Bangladesh Violence: ఈ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్లు గురించి అర్థం కావాలంటే మన దేశానికి స్వాతంత్య్రం రోజులు గుర్తు చేసుకోవాలి. 1947లో భారత్ రెండు ముక్కలుగా విడిపోయింది. ప్రస్తుతమున్న బంగ్లాదేశ్‌ను అప్పట్లో ఈస్ట్ పాకిస్థాన్, ఇప్పుడున్న పాకిస్థాన్‌ను వెస్ట్ పాకిస్థాన్ అనే వాళ్లు. ఈ రెండింటిని కలిపి ఒక దేశంగా ప్రకటించారు. ఐతే... ఈ రెండు దేశాల మధ్య దూరం 2వేల 2వందల 4 కిలోమీటర్లు..! ప్రతి 50 కిలోమీటర్లకే యాస, భాష, సంస్కృతి మారిపోతుంది. మరి... ఇన్ని కిలోమీటర్లు అంటే ఇంకా ఎన్నో అంతరాలు..! ఇదే అప్పటి ఈస్ట్ పాకిస్థాన్‌లో ఆగ్గి రాజేసింది. ప్రత్యేక దేశ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. 


30 శాతం రిజర్వేషన్‌ చిచ్చు


ఏదైతేనేం 1971లో పాకిస్థాన్ నుంచి ఈస్ట్ పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా అవతరించింది. 1947లో బ్రిటీష్ నుంచి స్వాతంత్య్రం పొంది.. 25 ఏళ్లకే పాకిస్థాన్ నుంచి స్వాత్రంత్ర్యం పొందడం అంటే మాటలు కాదు. ఎందరో నేతల త్యాగ ఫలితం వారికి ప్రత్యేక దేశం సిద్ధించింది. అందుకే.. 1971 ఫ్రీడమ్ ఫైట్‌లో పాల్గొన్న వారికి విద్య, ఉపాధి అవకాశాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు 1972లో అప్పటి ప్రధాని షేక్ ముజిబర్ రెహ్మాన్ ఆదేశాలిచ్చారు. ఈయన ఎవరో కాదు.. నిన్నటి వరకు ప్రధానిగా ఉన్న షేక్ హాసినా తండ్రి..! 


మూడో తరానికి కూడా ఇవ్వడంపై రగిలిన యువత


యస్... ఫ్రీడమ్ కోసం ఎందరో త్యాగాలు చేశారు కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చారు కరెక్టే. వాళ్లతో పాటు వాళ్ల కొడుకులకు కూడా ఇచ్చారు. అక్కడితో ఆగిపోలేదు వాళ్ల మనవళ్లకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. తాత వీరుడని మూడో తరం కూడా దాని ఫలాలు తింటానంటే కరెక్టేనా..? ఇదే ప్రస్తుత వివాదానికి మెయిన్ కారణం. అసలే బంగ్లాదేశ్‌లో 56 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. కేవలం 44 శాతమే ఓపెన్ కేటగిరీ. ఆ 56 శాతంలో 30 శాతం ఫ్రీడమ్ కోటానే. దీని వల్ల యువత విద్య, ఉపాధి అవకాశాల్లో నష్టపోతున్నామని భావించి కోపోద్రిక్తులపై  ఉద్యమ బాటపట్టారు. ఓ వైపు నాన్న తెచ్చిన రిజర్వేషన్లు.. ఇంకో వైపు యువత ఆందోళనలు.. ఈ రెండింటి మధ్య షేక్ హాసినా బాగా నలిగిపోయారు.  


హసీనా సర్కారుపై ఆగ్రహం


ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా హింసాత్మకంగా మారడంతో 2018లో ఉద్యోగ అవకాశాల్లో అన్ని రకాల రిజర్వేషన్లు ఎత్తివేసింది. కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉద్యోగ నియమాకలు చేపట్టాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. ఆ తరువాత 2024లో జరిగిన ఎన్నికల్లోనూ మళ్లీ షేక్ హాసినానే ఎన్నుకున్నారు. కథ ఇంత వరకు బాగానే ఉంది. కానీ, రిజర్వేషన్లు తీసివేయడం రాజ్యాంగానికి విరుద్ధమంటూ కొందరు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు హైకోర్టుకు వెళ్లారు. దీంతో..2024 జూన్‌లో మళ్లీ 56 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తున్నట్లు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇంకేముంది.. మళ్లీ యువత అంతా రోడ్లపైకి వచ్చారు. పరిస్థితి గమనించిన షేక్ హాసినా సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. 


Also Read: ఆ ఫ్యామిలీకి ఆగస్టు శాపం - 50 ఏళ్ల కిందట తండ్రి హత్య, ఇప్పుడు పారిపోయిన షేక్ హసీనా


ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీంకోర్టు 93శాతంమెరిట్ బేసిస్ మీదనే రిక్రూట్మెంట్ జరగాలి. ఫ్రీడమ్ ఫైటర్, మహిళలు ఇలా అన్ని రిజర్వేషన్లు కలిపి 7శాతమే ఉండాలని చెప్పింది. అసలు.. ఫ్రీడమ్ ఫైటర్స్‌కు రిజర్వేషన్లే వద్దు అంటూంటే మళ్లీ ఈ గోల ఏంటని యువత ఉద్యమాన్ని ఇంకాస్త ఉద్ధృతం చేశారు. 


2008 నుంచి వరసగా నాల్గోసారి ప్రధానిగా ఉన్నారు షేక్ హాసినా. దీంతో నార్మల్‌గానే ప్రతిపక్ష పార్టీలు ఆమెను దించాలని ప్రయత్నిస్తాయి. వారి ఆలోచనలకు..యువత ఆవేశం తోడు అవడంతో..బంగ్లాదేశ్ తలగబడి పోతుంది. సైన్యం కూడా తాము ఏం చేయలేమని చేతులు ఎత్తివేయడంతో.. షేక్ హాసినా తట్టాబుట్ట సర్దుకుని దేశాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 5న షేక్ హాసినా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లడంతో..బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇది కథ..! ఈ అల్లర్ల వెనక పాకిస్థాన్ ఉందని..చైనా ఉందని కూడా అంటున్నారు. ఐనప్పటికీ.. ఇంటర్నల్‌గా ఈ స్థాయిలో ఉద్యమం చెలరేగడానికి మాత్రం రిజర్వేషన్లే కారణం..!


Also Read: హింసాత్మకంగా బంగ్లాదేశ్ అల్లర్లు, ఇండియాకి తిరిగొచ్చిన 300 మంది విద్యార్థులు