White House: ప్రధాని మోదీ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సమావేశం అనంతరం ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వాల్ స్ట్రీట్ జర్నల్ కు చెందిన సబ్రీనా సిద్ధిఖీని ఆన్ లైన్ లో వేధించడాన్ని తాజాగా వైట్ హౌజ్ ఖండించింది. వేధింపుల గురించి తమకు నివేదికలు అందినట్లు వైజ్ హౌజ్ వర్గాలు తెలిపాయి. భారత్ లో ఉన్న ప్రజాస్వామ్యంపై ప్రధాని మోదీని ప్రశ్నించారు సిద్ధిఖీ. ముస్లింలు సహా ఇతర మైనారిటీల హక్కుల విషయంపై ప్రశ్న సంధించారు. ఆ తర్వాత నుంచి ఆ జర్నలిస్టుపై ఆన్ లైన్ లో వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు చాలా తీవ్రంగా ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించింది. సబ్రినా సిద్ధిఖీకి జరుగుతున్న వేధింపులపై వైట్ హౌజ్ స్పందన గురించి యూఎస్ జాతీయ భద్రతా మండలిలో స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స కో ఆర్డినేటర్ అయిన జాన్ కిర్బీని అడిగారు. దీంతో ఆ జర్నలిస్టుపై వేధింపుల గురించి తమకు నివేదికలు అందాయని, ఓ విలేకరిపై ఇలాంటి వేధింపులు ఆమోదయోగ్యం కాదని కిర్బీ తెలిపారు. అలాంటి వేధింపులను వైట్ హౌజ్ ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
భారతీయుల నుంచి ఆన్ లైన్ వేధింపులు ఎదుర్కొంటున్న వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ సబ్రినా సిద్ధిఖీ తన ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేశారు. టీమిండియా టీషర్టు వేసుకుని తన తండ్రితో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్లు ఆ ఫోటోలో కనిపిస్తోంది. మరో ఫోటోలో సిద్దిఖీ టీమిండియా జర్సీ ధరించి సెల్ఫీ తీసుకున్నట్లు ఉంది. తన తండ్రి భారత్ లోనే జన్మించారని తన ఫోటోలకు క్యాప్షన్ గా రాసుకొచ్చారు సిద్ధిఖీ.
వైట్‌హౌజ్‌లో ప్రెస్‌మీట్..
ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి అమెరికాలో అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. రిపోర్టర్లు ఆయనను కొన్ని ప్రశ్నలు వేయగా... మోదీ అన్నింటికీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే వాల్ స్ట్రీట్ జర్నల్ కు చెందిన సిద్ధిఖీ ఊహించని ప్రశ్న వేశారు. "ఇండియాలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఉందని, మైనార్టీలపై వివక్ష కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ సమాధానమేంటి..? మతపరమైన వివక్ష లేకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు" అని ఆమె అడిగారు. ప్రధాని మోదీ ఈ ప్రశ్నను విని ఒకింత అసహనానికి గురయ్యారు. "మీరు మాట్లాడుతున్నది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది" అంటూ బదులిచ్చారు. ఆ తరవాత తన అభిప్రాయాలను వెల్లడించారు.
"మీరు అడుగుతున్నది వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మాది ప్రజాస్వామ్య దేశం. అదే మాకు స్ఫూర్తి. ప్రజాస్వామ్యం మా రక్తంలోనే ఉంది. అదే మా శ్వాస, మా జీవన విధానం. మా రాజ్యాంగంలోనూ ఇదే ఉంది. మానవ విలువలు, హక్కులకు స్థానం లేని చోట ప్రజాస్వామ్యం ఉండదు. ఎక్కడైతే డెమొక్రసీ ఉంటుందో అక్కడ వివక్షకు తావుండదు. మా దేశంలో వివక్ష అనేదే లేదు. అది కులం కావచ్చు, మతం కావచ్చు.. ఇంకే విధంగా కూడా ఎవరిపైనా ద్వేషాలు లేవు. మా నినాదం ఒక్కటే. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్" అని అన్నారు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial