Bangladesh Quota Row: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం బంగ్లాదేశ్‌ని కుదిపేస్తోంది. కొన్ని వారాలుగా అక్కడ నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. క్రమంగా ఇవి హింసాత్మకంగా మారుతున్నాయి. భద్రతా బలగాలతో ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఘర్షణ పడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ ఆందోళనల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా అక్కడి భారతీయ విద్యార్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారు. ఇన్ని రోజులకు వాళ్లకు ఈ టెన్షన్ తప్పింది. దాదాపు 300 మంది భారతీయ విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి భారత్‌కి తిరిగి వచ్చారు. అంతా సురక్షితంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దాదాపు మూడు వారాలుగా బంగ్లాదేశ్‌లో ఈ హింస కొనసాగుతోంది. ధాకా యూనివర్సిటీలో మొదలైన ఆందోళనలు క్రమంగా దేశమంతా వ్యాపించాయి. అల్లర్లు మొదలైన మరసటి రోజే ఆరుగురు మృతి చెందారు. క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇండియన్ స్టూడెంట్స్‌లో ఎక్కువ మంది MBBS చదువుతున్న వాళ్లే. యూపీ, హరియాణా, జమ్ముకశ్మీర్, మేఘాలయా రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు బంగ్లాదేశ్‌లో మెడిసిన్ చేసేందుకు వెళ్లారు. త్రిపుర, మేఘాలయా మీదుగా వీళ్లు ఇండియాకి చేరుకున్నారు. అయితే...కొద్ది రోజులుగా ఈ అల్లర్లు భయపెడుతున్నప్పటికీ ఎప్పుడో అప్పుడు అంతా సర్దుకుంటుందని భావించినట్టు విద్యార్థులు వెల్లడించారు. కానీ రానురాను పరిస్థితులు మరీ అదుపు తప్పుతుండడం వల్ల ఇండియాకి వెళ్లిపోవడమే మంచిదని అనుకున్నట్టు తెలిపారు.
ఈ అల్లర్ల కారణంగా బంగ్లాదేశ్‌లో టెలిఫోన్ సర్వీస్‌లూ బంద్ చేశారు. ఫలితంగా భారతీయ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడడానికీ లేకుండా పోయింది. ఇంటర్నెట్ సర్వీస్‌లూ నిలిపివేశారు. అందుకే వీలైనంత త్వరగా ఇండియాకి వెళ్లిపోవాలని అక్కడి నుంచి వచ్చేశారు. దాదాపు 200 మంది భారతీయ విద్యార్థులు మేఘాలయా మీదుగా వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. మరి కొందరు భూటాన్, నేపాల్ మీదుగా వెళ్లారు. మేఘాలయా నుంచి 67 మంది విద్యార్థులు, భూటాన్ నుంచి 7గురు స్టూడెంట్స్ బంగ్లాదేశ్‌లో MBBS కోర్స్ చేసేందుకు వెళ్లినట్టు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటి వరకూ ఈ ఘర్షణల్లో 104 మంది ప్రాణాలు కోల్పోగా 2,500 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత నెల హైకోర్టు రిజర్వేషన్‌లపై కీలక తీర్పునిచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు చెందిన వాళ్లకి 30% కోటా ఇస్తున్నట్టు వెల్లడించింది. అయితే...ఈ తీర్పుని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కానీ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టుని సవాల్ చేస్తోంది. ఇదే అల్లర్లకు దారి తీసింది. ప్రధాని షేక్ హసీనా తన అనుచరులకు, కావాల్సిన వాళ్లకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ రిజర్వేషన్‌లు తీసుకొచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చేందుకే ఈ కుట్ర చేస్తున్నారని విమర్శిస్తున్నారు కొందరు నేతలు.