AP Minister Peddireddy:
తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు శుక్రవారం పుంగనూరు పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. నేడు జరిగిన రాళ్లదాడి ఘటనలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చంద్రబాబు రౌడీ మూకలను రెచ్చగొట్టి, కిరాయి గుండాలను దాదాపు 200 వాహనాల్లో తన వెంట తెచ్చుకున్నాడని ఆరోపించారు. చంద్రబాబు పరిస్థితి ఏంటో మనమందరం చూస్తూనే ఉన్నామని, టీడీపీ తీసుకొచ్చిన కిరాయి గూండాల వద్ద డబుల్ బేరర్ గన్స్, పిస్టల్స్ వంటివి ఉన్నాయని తెలిపారు.
చంద్రబాబు రెచ్చగొట్టిన కారణంగానే టీడీపీ కార్యకర్తలు రెచ్చి పోయారని, అందుకే పోలీసులపై తెలుగుతమ్ముళ్లు దాడులకు తెగబడి పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ చేసి కుట్రల ద్వారా లబ్దిపొందాలని చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు నిరాశ, నిస్పృహ, దిగజారుడుతనం ఎక్కువైందంటూ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో ఏమీ చేయలేమని అర్థమై, చంద్రబాబు వీధి రౌడీ లాగా మారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
కురబలకోట, పుంగనూరులో జరిగిన ఘటనలు కారణమైన చంద్రబాబు మొదటి ముద్దాయిగా కేసుల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. విధ్వంసానికి కారకులైన వారి వీడియోలు తమ వద్ద ఉన్నాయని, బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి కోరారు. ఒక పార్టీకి అధినేతగా ఉన్న చంద్రబాబు ఇలా చేస్తున్నారు అంటే ఆయనకు మానసిక పరిస్థితి సరిగా లేదని అర్థమవుతుందన్నారు.. 2019లో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లను చంద్రబాబు సృష్టించారని మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
గురువారం రాత్రి చంద్రబాబు రావడం లేదని బైపాస్ మీదుగా వెళ్తాడని మీడియాకు చెప్పారు. కానీ శుక్రవారం కావాలనే ఆలస్యంగా వచ్చి, వీరంగం చేశారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడం చేతకాక, వైసీపీ శ్రేణులపై, పోలీసులపై దాడులు చేయించారని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేయడం, ప్రతిపక్షనేతగా అంత అనుభవం ఉన్న నేత అయి చంద్రబాబు దాడులు చేయించడం ఆయన నిరాశ, నైరాశ్యాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచే ప్రసక్తేలేదని అర్థం చేసుకున్న పరిస్థితుల్లో చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. వీలైతే ఇకమీదటైన మంచి వైద్యుడితో ట్రీట్మెంట్ తీసుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయాలని సూచించారు. అరకోటికి పైగా దొంగ ఓట్లు సృష్టించిన ఘనత చంద్రబాబు సొంతమన్నారు. నేడు పుంగనూరులో టీడీపీ శ్రేణులు చేసిన విధ్వంసంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులకు ప్లాన్ చేసిన చంద్రబాబును ప్రధాన నిందితుడిగా కేసులో చేర్చాలని పోలీసులను కోరారు.
చంద్రబాబు ఏమన్నారంటే..
ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ నేతలు రోడ్డుపైకి రాగా, పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నరాని.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యానికి భయపడే పరిస్థితి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. బాంబులతోనే పోరాడిన వ్యక్తి నేను.. రాళ్ళు వేస్తే భయపడతానా..అని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే తన ముందుకు రావాలని సవాల్ చేశారు. తాను కూడా నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టా.. చిత్తూరు జిల్లాలోనే రాజకీయం చేశానన్నారు. జగన్ లాంటి రాజకీయాలు నేను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత... వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఒక్క సారిగా విరుచుకుపడ్డారు. దీంతో పరిస్థితి మరింత తవ్రంగా మారింది.