అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇద్దరూ కోరుకునేది ఒక్కటే. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ దిగిపోవాలి. తమ పార్టీ అధికారంలోకి రావాలనే కాన్సెప్టే కాంగ్రెస్, బీజేపీలది. కేంద్రం అధికార ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ స్థాయిలో తెలంగాణపై దృష్టి సారించటానికి కారణలేంటీ. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే భారీ స్థాయి బహిరంగ సభలు పెట్టి కేసీఆర్ అండ్ కో అని టార్గెట్ చేస్తున్నారు. ఓ సారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.
1. కేసీఆర్ అటాకింగ్ స్ట్రాటజీ:
వాస్తవానికి బీజేపీ అగ్రనాయకులైన జేపీ నడ్డా, అమిత్ షా వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ ను విమర్శించినట్లు కనిపిస్తున్నా... రాహుల్ గాంధీ సభ పెట్టి ఒక్క ఛాన్స్ అని బతిమాలినట్లు గోచరిస్తున్నా... అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేసింది కేసీఆరే. కోవిడ్ వైఫల్యాల దగ్గర మొదలు పెట్టి ధాన్యం కొనుగోళ్ల అంశం వరకూ ప్రతీ పాయింట్ లోనూ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసి మాట్లాడారు కేసీఆర్. విమర్శల వరకైతే పర్లేదు చాలా సార్లు అంతకు మించి అన్న ధోరణిలోనే సాగింది కేసీఆర్ అటాకింగ్ గేమ్. రాష్ట్రస్థాయి లో ప్రతిపక్షాలు ధీటుగానే బదులిచ్చే ప్రయత్నం చేసినా అది కేసీఆర్ స్థాయికి సరిపోలేదు. అందుకే ఇలా అగ్రనేతలు వచ్చి కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
2. జాతీయ స్థాయి ఎన్నికలపై కేసీఆర్ మార్క్:
తెలంగాణలో ఇక్కడి స్థానిక విషయాలపై మాత్రమే మోదీ ప్రభుత్వాన్ని విమర్శించి వదిలేయలేదు కేసీఆర్. జాతీయస్థాయి అంశాలపైనా ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను విమర్శించటం మొదలు పెట్టారు. రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ తో కలిసి ఢిల్లీలో దీక్షలు చేయటం... ముంబై వెళ్లి సీఎం ఉద్ధవ్ థాక్రే సహా శివసేన నేతలను కలవటం, జార్ఖండ్ లో హేమంత్ సొరేన్ లాంటి యంగ్ లీడర్స్ ను పదే పదే కలవటం, తమిళనాడులో స్టాలిన్ కు బహిరంగ మద్దతు తెలపటం ఇలా ప్రతీ విషయంలోనూ దేశవ్యాప్తంగా కేసీఆర్ తన మార్క్ ను క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం విఫలమైందని అంటూనే తనే నేరుగా కొనుగోలు చేస్తానంటూ కేంద్రం సహకారం లేకపోయినా రాష్ట్రాన్ని నడిపిస్తున్నట్లు ఓ బజ్ ను క్రియేట్ చేశారు కేసీఆర్.
3. హైదరాబాద్ నే ప్రొజెక్ట్ చేయటం:
మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పెట్టుబడులకు కేంద్రం గా హైదరాబాద్ కొనసాగుతూనే ఉంది. చాలా నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీలకు హైదరాబాద్ ను కేరాఫ్ అడ్రస్ చేసేలా అవకాశాలు కల్పిస్తున్నారు. ఐటీ, ఆటోమొబైల్, టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ ను టాప్ ప్లేస్ లో నిలబెట్టేలా...ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ...ప్లగ్ అండ్ ప్లే విధానాలను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి దీటుగా హైదరాబాద్ లో ప్రగతిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఇదే కొనసాగితే మరోసారి ప్రతిపక్షపాత్రకే మిగిలిన పార్టీలు పరిమితమవ్వాల్సిన తరుణంలో అపోజిషన్ పార్టీల కీలక వ్యక్తులు గళం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
4. బడ్జెట్ నుంచి రాజ్యాంగం దాకా:
కేవలం పాలనా పరమైన విమర్శలకే టీఆర్ఎస్ సర్కార్ పరిమితమవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రాజ్యాంగం మార్చాలనే డిమాండ్ దాకా...పెట్రోల్ ధరలు పెరుగుదల నుంచి ప్రశాంత్ కిశోర్ పాతటీం ఐప్యాక్ ను పెట్టుకునే దాకా జాతీయ స్థాయిలో చర్చ జరిగేలానే కేసీఆర్ అండ్ టీఎం వ్యూహాలు ఉన్నాయి.
5. తగ్గేదేలే అంటున్న టీఆర్ఎస్:
ఇంత పెద్దస్థాయి నేతలు వచ్చి టీఆర్ఎస్ ను విమర్శిస్తున్నా ఎక్కడా తగ్గకుండా టీఆర్ఎస్ కౌంటర్ లు ఇస్తోంది. రాహుల్ గాంధీ ని టూరిస్ట్ అన్న కేటీఆర్...ఇప్పుడు అమిత్ షా ను అబద్ధాల బాద్ షా అంటూ ఘాటుగా విమర్శించారు. తుక్కుగూడలో మాట్లాడిన తుక్కు మాటలను ప్రజలు పట్టించుకోరంటూ టీఆర్ఎస్ చేస్తున్న పనులను వివరించే ప్రయత్నం చేశారు. కౌంటర్ లు పడుతున్నా అటాకింగ్ ను ఏమాత్రం వదలకుండా టీఆర్ఎస్ ఫాలో అవుతున్న ఈ గేమ్ ప్లే ఢిల్లీ నేతలను సైతం తెలంగాణ లో తిరిగేలా చేస్తోంది.
ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం ఉండటంతో కారు పార్టీ ని ఢిల్లీ నేతలు రోడ్డుమీదకి లాగేస్తారో లేదా తనదైన వ్యూహాలతో కేసీఆరే జాతీయ పార్టీలకు ఝలక్ ఇస్తారో చూడాలి.