Robot Arm: ఒక్కోసారి విపరీతమైన పని ఉంటుంది. అన్ని అర్జెంట్ పనులే.. అన్ని ఏకకాలంలో చేయాల్సినవే. అలాంటి సమయంలో ఒత్తిడిలో ఉండే చాలా మంది.. 'నాకేం నాలుగు చేతులు లేవు, ఉన్న రెండు చేతులు ఖాళీగా లేవు' అని గట్టిగా అరిచి చెబుతుంటారు. చేయాల్సిన పని ఎక్కువైనప్పుడు, చేయాల్సింది ఒక్కరే అయినప్పుడు ఇలాంటి మాటలు అంటుంటారు. ఇలాంటి మాటలు చాలా సహజంగా నోటి నుంచి వచ్చేస్తుంటాయి. మనిషికి రెండే చేతులు ఉంటాయి, అంతకు మించి చేతులు ఉండవు.. కోపంలో, చిరాకులో, ఒత్తిడిలో అలా అంటుంటారని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఆ మాటలను చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు.


మనిషికి రెండు చేతులు కాదు, ఏకంగా ఆరు చేతులు ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో నాలుగు రోబో చేతులు తయారు చేశారు. వాటిని వెనక వీపుకు తగిలించుకుంటే చాలు. రెండు చేతులే ఉండాల్సిన మనుషులకు ఏలియన్లకు  ఉన్నట్లుగా ఆరు చేతులు వచ్చేస్తాయి. స్పైడర్ మ్యాన్ సినిమాలో విలన్ కు ఉన్నట్లుగా వీపు నుంచి ఈ చేతులు మన చేతుల్లాగే పనులు చేస్తుంటాయి.






ఇష్టమొచ్చినట్లుగా స్వేచ్ఛగా ఉండాలన్న ఆలోచనతో..


ఈ విచిత్రమైన ఆలోచనకు రూపం ఇచ్చి ప్రాణం పోసింది ఇనామి బృందం. ఈ ఇనామి బృందం ఇలాంటి వింత రోబోలను ఇప్పటికే కొన్ని తీసుకువచ్చింది. టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన ఈ మసాహికో ఇనామి శాస్త్రవేత్తల బృందం.. జిజాయ్ అనే ఆలోచనతో కొత్త తరహా ఆలోచనలతో రోబోలకు రూపం ఇస్తోంది. జిజాయ్ అంటే జపాన్ భాషలో స్వయం ప్రతిపత్తి అని, ఒకరికి ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్ఛగా జీవించడం అనే అర్థాలను సూచిస్తుంది. 






ఈ రోబో చేతులకు రూపమివ్వడానికి అవే స్ఫూర్తి అంట


సంప్రదాయ జపనీస్ తోలు బొమ్మలాట నుంచి, నవలా రచయిత్రి యసునారి కవాబాటా రాసిన ఓ చిన్న హార్రర్ కథ నుంచి స్ఫూర్తి పొంది ఈ రోబో చేతులను రూపొందించినట్లు శాస్త్రవేత్త ఇనామి వెల్లడించారు. ఓ సంగీతకారుడికి తన వాయిద్యం ఎలా శరీరంలో ఓ భాగంగా మారిపోతుందో.. ఈ రోబో చేతులు కూడా శరీరంలో ఓ భాగంగా మారిపోతాయని ఆకాంక్షిస్తున్నారు ఇనామి. ఈ రోబో చేతులు మనుషులకు ఏమాత్రం ప్రత్యర్థి కాదని, కానీ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 


జిజాయ్ ఆర్మ్స్ ప్రచార వీడియో


శాస్త్రవేత్తలు ఈ జిజాయ్ ఆర్మ్స్ కు చెందిన ప్రచార వీడియోను కూడా విడుదల చేశారు. 25 సెకన్ల పాటు ఉన్న ఒక వీడియోలో మొదట ఓ అమ్మాయి బాలెట్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. తనకు బిగించిన రోబో చేతులు.. తన నిజమైన చేతుల్లాగే కదలడం, భంగిమలు ఇవ్వడం వీడియోలో కనిపిస్తుంది. చివర్లో జిజాయ్ రోబో చేతులు ధరించిన మరో అమ్మాయి తన వద్దకు వచ్చి ఈ రోబో చేతులతో తనను ఆత్మీయంగా హత్తుకుంటుంది. మరో వీడియోలో అమ్మాయి రోబో చేతులు ధరించి నృత్యం చేస్తూ కనిపిస్తుంది. ఇందులో తను మనసుతోనే రోబో చేతులను కదిలించడం చూడొచ్చు.