బీజేపీ సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సందర్భంగా తుక్కు గూడాలో జరిగిన సభలో బిజెపి నేతలు అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రసంగాలపై గులాబీ దళం దండయాత్ర చేసింది. తెలంగాణకు బీజేపీ చేసిందేంటో చెప్పాలంటూ నిలదీస్తోంది.
కేంద్ర మంత్రి అమిత్ షా పచ్చి అబద్దాలు మాట్లాడి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారన్నారు బాల్క సుమన్. పచ్చి అబద్ధం మాట్లాడిన అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుటుంబ పాలనపై మాట్లాడే అమిత్ షా బీజేపీలో నేతల వారసులు పదవుల్లో లేరా అని ప్రశ్నించారు బాల్క సుమన్ . కేటీఆర్ ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకుంటే తప్పు ఎలా అవుతుందన్నారు. క్రికెట్ ఆడటం కూడా రాని అమిత్ షా కొడుకు బీసీసీఐ పదవిలో ఎలా ఉంటారని నిలదీశారు. తమ పార్టీలో కుటుంబ పాలన నిషేధిస్తూ దమ్ముంటే బీజేపీ కార్యవర్గంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. 75ఏళ్లకే పార్టీలో రిటైర్‌మెంట్ ఉండాలన్న మోదీ ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు.
దేశాన్ని అప్పుల్లో ముంచిన బీజేపీ లీడర్లా తమను అడిగేదీ అని ప్రశ్నించారు బాల్క సుమన్. తెలంగాణ అప్పులు జీఎస్‌డీపీలో 27 శాతమే.. దేశం అప్పు జీడీపీలో 60 శాతం ఉందన్నారు. దీనిపై బీజేపీ నేతలు ఏమంటారని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులను ఆదానీ, అంబానీలకు కేంద్రం దోచి పెడుతోందన్నారు. తాము చేసిన అప్పులను కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టామన్నారు. మోదీ అప్పులు తెచ్చి దేశంలో ఏం ఘనకార్యం చేశారో చెప్పాలన్నారు.
బీజేపీకి ఎందుకు తెలంగాణలో ఎందుకు అవకాశం ఇవ్వాలని ప్రశ్నించారు బాల్క సుమన్. రెండు సార్లు దేశంలో అధికార మిస్తే దేశాన్ని బ్రష్టుపట్చించారని విమర్శించారు. తెలంగాణలో సింగరేణి బొగ్గు బ్లాకులు అమ్మడానికి బీజేపీ కి అధికారమివ్వాలా అని నిలదీశారు అధికారం కోసం సంజయ్ బిచ్చగాడిలా ప్రాధేయ పడటం కాదని.. మోడీని తెలంగాణ ప్రాజెక్టుల కోసం ప్రాధేయపడాలని సూచించారు.
అమిత్ షా తెలంగాణపై మాయల ఫకీర్ లా దండయాత్రకు వచ్చారని... రెండు జాతీయ పార్టీల సభల్లో తెలంగాణ నినాదం ఊసే లేదన్నారు సుమన్. రాహుల్ బీజేపీని అనలేదు...అమిత్ షా కాంగ్రెస్‌ను ఏమి అనలేదు... దీన్ని బట్టే తెలంగాణ పై ఆ రెండు పార్టీల కుట్ర అర్థమవుతోందని గుర్తు చేశారు. తెలంగాణ పచ్చ బడుతుంటే రెండు జాతీయ పార్టీల నేతల కళ్ళు ఎర్రబడుతున్నాయని కడుపులు మండుతున్నాయన్నారు. గుజరాత్ గ్యాంగ్‌కు తెలంగాణ బీజేపీ నేతలు బానిసలయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణను పొడిచేందుకు గుజరాత్ వాడు కత్తి ఇస్తే పొడుస్తున్నది తెలంగాణ బీజేపీ నేతలన్నారు. నిన్న జరిగిన సభ తెలంగాణను గుజరాత్‌కు బానిస చేసే ప్రయత్నమేనన్నారు. ఈ కుట్ర ను తెలంగాణ ప్రజలు ఛేదించాలని రిక్వస్ట్ చేశారు.
అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీగా ఉండబట్టే హైద్రాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగడం లేదన్నారు సుమన్. ఇక్కడ కూడా వివక్షే అని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికల మీద బీజేపీకి ప్రేమ ఉంటే పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని... కేసీఆర్ ప్రత్యామ్నాయ ఎజెండా తెర పైకితెస్తారనే భయంతోనే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణపై దండ యాత్రకు దిగాయన్నారు.
జనాలను గోస పెట్టడమే బీజేపీకి అలవాటన్నారు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. నిన్నటి సభతో అదే వైఖరి ప్రదర్శించారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జనాలను ఇబ్బంది పెడుతున్నారని ఉదహరించారు. తెలంగాణలో అదే జరగాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. అధికారం కోసం తాము పాదయాత్ర చేయలేదని అమిత్‌షా అంటే.. బండి సంజయ్ మాత్రం అధికారం కోసం ప్రాధేయ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారమిస్తే ఏదేదో చేస్తామంటున్న బీజేపీ లీడర్లు.. తమ పార్టీ అధికంలో ఉన్న రాష్ట్రాల్లో ఇపుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
నీళ్లు నిధులు నియమాకాలపై టీఆర్‌ఎస్ ఇప్పటికే ఎంతో చేసిందని.. బీజేపీ చేయడానికి ఏముందన్నారు మెతుకు ఆనంద్. మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని తెలియజేశారు. మిషన్ భగీరథకు 50 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారని.. ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో0.01శాతం మాత్రమేనన్నారు. బీజేపీ స్టీరింగ్ అంబానీ, ఆదానీల చేతుల్లో ఉందన్నారు.
బీజేపీ వాళ్లకు తెలంగాణపై ప్రేమ లేదని.. అధికారంపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. తాము అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలు నెరవేర్చడమే కాదు... మానిఫెస్టోలో పెట్టని హామీలను కూడా నెరవేర్చామన్నారు. విభజన హామీలు ఏమయ్యాయో చెప్పాలని బీజేపీ వాళ్లను నిలదీశారు. 15 లక్షలు ప్రతి కుటుంబానికి వారి ఖాతాల్లో వేశారా అని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని అడిగారు. మిషన్ భగీరథకి 19 వేల కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ సూచిస్తే ఇచ్చారా అని క్వశ్చన్ చేశారు.
ఉపాధి హామీకి ఇంతకుముందు 98వేల కోట్లు ఉండగా ఇప్పుడు 73వేల కోట్లకు కుదించారని తెలిపారు ఎర్రబెల్లి. ఉపాధి హామీ అవినీతిరహితంగా రాష్ట్రంలో అమలు అవుతున్నదని బీజేపీ వాళ్లే పార్లమెంటులో ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. సైనిక్ స్కూల్‌కి 49.32 ఎకరాల స్థలాన్ని ఎల్కతుర్తి గ్రామంలో కేటాయించామని తెలిపారు. దానికి భూమి ఇవ్వలేదని పచ్చి అబద్దాలు చెప్పారన్నారు.