కోనసీమ: ఇటీవల ఏబీపీ దేశం తో మాట్లాడిన ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అతి త్వరలోనే అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి లోనికి వెళ్లనున్నారని... మళ్లీ మరొక ప్రెస్‌మీట్‌లో కూడా ఆయన అవే వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అయితే ఓ మాజీ మంత్రితోపాటు ఆయన తనయుడు కూడా లోనికి వెళ్తారని స్పష్టం చేశారు.
ఇప్పుడు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి..? వైసీపీ పాలనలో మంత్రిగా పనిచేసింది ఎవరు..? అంత అవినీతికి పాల్పడ్డారా... వారి హయాంలో ఎటువంటి అవినీతికి పాల్పడ్డారు.. అనే అంశాలపైనే ఏపీలో చర్చ జరుగుతోంది.
కోనసీమ నుంచి వైసీపీలో ఇద్దరు మంత్రులు..
కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యల వెనుక వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై పెద్దఎత్తున పోస్ట్‌మార్టం జరుగుతోందని మాత్రం ఖచ్చితంగా అర్ధమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రులగా వ్యవహరించారు. గమనించాల్సిన అంశం ఏంటంటే రెండో క్యాబినెట్ విస్తరణలో ఎంతో మంది సీనియర్ మంత్రులు సైతం పక్కన పెట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఇద్దరిని మాత్రం కొనసాగించారు. అంతేకాదు వారు అంతకు ముందు ప్రాతినిధ్యం వహించిన శాఖలకంటే మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించారు. ఉదాహరణకు కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు లాంటి పార్టీలోని ముఖ్యులు సైతం మంత్రి పదవులను కోల్పోయే పరిస్థితి తలెత్తగా.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఇద్దరు మంత్రులను కొనసాగించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. కుల సమీకరణాలలో అదృష్టం వీరిని వరించిందని భావించారు. అయితే తాజాగా కార్మికశాఖ మంత్రి తాజా వ్యాఖ్యలతో మాత్రం ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది..
సుభాష్‌ను దూరం పెట్టిన ఇద్దరు మంత్రులు..?
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంనుంచి పినిపే విశ్వరూప్ రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీలో కీలక యువ నేతగా ఉన్న వాసంశెట్టి సుభాష్ తల్లి అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికైన తరువాత ఛైర్మన్ పదవి విషయంలో అప్పటి మంత్రి విశ్వరూప్‌కు, ఇప్పటి మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు తారాస్థాయిలో విభేధాలు వచ్చినట్లు చెబుతుంటారు. ఆ తరువాత ఆర్థికంగా తనను వాడుకుని మోసం చేశారని, రూ. రెండు కోట్లు తనకు ఇవ్వాలని కూడా సుభాష్ ఆరోపించారు. ఆ తరువాత అమలాపురం అల్లర్ల కేసులో సుభాష్ పేరు నమోదు చేయడం, ఇలా వీరి మధ్య దూరం అయితే పెరిగింది. ఆ తరువాత అప్పటి ఇంచార్జి మంత్రి మిథున్‌రెడ్డి మధ్య వర్తిత్వం వహించినా ఏమాత్రం తగ్గని సుభాష్ టీడీపీలోకి చేరారు. అనూహ్యంగా రామచంద్రపురం టిక్కెట్టు దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రి కూడా అయ్యారు. ఇదిలా ఉంటే ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అదే సామాజికవర్గానికి చెందిన సుభాష్‌ను అన్నివిధాల అనగదొక్కాలని చూశారని ఆరోపణలున్నాయి. ఒకే పార్టీలో, ఒకే సామాజికవర్గానికి చెందిన వారు అయినప్పటికీ చెల్లుబోయిన వేణు, వాసంశెట్టి సుభాష్ ఎడమొహం పెడమోహంగా ఉండేవారని చెబుతుంటారు.
మాజీ మంత్రి, ఆయన కుమారుడు వారేనా..?
కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు ఆ మాజీ మంత్రి గురించే అన్న చర్చ అయితే తీవ్రంగా జరుగుతోంది. తొలుత జిల్లా కేంద్రంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి గురించి అనుకున్నారు చాలా మంది. అయితే ఆయన కుమారుడు కూడా అని వ్యాఖ్యానించడంతో ఓ నిర్ధారణకు వస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి, ఆయన కుమారుడు గురించే ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. ద్రాక్షారామం శైవక్షేత్రం ఆదాయం నుంచి దేవాదాయ భూముల వ్యవహారం, పలు అంశాల్లో అవినీతి జరిగిందని పలుసార్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. ఇప్పుడు ఆయన నోటినుంచే ఓ మాజీ మంత్రి, ఆయన కుమారుడు లోనికి (జైలుకు) వెళ్లబోతున్నారన్న వ్యాఖ్యలు ఆయన గురించే అని చర్చ ఊపందుకుంది.
తనపై వస్తున్న ఆరోపణలపై దేనికైనా సిద్ధం..
రామచంద్రపురంలో వైసీపీ ప్రత్యర్ధి పిల్లి సూర్యప్రకాష్ తనపై బుదర జల్లేందుకు కొందరిని పురికొల్పి అవాస్తవ ఆరోపణలు చేయిస్తున్నాడని, ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సవాలు విసిరారు. ఎవ్వరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని, తనపై ఇష్టానుసారంగా తప్పుడు ఆరోపణలు చేసి బురదజల్లాలని ప్రయిత్నిస్తే లీగల్‌గా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.