Junior NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ 'మ్యాడ్' సినిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన తాజా చిత్రం 'ఆయ్'. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాని బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన ఈవెంట్ లో చిత్ర బృందం థీమ్ సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 


"కంటెంట్‌ బాగుంటేనే వెళ్తుంది"


అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''మాదొక వెటకారం బ్యాచ్. నేను బన్నీ వాసు, డైరెక్టర్ అంజి.. అందరం వెటకారం చేసేవాళ్ళమే. జెనరల్ గానే ఈస్ట్ గోదావరి జిల్లా అంటేనే వెటకారం. అక్కడోళ్లకు ఫన్, సరదా అంటే చాలా ఇష్టం. మొదట్లో ‘ఆయ్’ అని టైటిల్ పెడదామని ఆలోచించినప్పుడు, ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందేమో? అని అనుకున్నాం. ఆ ప్రాంతంలో ఆయ్ ని ఎన్నిరకాలుగా ఉపయోగిస్తారు అని ఆలోచిస్తూ.. ఇరవై రకాల వేరియేషన్స్‌ లో అనుకున్నాం. ఫిదా అనేది తెలంగాణకు సంబంధించిన పదం. కానీ అదే పేరుతో సినిమా తీస్తే ఆంధ్రాలో కూడా సూపర్ హిట్ అయింది. కంటెంట్ బాగుంటే ఎంత దూరమైనా వెళ్తుంది. ఇది చాలా సరదాగా ఉండే సినిమా. అలాంటి చిత్రాలకు ఈ మధ్య కాలంలో ఆదరణ ఉంటోంది కాబట్టి, తప్పకుండా ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను'' అని అన్నారు. 


'' ఇది కదా నిజమైన హీరోయిజం''


''దర్శకుడికి కామెడీ టైమింగ్ లో మంచి గ్రిప్ ఉంది. ఈ కథ ఒప్పుకున్న నితిన్ ని అభినందించాలి. ఎవరైనా హీరో అవ్వాలని అనుకున్నప్పుడు.. ఒక్క దెబ్బకు ఇరవై మంది పడిపోవాలని అనుకుంటారు కానీ, ఇలాంటి కామెడీ సబ్జెక్టు ఎందుకు ఒప్పుకుంటారు అని నేను బన్నీ వాస్ తో అన్నాను. కానీ నితిన్ స్టోరీ విన్న తర్వాత 'కథ నాకు చాలా బాగా నచ్చింది. చాలా సరదాగా ఉంది. ఈ సినిమాలో నేను కొడితే ఎంతమంది పడిపోతారనేది కాదు కదా. కథ హిట్టయితే అదే హీరోయిజం' అని నాతో అన్నాడు''


"వర్షంలో షూట్ అంటే తిట్టాను"


''ఈస్ట్ గోదావరిలో వర్షంలో సినిమా తీస్తామని అన్నారు. ముందు నేను తిట్టాను. ప్రతీ సీన్ కి వర్షం కురిపిస్తూ.. వర్షం కోసమే కోటిపైగా ఖర్చు పెట్టారు. వర్షం వచ్చినప్పుడే షూటింగ్ చేసారు. వర్షం రాకపోతే ఆర్టిఫిషియల్ గా కురిపించారు. రషెస్ చూశాను. సినిమా చూస్తే మనం నిజంగానే ఆ ఊర్లోకి వెళ్లి వర్షంలో తడుస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చారు. అందుకే నేను కూడా టీంని ఏమీ అనలేకపోతున్నాను. రిలీజ్ తర్వాత చెప్తాను'' అని అల్లు అరవింద్ నవ్వుతూ అన్నారు. 



ఎన్టీఆర్‌కు ఫోన్ చేస్తే..


ఇంకా ఆయన మాట్లాడుతూ ''పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతో సినిమా తీస్తున్నాం కదా అని ఒకసారి ఎన్టీఆర్ కి ఫోన్ చేశాను. నితిన్ ని హీరోగా అనుకుంటున్నాం అని చెప్పాను. ‘ఎవరి లైఫ్ వాళ్ళది. మన వాళ్ళని చెప్పి సినిమాని ఫస్ట్ డే వరకు మనం తీసుకెళదాం.. ఆ తరువాత ఎవరి కష్టం వారిదే. వాళ్ళ యాక్టింగ్ ను బట్టే పైకి వెళ్తారు. మీ కథ బాగుందని చెప్పాడు. చేసేయండి. పెద్దోళ్ల కుటుంబం నుంచి వచ్చిన హీరో ఇలాంటి క్యారక్టర్ చేస్తున్నారని ఏమీ ఆలోచించొద్దు. సినిమా బాగుంటే బ్రహ్మాండంగా ఆడుతుంది. డెఫినిట్ గా మీరు మిస్ కానివ్వరు. చెయ్యండి బాగుంటది' అని ఎన్టీఆర్ అన్నారు'' అని తెలిపారు. 


Also Read: అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య గొడవ - క్లారిటీ ఇచ్చిన బన్నీ వాసు, ఇవన్ని పాసింగ్‌ క్లౌడ్స్‌..


''నితిన్ ఈ చిత్రంలో చాలా ఈజ్‌తో నటించాడు. హీరోయిన్ నయన్ సారిక కూడా బాగా చేసింది. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేద్దామని మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గురించి బన్నీ వాస్ చెప్పాడు. లిమిటెడ్ బడ్జెట్ సినిమాలతో కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేస్తే, వాళ్ళు పైకి వస్తే మనకే ఆనందం. డెఫినెట్ గా చేద్దాం అన్నాను. లిరిసిస్ట్ సురేష్ మంచి పాటలు రాసారు. మా బ్యానర్లో కష్టం వస్తే, ఆ కష్టాలను పంచుకోడానికి చైతన్య ఎల్లప్పుడూ ముందుకు వస్తారు. మా సినిమాను జనాల వరకూ తీసుకెళ్లి మంచి ఓపెనింగ్స్ రావడానికి మీడియా కారణమవ్వాలని కోరుతున్నాను'' అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.



ఈ సందర్భంగా 'నీ డ్రెస్ డిజైనర్ ఎవరు?' అని యాంకర్ స్రవంతి చొక్కారపును ప్రశ్నించారు అల్లు అరవింద్. దీనికి ఆమె తనే స్వయంగా డిజైన్ చేసుకుంటానని చెప్పగా.. ''అయితే నాక్కూడా డ్రెస్ డిజైనింగ్ చెయ్యాలమ్మా నువ్వు. నేను డ్రెస్ డిజైనర్ ని పెట్టుకుందామని అనుకుంటున్నాను'' అంటూ మెగా ప్రొడ్యూసర్ నవ్వేశారు.


Also Read: చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు