షిప్ గురించి బయటకు వచ్చింది. శోభితకు ఇది మొదటి పెళ్లి కాగా... చైతన్యకు ఇది రెండో పెళ్లి! ఆయన కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో చూడండి.
అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున!
అక్కినేని కుటుంబంలో రెండో పెళ్లి జరగడం ఇది రెండోసారి. కింగ్ నాగార్జున కూడా రెండోసారి పెళ్లి చేసుకున్నారు. తొలుత వెంకటేష్ సోదరితో ఆయనకు వివాహం జరిగింది. వాళ్లిద్దరి సంతానమే నాగ చైతన్య. ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ తర్వాత అమలను పెళ్లి చేసుకున్నారు నాగార్జున. ఈ జంట చాలా సంతోషంగా ఉంది. వీళ్లిద్దరికీ అఖిల్ జన్మించారు.
ఈతరంలో ఎక్కువగా వినిపించే పేరు పవన్!
ఈతరం అగ్ర హీరోల విషయానికి వస్తే... రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు ప్రత్యర్థులకు విమర్శనాస్త్రం అయ్యింది. ఆయన మొదటి భార్య గురించి జనాలకు ఎక్కువగా తెలియదు. స్టార్ స్టేటస్ అందుకోవడానికి ముందు విడాకులు తీసుకున్నారు. తనతో పాటు 'బద్రి'లో నటించిన రేణూ దేశాయ్ (Renu Desai)తో సహజీవనం చేశారు. అకిరా నందన్ జన్మించిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి ఆద్య జననం తర్వాత కొన్నాళ్లు సంతోషంగా ఉన్నారు. కానీ, రేణూకు విడాకులు ఇచ్చి రష్యన్ అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారు పవన్.
నాగ చైతన్య, ఆయనకు ముందు నాగార్జున - పవన్ కల్యాణ్ వంటి హీరోలు సినిమా పరిశ్రమలో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారితో ప్రేమలో పడ్డారు. ఆ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకు వెళ్లారు. నాగ్, పవన్ తమతో నటించిన హీరోయిన్లతో ప్రేమలో పడితే... చైతూ, శోభితా ఒక్క సినిమాలోనూ కలిసి నటించలేదు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా జరిగిన పరిచయం పెళ్లికి దారి తీసింది. కథానాయికతో ప్రేమలో పడలేదు కానీ మంచు మనోజ్, భూమా మౌనికది సైతం రెండో వివాహమే. ప్రణతితో మనోజ్, గణేష్ రెడ్డితో మౌనిక విడాకులు తీసుకున్న కొన్నాళ్లకు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు.
హిందీలో ఆమిర్, సైఫ్, ధర్మేంద్ర... తమిళ్‌లో కమల్!
హిందీ, తమిళ పరిశ్రమల్లోనూ హీరోయిన్లతో ప్రేమలో పడిన హీరోలు, హీరోయిన్లను రెండో పెళ్లి చేసుకున్న హీరోలు మనకు కనిపిస్తారు. బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ చూడండి. కరీనా కంటే ముందు అమృతను పెళ్లి చేసుకున్నారు సైఫ్. వాళ్లకు ఇబ్రహీం, సారా జన్మించారు. కారణాలు ఏవైనా సరే అమృతతో విడిపోయాక కరీనాను పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర సైతం రెండో పెళ్లి చేసుకున్న హీరోయే. ఆయన మొదటి భార్య పేరు ప్రకాష్ కౌర్. సన్నీ డియోల్, బాబీ డియోల్ ఆమె సంతానం. ఆ తర్వాత డ్రీమ్ గర్ల్ హేమమాలినితో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. ఈ జాబితాలో ఉన్న మరొక బాలీవుడ్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్. ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇద్దరికీ విడాకులు ఇచ్చారు. మాజీ భార్యలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ జీవితంలో ముందుకు వెళుతుండటం ఆయన స్టైల్. ఈ జాబితాలో సంజయ్ దత్, దిలీప్ కుమార్, మిథున్ చక్రవర్తి వంటి స్టార్స్ ఉన్నారు.
Also Read: పెళ్లికి కాకుండా ప్రెగ్నెంట్... అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?
కమల్ హాసన్ విషయానికి వస్తే ఆయనది డిఫరెంట్ కేస్. తొలుత సాంప్రదాయ నృత్య కళాకారిణి వాణి గణపతితో ఆయన వివాహం జరిగింది. పెళ్లైన పదేళ్లకు విడాకులు తీసుకున్నారు. అయితే... విడాకులకు ముందు నటి సారికతో సహజీవనం చేశారు. ఆ సమయంలో శృతి జన్మించారు. పెళ్లి తర్వాత అక్షర జన్మించారు. సారికతో వేరు పడ్డాక నటి గౌతమితో చాలా ఏళ్లు సహజీవనం చేశారు కమల్. ఇప్పుడు వాళ్లిద్దరూ కూడా విడిపోయారు అనుకోండి. తమిళంలో ఎంజీఆర్ సైతం రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మహానటి సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులకు సావిత్రి భర్త 'జెమినీ' గణేశన్ మూడు పెళ్లిళ్లు తీసుకున్న సంగతి తెలుసు.
భార్య మరణించిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్...
సీనియర్ హీరోల్లో కృష్ణంరాజు... మోహన్ బాబు... కృష్ణ సైతం!
రెబల్ స్టార్ కృష్ణంరాజు తొలుత బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తన బావగారి కుమార్తె సీతాదేవితో ఏడడుగులు వేశారు. అంటే... వరుసకు మేనకోడల్ని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆరోగ్య కారణాల వల్ల మరణించారు. ఆ తర్వాత శ్యామల దేవితో వివాహం జరిగింది. లక్ష్మి, విష్ణు జననం తర్వాత కలెక్షన్ కింగ్, లెజెండరీ నటుడు మోహన్ బాబు భార్య మరణించారు. ఆ తర్వాత ఆమె చెల్లెల్ని ఆయన పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరికీ మంచు మనోజ్ జన్మించారు. సీనియర్ ఎన్టీఆర్ సైతం అంతే! మొదటి భార్య మరణించిన తర్వాత కొన్నాళ్లకు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు. కృష్ణ కేస్ డిఫరెంట్. శ్రీమతి ఇందిరా దేవి ఉండగా... సహ నటి విజయ నిర్మలతో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు.
విజయ నిర్మల తనయుడు, సీనియర్ హీరో నరేష్ మూడుసార్లు వివాహ బంధంలోకి వెళ్లి వచ్చారు. మూడో భార్య చేసిన గొడవ అందరికీ తెలుసు. దాన్ని 'మళ్లీ పెళ్లి' అని సినిమా చేశారు. నటుడు శరత్ కుమార్ సైతం రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ జాబితాలో మరికొంత మంది గాయనీ గాయకులు, హీరోయిన్లు ఉన్నారు.
వివాహం అనేది వ్యక్తిగత విషయం. కలిసి ఉండటం, వేరు పడటం అనేది పూర్తిగా రెండు మనసులకు సంబంధించిన విషయం. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరూ చెప్పలేరు. అయితే... సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో ప్రేక్షకులు తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తూ ఉండటం వల్ల వారికి ప్రైవసీ లేకుండా పోతుంది.
Also Read: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్