TTD EO Dharma Reddy: స్వచ్ఛంద సేవ అయిన శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులు సేవ కొరకు ఎవరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని, ఆన్‌లైన్ విధానం ద్వారా మరింత పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయించడం జరుగుతుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. శ్రీవారి సేవ ఆన్ లైన్ ద్వారా మాత్రమే కేటాయించడం జరుగుతుందని, ఎవరైనా డబ్బులు తీసుకుని సేవ తీసిస్తామంటే భక్తులు నమ్మవద్దని ఆయన చెప్పారు. సేవ సాప్ట్ వేర్ కచ్చితంగా ఉంటుందని, టీటీడీ సర్వర్ ను ఎవరు హ్యాక్ చేయలేరన్నారు. శ్రీవారి సేవ చేస్తున్న మహిళలను గౌరవప్రదంగా అమ్మ అని పిలవాలన్నారు.
ప్రశ్న : సప్తగిరి విశ్రాంతి భవనంలోని గదులలో హీటర్స్, వెస్ట్రన్ టాయిలెట్స్, కబోర్డ్స్, ఫర్నిచర్ లేవు ఏర్పాటు చేయండి? - కాశీ విశ్వనాధ శర్మ, మోహన్ (గుంటూరు)
ఈవో : తిరుమలలో ఇయటివలే రూ.120 కోట్లతో 6 వేల గదులను ఆధునీకరించాం. సప్తగిరి విశ్రాంతి భవనంలోని గదుల ఆధునీకరణకు టెండర్లు పిలిచాం, మరో ఆరు నెలల్లో గదుల ఆధునీకరణ పనులు ప్రారంభమవుతాయి.
ప్రశ్న : ఆన్ లైన్ లో సేవా టికెట్లతో పాటు దర్శనం, వసతి విడుదల చేయండి? - సెల్వ కుమార్ (ఏలూరు)
ఈవో: తిరుమల, తిరుపతిలో వసతి పొందేందుకు ఆన్లైన్ లో ఒకేసారి విడుదల చేస్తున్నాం.
ప్రశ్న : తిరుమలలో స్నానపు గదులు అపరిశుభ్రంగా ఉన్నాయి? - శ్రీ రాము (వైజాగ్)
ఈవో : ఇటీవల సులబ్ సంస్థలో విధులు నిర్వహించే కార్మికులు సమ్మె చేయడం వల్ల భక్తులకు కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ప్రస్తుతం అంత బాగా ఉంది.
ప్రశ్న : మొదటిసారి లక్కీ డిప్ ద్వారా సేవల కేటాయింపు తరువాత, మిగిలిన సేవ టికెట్లు రెండవసారి విడుదల చేయడం లేదు? ఆన్ లైన్ లోనే కాకుండా, కరెంట్ బుకింగ్ ద్వారా కూడా దర్శనం టికెట్లు ఇస్తారా? - ప్రతాప్ రెడ్డి (గుంటూరు), పాండు (విజయవాడ), చిన్న(కొత్తగూడెం), వెంకటస్వామి (హైదరాబాద్)
ఈవో: మొదటిసారే సేవా టికెట్లు అయిపోతున్నాయి. సేవ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్, లక్కీ డిప్ విధానం, తిరుమల సీఆర్ఓ వద్ద ఒకరోజు ముందుగా పేర్లను నమోదు చేసుకుంటే డిప్ ద్వారా సేవా టికెట్లు కేటాయించబడుతుంది. ఇది కాకుండా ప్రతిరోజు ఆన్‌లైన్‌లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 15 వేలు, SSD టోకెన్లు 15 వేలు, దివ్యదర్శనం టోకెన్లు 15 వేలు తిరుపతిలో కేటాయిస్తున్నారు. అదే విధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుండి ఫ్రీ దర్శనానికి అనుమతించడం జరుగుతుంది.
ప్రశ్న : అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్‌లైన్‌లో దొరకడం లేదు, ఆఫ్‌లైన్‌లో ఇవ్వండి? - స్వప్న(తెలంగాణ)
ఈవో : ప్రతిరోజు అంగప్రదక్షిణకు 750 టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఇందుకోసం భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండవలసి వస్తోంది. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరుగుతోంది.
ప్రశ్న : భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాలు, వసతి, దర్శనం, క్యూలైన్ల నిర్వహణ, ప్రవచన కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఎస్వీబీసీ కన్నడ ఛానల్‌లో ఆన్‌లైన్‌లో టికెట్ల విడుదల గురించి సమాచారం తెలపండి? ప్రతి ఆదివారం మధ్యాహ్నం భక్తి, పౌరాణిక చిత్రాలను పునరుద్ధరించండి? - ఆనంద్ (కర్ణాటక), సుదర్శన్ (హైదరాబాద్)
ఈవో: కృతజ్ఞతలు, ఎస్వీబీసీలోని అన్ని చానల్లో ఆన్లైన్ సేవ టికెట్లు విడుదల గురించి తెలియజేస్తాం. మన పూర్వికులు మనకందించిన రామాయణం, మహాభారతం, భాగవతంలోని జ్ఞానాన్ని భవితరాలకు కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. పౌరాణిక చిత్రాలకు సమయం లేదు.
