Manipur Violence: దాదాపు రెండు నెలలుగా మణిపూర్ అట్టుడికిపోతోంది. రెండు తెగల మధ్య వైరం రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగడానికి కారణం అయింది. మే 3వ తేదీ నుంచి మణిపూర్ లో హింస రాజ్యమేలుతోంది. రాష్ట్ర, కేంద్ర బలగాలను మోహరించినా పరిస్థితులు అదుపులోకి రాలేదు. అర్ధరాత్రి వేళ బాంబు దాడులు, ఇళ్లకు నిప్పు పెట్టడం, తుపాకుల మోత మారుమోగుతోంది. మణిపూర్‌లో పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. చాలా రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యకలాపాలు సాగడం లేదు. అయితే తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చింది బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం. అనుమతి లేకుండా సెలవులు తీసుకున్న వారికి, విధులకు హాజరుకాని లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వబోమని తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. 


కట్టడిలో భాగంగా రాష్ట్ర సర్కారు చర్యలు


రాష్ట్రంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులను ఎప్పట్లాగే కార్యాలయాలకు రప్పించి క్రమంగా సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు బీజేపీ రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుతం కూడా ప్రభుత్వ కార్యాలయాలు రోజూ తెరుచుకుంటున్నప్పటికీ.. నామమాత్రపు సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. 


'విధులకు రాని ఉద్యోగుల వివరాలు పంపండి'


రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా అధికారిక విధులకు హాజరు కాలేకపోయిన ఉద్యోగుల వివరాలను వారి పేరు, హోదా, ఈఐఎన్, చిరునామా వంటి వివరాలతో జూన్ 28 వ తేదీలోపు అందించాలని పరిపాలనా కార్యదర్శులను రాష్ట్ర సర్కారు ఆదేశించింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ఆదివారం దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో హింసను కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కేంద్ర పెద్దలతో ఆయన చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఆయన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన్న నిర్ణయాన్ని ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో జూన్ 13వ తేదీ నుంచి ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదని కూడా చెప్పారు. 


రాష్ట్ర సర్కారు నిర్ణయంపై ఉద్యోగుల అసంతృప్తి


కొన్ని రోజులుగా మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా హింస చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఘటనలు జరుగుతాయో ఊహించడానికి కూడా అందడం లేదు. ఇలాంటి సమయంలో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆశించడం సరికాదని పలువురు ఉద్యోగులు అంటున్నారు. 


మే 3 నుంచి అల్లర్లు..


ప్రశాంతతకు నెలవైన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మే 3వ తేదీన ఒక్కసారిగా హింస చెలరేగింది. ఇక్కడి జనాభాలో అత్యధికులు మెయిటీ, కుకీ తెగల మధ్య వైరం మొదలైంది. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటూ సృష్టించిన హింసలో అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారమే 98 మంది మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బలగాలను మోహరించినా పరిస్థితిలో ఏమార్పూ కనిపించడం లేదు.