తెలంగాణ రాజకీయ పర్యాటక సీజన్ కొనసాగుతోందని ట్వీట్ చేశారు. తెలంగాణలో పొలిటికల్ టూరిజం సీజన్ కంటిన్యూ అవుతుందని... ఇవాళ మరో టూరిస్టు వచ్చారు.. తిన్నారు.. తాగారు.. వెళ్లారని విమర్శించారు. ఎనిమిదేళ్లలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని.. ఇవ్వలేదని.. ఇవాల్టికి కూడా అదే వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు కేటీఆర్. బీజేపీ అంటే బక్వాస్ జుమ్మా పార్టీ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. 






బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసగించిన అమిత్‌షా టీఆర్‌ఎస్, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 


అధికార పార్టీ టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని, డబుల్ ఇంజిన్ సర్కార్‌ వస్తేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సీఎం కేసీఆర్‌‌ను తరిమేందుకు రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని, ఆ నిజాం ప్రభువును గద్దె దించేందుకే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేశారని పేర్కొన్నారు. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని, తెలంగాణ ప్రజలను రజాకార్ల పాలన నుంచి విముక్తి కల్పించేందుకు యాత్ర చేపట్టారని అమిత్ షా అన్నారు. అయితే MIM పార్టీకి భయపడి సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచనదినాన్ని జరపలేదని వ్యాఖ్యానించారు.


కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన అమిత్ షా.. 


బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర (Bandi Sanjay Praja Sangrama Yatra) ముగింపు సందర్భంగా తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన భారీ సభలో మాట్లాడుతూ... తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణను సీఎం కేసీఆర్ మరో బెంగాల్ చేస్తున్నారు. కేసీఆర్‌ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.లక్ష రుణమాఫీ హామీ అమలు చేయలేదని విమర్శించారు. బీజేపీ గెలిస్తే నీళ్లు, నిధులు, నియామకాలు హామీ నెరవేరుతుందన్నారు. ఇంత అవినీతి ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడలేదన్నారు.