పుంగనూరులో మొదలైన కాక చిత్తూరు జిల్లా మొత్తం వ్యాపించే కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చాలా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. శుక్రవారం జరిగిన ఘర్షణకు నిరసనగా వైసీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.
చిత్తూరు బంద్‌కు పిలుపునిచ్చి వైసీపీ ఎక్కడికక్కడ చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేస్తోంది. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు నేతలు. ఉదయానికల్లా రోడ్లపైకి వచ్చిన వైసీపీ శ్రేణులు భారీగా ర్యాలీలు తీస్తూ టీడీపీ లీడర్లను హెచ్చరిస్తున్నారు.
శ్రీకాళహస్తిలో ఇవాళ టీడీపీ అధినేత పర్యటన ఉన్నందున అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అధికారులు తొలగించడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అధికారులతో టీడీపీ లీడర్లు వాగ్వాదాననికి దిగారు.
మరోవైపు శుక్రవారం నాటి ఘర్షణల్లో గాయపడిన పోలీసులను మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పరామర్శించారు. ఆయనతోపాటు కలెక్టర్, ఎస్పీ కూడా ఈ విజిట్‌లో ఉన్నారు. కుప్పంలో ఓడిపోతున్నానే భయంతోనే చంద్రబాబు ఈ దాడులు చేయించారని ఆరోపించారు పెద్ది రెడ్డి.
పుంగనూరు ఘటనపై స్పందించిన రాయలసీమ రేంజ్ డిఐజీ అమ్మిరెడ్డి.. ఇది కచ్చితంగా అల్లరి మూకలు కావాలని చేసిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో పోలీసులపై జరిగిన దాడి చాలా బాధాకరం అన్నారు.
పోలీసులపై దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని అమ్మిరెడ్డి హెచ్చరించారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పుంగనూరులోనికి వచ్చే ఆలోచన లేదని అనుమతి కూడా లేదన్నారు. వారు ముందుగా ఇచ్చిన ప్లాన్ ప్రకారమే తాము 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసామని తెలిపారు.
ముందు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు పుంగనూరులోనికి రాకుండా హైవే పై చిత్తూరుకు వెళ్ళవలసి ఉందన్నారు అమ్మిరెడ్డి. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని తగిన పోలీసు బందోబస్తుతో బ్యారికేడ్లు ఉంచామని తెలిపారు. కొంతమంది అల్లరి మూకలు దౌర్జన్యంగా పుంగనూరులోకి ప్రవేశించాలని ప్రయత్నించారని అందుకే గొడవ మొదలైందని వివరించారు. వారిని పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. కొంతమంది అల్లరిమూకలు ముందుగానే తెచ్చుకున్న బీర్ బాటిల్స్, కర్రలు, రాళ్ళతో పోలీసులపై దాడికి పాల్పడ్డారని తెలిపారు.
సుమారు 2000 మంది అల్లరి మూకలు చాలా అమానవీయంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అమ్మిరెడ్డి. ముందస్తు ప్రణాళికలో భాగంగానే పోలీసులపై దాడులు జరిగాయని ఆరోపించారు. వారిని అడ్డుకునే క్రమంలో మొదటగా బాష్ప వాయువు ప్రయోగించి లాఠీ ఛార్జ్ చేసినట్ట వివరించారు. లాఠీ ఛార్జ్ చేసినప్పటికీ అల్లరి మూకలు ఏ మాత్రం తగ్గకుండా పోలీసులపై ఇష్టమొచ్చినట్టు విచక్షణారహితంగా కర్రలు, రాళ్ళతో దాడి చేసి గాయపరిచారన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షోను పుంగనూరు పట్టణంలోకి రావద్దని తాము ఎక్కడ ఆదేశించలేదన్నారు అమ్మిరెడ్డి. వారిచ్చిన షెడ్యూలు ప్రకారమే చర్యలు తీసుకున్నామన్నారు. 50 మంది పోలీసులు రాళ్ల దాడిలో గాయపడ్డారని ప్రకటించారు. 13 మంది పోలీసు వారికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. 2 పోలీసు వాహనాలను ధ్వంస చేసి వాటికి నిప్పు పెట్టారని వివరించారు. ఓ కానిస్టేబుల్ కన్ను పూర్తిగా దెబ్బతిందని ఆయన్ని ఎవరు బాగు చేస్తారని ప్రశ్నించారు.
Also Read:పుంగనూరుకు ఎవరూ వెళ్లకూడదా ? ఏపీలో అదే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమా ?
Also Read: చంద్రబాబు పర్యటనలో విధ్వంసం- నేడు చిత్తూరు జిల్లా బంద్ కు వైసీపీ పిలుపు
Also Read:గూండాలతో, గన్‌లతో పుంగనూరుకి చంద్రబాబు! కేసు నమోదు చేయాలన్న మంత్రి పెద్దిరెడ్డి
Also Read:పుంగనూరులో ప్రీప్లాన్డ్ దాడులు - ఎంత పెద్ద వాళ్లున్నా వదిలి పెట్టబోమన్న ఎస్పీ రిషాంత్ రెడ్డి !
Also Read: పుంగనూరులో అరాచకం - చంద్రబాబుపై రాళ్ల దాడి ! పలు వాహనాలకు నిప్పు