Police arrested former CID ASP Vijay Paul: మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ఏపీ సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. మొదట ఆయన విచారణకు సహకరించలేదు. తర్వాత విచారణకు హాజరవుతున్నా... విచారణలో పోలీసుల్నే బెదిరించేలా దబాయించారన్న ఆరోపణలు వచ్చాయి. తర్వాత విచారణ అధికారిగా ప్రకాశం ఎస్పీని నియమించారు. తాజాగా ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించడంతో విచారణకు సహకరించని ఆయనను అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నారు. 


రఘురామపై సుమోటోగా దేశద్రోహం కేసు పెట్టిన విజయ్ పాల్        


ఎంపీగా ఉన్న  రఘురామ కృష్ణరాజు రచ్చబండ పేరుతో ప్రతి రోజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై కుట్ర పన్నుతున్నారని  జగన్ హయాంలో సీఐడీ ఏఎస్పీగా ఉన్న విజయ్ పాల్ సుమోటోగా కేసు నమోదు చేసి.. తన పుట్టిన రోజు నాడు హైదరాబాద్ ఇంట్లో ఉన్న ఆయనను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో అరెస్టు చేస్తే అక్కడి కోర్టులో హాజరు పరిచి పీటీ వారెంట్ పై ఏపీకి తరలించాల్సి ఉంటుంది. కానీ అలాంటిదేమీ లేకుండా అప్పటికప్పుడు ఏపీకి తరలించారు. ఆ రోజు రాత్రి సీఐడీ కార్యాలయంలో ఉంచి.. తనపై భౌతిక దాడి చేశారని.. కస్టోడియల్ టార్చర్ చేశారని ఆయన కోర్టులో ఫిర్యాదు చేశారు.  


Also Read: అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే


అరెస్టు చేసిన రోజు రాత్రి చిత్ర హింసలు పెట్టారని ఆరోపణలు          


అక్కడ్నుంచి చాలా పెద్ద హైడ్రామా నడిచింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రికార్డుల్ని తారుమారు చేశారని ఆరోపణలు రావడంతో సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో టెస్టులు చేయించారు. గాయాలయినట్లుగా తేలడంతో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అప్పట్నుంచి రఘురామ తనపై కస్టోడియల్ టార్చర్ కేసులో పోరాడుతున్నారు. అప్పటి పోలీసుల ఫోన్ రికార్డులు భద్ర పరచాలని హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లు విచారణలోనే ఉన్నాయి. 


Also Read:  : తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం, అసలేం జరిగింది - ఎవరి వర్షన్ ఎలా ఉందంటే!


జగన్ తో పాటు పలువురు ఐపీఎస్‌లకు చిక్కులు          


ఈ లోపు ప్రభుత్వం మారడంతో రఘురామ రఘురామ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన న్యాయ సలహా తీసుకుని కేసును నమోదు చేయించారు. ఈ కేసులో అప్పటి సీఎం జగన్ కూడా నిందితుడిగా ఉన్నారు. మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇందులో నిందితులుగా ఉన్నారు. విజయ్ పాల్ రిటైరైపోయినా .. ప్రత్యేకంగా పొడిగింపు ఇచ్చి ఓఎస్డీగా నియమించి  వైసీపీ రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టి వేధించేందుకు ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విజయ్ పాల్ అరెస్టుతో రఘురామపై కస్టోడియల్ దాడి కేసు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది.