PM Modi in MP: భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం, సమాన హక్కులు ఉండాలని చెబుతోందని అలాంటి దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(ఏకరూప చట్టం)  అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న మోదీ తొలిసారి బహిరంగంగా యూనిఫాం సివిల్ కోడ్ పై స్పందించారు. ఒకే కుటుంబంలోని వేర్వేరు సభ్యులకు వేర్వేరు నిబంధనలు ఉండటం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రధాని ఇవాళ మధ్యప్రదేశ్ లో 'మేరా బూత్ సబ్సే మజ్‌బూత్' ప్రచారంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. త్రిపుల్ తలాక్ ఇస్లాం నుంచి విడదీయరానిదే అయితే.. ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్ వంటి ముస్లిం మెజారిటీ ఉన్న దేశాల్లో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. సిరియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లో కూడా త్రిపుల్ తలాక్ పాటించడం లేదని తెలిపారు. 90 శాతం సున్నీ ముస్లింలు ఉన్న ఈజిప్టు.. 80- 90 ఏళ్ల క్రితం నుంచే త్రిపుల్ తలాక్ ను రద్దు చేసిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు. 


'సోదరీమణులకు, కుమార్తెలకు అన్యాయం చేయడమే'


త్రిపుల్ తలాక్ కోసం వాదించే వారు.. ముస్లిం ఓటు బ్యాంకు కోసం తాపత్రయ పడుతున్నారని, వారంతా ముస్లిం కుమార్తెలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ప్రధాని విమర్శించారు. త్రిపుల్ తలాక్ కేవలం మహిళలకు సంబంధించినది మాత్రమే కాదని, మొత్తం కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని అన్నారు. ఎంతో ఆశతో కుటుంబ సభ్యులు ఎవరితోనైనా పెళ్లి చేసుకున్న మహిళను త్రిపుల్ తలాక్ చెప్పి వెనక్కి పంపిస్తే ఆ తల్లిదండ్రులు, సోదరులు ఎంత ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారో, ఎంత బాధ అనుభవిస్తారో మాటల్లో చెప్పలేమన్నారు. 


'ముస్లింలకు బీజేపీ శ్రేణులు అవగాహన కల్పించాలి'


ముస్లిం కుమార్తెలను అణచి వేయడానికి స్వేచ్ఛ ఉండేలా కొందరు త్రిపుల్ తలాక్ అనే కత్తిని వేడాలదీయాలని అనుకుంటున్నారని ప్రధాని విమర్శించారు. అందుకే ముస్లిం సోదరీమణులు, కూతుళ్లు ఎప్పుడూ బీజేపీ వెంట, మోదీ వెంటే ఉంటారని పేర్కొన్నారు. పస్మండ ముస్లింలు రాజకీయాలకు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, బీజేపీ శ్రేణులు వెళ్లి ముస్లింలకు ఈ విషయాన్ని వివరించి వారికి అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా వారు అలాంటి వారి బారిన పడకుండా ఉంటారని అన్నారు. బీజేపీ అంతా అభివృద్ధి రాజకీయాలే తప్పా.. బుజ్జగింపు రాజకీయాలు చేయదని మోదీ చెప్పారు. రాష్ట్రంలో దళితులు, మహాదళితులు మధ్య చిచ్చు పెట్టి కుల రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 


Also Read: Cyclone Biparjoy: బిపర్జాయ్ గత రికార్డులను తుడిచి పెట్టేసింది- సుదీర్ఘ సైక్లోన్‌గా నమోదైంది


'ఔర్ ఏక్‌బార్‌ మోదీ సర్కారు'


ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడం ఖాయమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 2024లో  బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని విపక్ష పార్టీలు ఆందోళన చెందుతుండటం స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మరోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చి తీరుతుందని అందుకే ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నట్లు విమర్శించారు. 






Join Us on Telegram: https://t.me/abpdesamofficial