Microsoft IT Outage: మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్‌తో ప్రపంచవ్యాప్తంగా (Microsoft Server Outage) ప్రభావం పడింది. ముఖ్యంగా ఎయిర్‌లైన్స్‌కి ఈ ప్రభావం గట్టిగా కనిపించింది. పలు చోట్ల ఫ్లైట్స్ రద్దైపోయాయి. మరి కొన్ని డిలే అవుతున్నాయి. ప్రయాణికులు గంటల కొద్ది ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ముంబయి, హైదరాబాద్, ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్‌లలో ఇంకా పరిస్థితులు చక్కబడలేదు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం (CrowdStrike) కాస్త ఎక్కువగా ఉంది. చెకిన్ సర్వీస్‌లు నిలిచిపోయాయి. టర్మినల్ 3 వద్ద కొంత వరకూ పరవాలేదు. జులై 19వ తేదీన ఈ సమస్య తలెత్తినప్పుడు టర్మినల్ 3, టర్మినల్ 5 వద్ద చెకిన్ మెషీన్‌లు పని చేయలేదు. ఫలితంగా ప్రయాణికులంతా క్యూలో గంటల కొద్ది నిలబడాల్సి వచ్చింది. బోర్డింగ్ పాస్‌లు ఇంకా జనరేట్ కావడం లేదు. Digi Yatra మెషీన్‌లు పని చేయడం లేదు. మ్యాన్యువల్‌గా ఎంట్రీ చేసుకోవాల్సి వస్తోంది. ఇక డిస్‌ప్లే బోర్డ్‌లపై అంతకు ముందు అసలు పని చేయలేదు. ఇప్పుడు ఈ డిస్‌ప్లే సమస్య తీరిపోయింది. అయితే..ఇంకా పూర్తి స్థాయిలో సిస్టమ్ రికవరీ అవ్వాల్సి ఉంది. ఇక ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. భారీ క్యూలు ఉన్నప్పటికీ కొంత వరకూ ఆపరేషన్స్ సాఫీగా సాగిపోయేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే..రెండు ఫ్లైట్స్‌ని మాత్రం రద్దు చేశారు. ముందు రోజు దాదాపు 9 విమానాలు రద్దయ్యాయి.
రద్దీ ఎక్కువగా ఉండే బెంగళూరు, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లలోనూ ప్రభావం గట్టిగానే ఉంది. బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో, ఆకాశ, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్స్ సర్వీస్‌లపై ఎఫెక్ట్ పడింది. ఆన్‌లైన్‌లో చెకిన్ అవకపోవడం వల్ల మాన్యువల్‌గా చేస్తున్నారు. ఇప్పుడు కొంత వరకూ పరిస్థితులు కుదుటపడ్డాయని, సాంకేతిక సమస్య తీరిపోయినట్టే అని అధికారులు వెల్లడించారు. అయితే...అంతకు ముందు ఆగిపోయిన ప్రయాణికులంతా ఫ్లైట్స్ ఎక్కేందుకు ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. ఫ్లైట్స్ డిలే కావడం వల్ల షెడ్యూల్‌ని మార్చేశారు. ఇక హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 23 ఫ్లైట్స్‌ని రద్దు చేశారు. బెంగళూరు, అహ్మదాబాద్, విశాఖపట్నం, తిరుపతికి వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. ఈ సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. వీలైనంత త్వరగా అంతా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టెక్నికల్ గ్లిచ్‌ని సరి చేసేందుకు అవసరమైన అప్‌డేట్స్‌ని ఇప్పటికే విడుదల చేశామని వెల్లడించారు. మొత్తంగా చూస్తే ఇవాళ (జులై 20) తెల్లవారుజామున 3 గంటల నుంచి దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్స్‌లో సేవలు మళ్లీ సాధారణ స్థితికి వస్తున్నాయి. ఫ్లైట్స్‌ని రీషెడ్యూల్ చేసి ప్రయాణికులను పంపుతున్నాయి యాజమాన్యాలు. మరోసారి ఇలాంటి సమస్య రాకుండా జాగ్రత్తపడతామని చెబుతున్నాయి.
Also Read: Viral Video: హైవేపై అదుపు తప్పి బైక్‌ని ఢీకొట్టిన కార్, గాల్లో ఎగిరి పడిన దంపతులు - వీడియో