ప్రశ్న : తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల లెటర్లకు బ్రేక్ దర్శనం ఇవ్వడం లేదు? - జగదీష్ (నల్గొండ)
ఈవో: ఆ రోజు భక్తుల రద్దీ దృష్ట్యా లెటర్ ద్వారా ఇచ్చే బ్రేక్ దర్శనాల సంఖ్యను తగ్గించడం జరుగుతుంది.
ప్రశ్న : క్యూ లైన్ లలోని అత్యవసర గేట్ల ద్వారా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది బయటవారిని పంపుతున్నారు. అదేవిధంగా లడ్డు కౌంటర్ల వద్ద పక్కనుంచి వచ్చి తీసుకు వెళుతున్నారు. దీనివలన భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు? - హరి కిరణ్ (బెంగళూరు)
ఈవో : అక్కడక్కడ ఇలాంటివి జరుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటున్నాం.
ప్రశ్న : తిరుప్పావడ సేవను ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి? ఆర్జిత సేవ టికెట్లకు ముందు లక్కి డిప్ టికెట్లు విడుదల చేస్తున్నారు, మొదట లక్కీ డిప్ టిక్కెట్లు విడుదల చేస్తే బాగుంటుంది? - సత్య (రాజమండ్రి), రమణ (ఖమ్మం)
ఈవో : తిరుప్పావడ సేవ ఆన్‌లైన్‌లో లేదు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మాత్రమే తీసుకోవాలి, అవి బుక్ అయిపోయాయి. పరిశీలిస్తాం.
ప్రశ్న : తిరుపతి, తిరుమలలో లాకర్ సౌకర్యం పెంచండి? - ప్రవీణ్ (కరీంనగర్)
ఈవో: తిరుమలలో ఇప్పటికే నాలుగు పీఏసీలు ఉన్నాయి, మరో పీఏసీ నిర్మాణంలో ఉంది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా లాకర్ల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తాం.
ప్రశ్న: కళ్యాణ కట్టలు తలనీలాలు తీసే క్షురకులు డబ్బులు అడుగుతున్నారు? - సరోజ (కర్నూలు)
ఈవో: తిరుమలలో డబ్బులు ఇవ్వకండి. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న : కళ్యాణోత్సవం చేసుకున్న గృహస్థులకు ఇచ్చే పెద్ద లడ్డు, వడ పునరుద్ధరించండి? - రమణ (ఖమ్మం)
ఈవో : శ్రీవారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఉచిత లడ్డు ఇవ్వాలని టిటిడి నిర్ణయించింది. లడ్డు కౌంటర్ల వద్ద అదన లడ్డూలు కొనుగోలు చేయవచ్చు.
ప్రశ్న : శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం ఆన్ లైన్ లో దొరకడం లేదు. గతంలో టీటీడీ కళ్యాణ మండపంలో టికెట్స్ ఇచ్చేవారు, తిరిగి ప్రారంభించండి? - శ్రీనివాస్ (కర్నూలు)
ఈవో : నేడు ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం ఉండటం వలన ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నాం. తిరుపతిలో నేరుగా వచ్చి ఆఫ్ లైన్లో టికెట్లు తీసుకోవచ్చు.
ప్రశ్న: శ్రీవాణి టికెట్లు ఎలా పొందాలి? - సర్వేశ్వరరావు (ఏలూరు)
ఈవో: ఆన్ లైన్, ఎయిర్ పోర్ట్ లో బోర్డింగ్ పాస్ చూపించి, తిరుమల జేఈవో క్యాంప్ ఆఫీసులో శ్రీవాణి టిక్కెట్లు పొందవచ్చు.
ప్రశ్న : అన్నమయ్య కీర్తనలను పుస్తక రూపంలో తీసుకురండి. - పరశురాం (అనంతపురం )
ఈవో : అన్నమయ్య కీర్తనలు 16వ శతాబ్దంలోనివి, వాటిని అర్థం చేసుకోవడం కష్టం. టీటీడీ 20 మంది ప్రముఖ పండితులతో అన్నమయ్య కీర్తనలలోని అర్థ- తాత్పర్యాలతో పుస్తకాలను రూపొందిస్తుంది. ఇప్పటికే 1000 సంకీర్తనలు అర్థ - తాత్పర్యాలతో ప్రచురించడం జరిగింది.
ప్రశ్న : రూ.300/- ప్రత్యేక ప్రవచనం దర్శన టికెట్లు మూడు నెలల ముందు విడుదల చేయడం వల్ల దాదాపు పది శాతం మంది రావడం లేదు, వారికి క్యాన్సల్ చేసుకుని అవకాశం కల్పించండి? వైకుంఠ ఏకాదశి టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు? - శంకర్ గౌడ్ ( హైదరాబాద్)
ఈవో: దర్శనం టికెట్లు పొందిన భక్తులు క్యాన్సిల్ చేయడం లేదు. వైకుంఠ ఏకాదశికి డిసెంబర్ లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి టికెట్లు విడుదల చేస్తున్నాం.
ప్రశ్న : వయోవృద్ధులు మోకాళ్ల నొప్పులు కీళ్ల ఆపరేషన్లు చేసుకున్న వారిని ప్రత్యేకంగా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోండి? సీనియర్ సిటిజన్స్ దర్శనానికి వయసు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేస్తే బాగుంటుంది? - రమణ (విశాఖపట్నం), దివాకర్ (హైదరాబాద్)
ఈవో: పరిశీలిస్తాం.