Adani power deal Politics: అమెరికాలో గౌతం అదానీపై నమోదు అయిన కేసు ఏపీ రాజకీయాల్లో హైలెట్ అవుతోంది. దీనికి కారణం ఏపీ సీఎం జగన్ అదానీ నుంచి రూ.1750 కోట్లు లంచం పుచ్చుకున్నారని అక్కడి పత్రాల్లో ఉండటమే. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. విచిత్రంగా ఈ అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీతో పాటు కాంగ్రెస్ కూడా ఒకటే డిమాండ్ చేస్తోంది. దమ్ముంటే విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని వైసీపీ సవాల్ చేస్తోంది. ఆసక్తికరంగా షర్మిల కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఒప్పందాలను రద్దు చేయాలని అంటున్నారు. 


దమ్ముంటే ఒప్పందాలను రద్దు చేయాలంటున్న వైసీపీ


అమెరికాలో కేసు నమోదు అయిన తర్వాత ఏపీలో దుమారం రేగింది. జగనమోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు రావడంతో వైసీపీ ఘాటుగా స్పందించింది. ఆ పార్టీ నేత పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి దుమ్ముంటే ఆ ఒప్పందాలను రద్దు చేయాలని సవాల్ చేశారు. తాము అదానీతో నేరుగా డీల్ కుదుర్చుకోలేదని.. సెకీతో ఒప్పందం చేసుకున్నామని స్పష్టం చేశారు. సెకీ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటున్నారు. ప్రతి రోజూ  దాదాపుగా ఇదే సవాల్ చేస్తున్నారు. వైసీపీ నేతల ధైర్యం ఏమిటో కానీ.. వారు ఇలా సవాల్ చేయడం ఆసక్తికరంగా మారింది. 


Also Read: అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే


షర్మిలది కూడా అదే డిమాండ్ !


ఇప్పటి వరకూ జగన్‌తో పలు విషయాలపై విబేధిస్తూ వచ్చిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఈ అదానీ పవర్ డీల్ విషయంలో వైసీపీ వాదనను సమర్ధిస్తున్నారు. తక్షణం విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలంటున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ దృక్కోణం వేరు..కాంగ్రెస్ దృక్కోణం వేరు. ఒప్పందాలను రద్దు చేసి విచారణ చేయించాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. అమెరికా కోర్టులే జగన్ రూ. 1750 కోట్లు లంచం తీసుకున్నాయని చెబుతున్నారని అలాంటప్పుడు ఎందుకు విచారణ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 


Also Read: CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!


ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని చంద్రబాబు !


అదానీ పవర్ విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  దూకుడుగా నిర్ణయం తీసుకోవడం కంటే..అన్ని విషయాలు తెలుసుకుని ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు. ముందుగా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేస్తే పెట్టుబడుల పరంగా ఏపీకి బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాల వల్ల ఏపీకి వచ్చేందుకు పెట్టుబడిదారులు వ్యతిరేకంగా ఉన్నారని ఇప్పుడు ఇలాంటివి చేయడం వల్ల మరింత మైనస్ అవుతుందని అనుకుంటున్నారు. ఒప్పందం ప్రకారం ఇంకా అదానీ సంస్థ నుంచి విద్యుత్ రావడం లేదు. దీంతో ఆ సంస్థతో సంప్రదింపులు జరిపి ఆరోపణలు ఎదుర్కొంటున్నందున రద్దు చేసుకోవాలని కోరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదానీ సంస్థే రద్దు చేసుకుంటే... ఏపీకి ఇబ్బంది ఉండదు. అయితే ఈ అంశంపై స్పష్టత వచ్చాక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా విచారణ చేయిస్తామని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. అంటే ఏదో ముంచుకొచ్చినట్లుగా చర్యలు తీసుకోవడం కాకుండా.. పకడ్బందీగా ఎవరూ తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారని భావించవచ్చు.