జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్, జేఈఈ మెయిన్ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్ మీటింగ్‌కు సంబంధించిన తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఐటీ కౌన్సిల్ సమావేశం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో తీసుకున్న తీర్మానాలను కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. నీట్, జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల మాదిరిగానే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను తెలుగుతోపాటు 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే 3,4 నెలల్లో మేధోమథన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో సహా చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ రెండు భాషల్లో మాత్రమే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అన్ని ఉన్నత విద్యా సంస్థల కోసం ఒకే ప్రవేశ పరీక్షను దృష్టిలో ఉంచుకుని దేశంలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల సంఖ్యను తగ్గించడంపై చర్చించారు. ప్రవేశ పరీక్షల సంఖ్యను తగ్గించడం మాత్రమే కాకుండా విద్యార్థులపై భారం పడుతుందని.. కోచింగ్ అవసరాలు కూడా తగ్గుతాయని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు.
తీర్మానంలోని ముఖ్యాంశాలివే..
➥ 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలు జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఐఐటీలు, ఎన్‌ఐటీలు మినహా దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో ఒకే పరీక్ష నిర్వహణకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నివేదికను 5 నెలల్లో ఇవ్వాలని ఈ బాధ్యతను ఐఐటీ ఢిల్లీకి అప్పగిస్తూ ఐఐటీ కౌన్సిల్ తీర్మానం చేసింది.
➥ అదేవిధంగా ఐఐటీలకు ఒక విజన్ ఉండాలని అలా రాబోయే 25 సంవత్సరాలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను ప్రతి ఐఐటీ రూపొందించుకోవాలని.. ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులతో కలిసి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఐఐటీ స్వల్పకాల విజన్ డాక్యుమెంట్‌ను సైతం సిద్ధం చేసుకోవాలని ఐఐటీ కౌన్సిల్ తీర్మానం చేసింది.
➥ పరిశ్రమల అవసరాల మేరకు ఎంటెక్ కోర్సులను రూపొందించాలని ఐఐటీ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఐఐటీ హైదరాబాద్ సమర్పించనుంది.
➥ ఐఐటీల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెరిట్ కమ్ మీన్స్(ఎంసీఎం) స్కాలర్‌షిప్, పాకెట్ అలవెన్స్ ను పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనిపై ఐఐటీ ఖరగ్‌పూర్ నివేదికను సమర్పించనుంది.
➥ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐటీల్లో క్రీడా కోటా రిజర్వేషన్ అమలు కోసం విధివిధానాల రూపకల్పన బాధ్యతను ఐఐటీ మద్రాస్‌కు అప్పగించింది. ఆర్ట్స్, ఇతర కోర్సుల్లో మల్టీ డిసిప్లినరీ విధానాన్ని ప్రారంభించనున్నారు. ఆయా కోర్సుల్లో ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్టులు మిళితమై ఉంటాయి.
➥ ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్(పీఎంఆర్‌ఎఫ్) రెండో విడతను అయిదేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించారు. ఏడాదికి 1000 మంది చొప్పున మొత్తం 5 సంవత్సరాల్లో 5000 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు ఈ ఫెలోషిప్ అందజేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఖరగ్‌పూర్, మద్రాస్, గువాహటి, భువనేశ్వర్ ఐఐటీల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులను ప్రారంభిస్తారు.