Jaggareddy About Chiranjeevi| హైదరాబాద్: రైతుల రుణమాఫీలో భాగంగా రూ.1 లక్ష లోపు ఉన్న అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది. ఆగస్టు 15 లోపే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ విషయం తెలిసి, బీఆర్ఎస్ నేతలు రాత్రి నిద్రపోయి ఉండకపోవచ్చు అంటూ సెటైర్లు వేశారు. స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రపోయి ఉండొచ్చు అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది అమలు చేసి తీరుతారని చెప్పడానికి రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడటమే నిదర్శనం అన్నారు.


మెగా బ్రదర్స్‌పై జగ్గారెడ్డి విమర్శలు 
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తీసిన ఖైదీ నం150 అనే సినిమా మొత్తం రైతుల గురించి, వారి సమస్యల గురించి ఉంది. రైతుల ఆత్మహత్యలను సైతం సినిమాలో చూపించారు. సినిమాలో హీరో అయిన చిరంజీవి రైతుల గురించి పోరాటం చేసినట్లు ఉంది. ఆ సినిమా హిట్ అయింది. చిరంజీవికి కోట్ల రూపాయలు వచ్చాయి. నిర్మాత, దర్శకుడికి కోట్లు డబ్బులొచ్చాయి. కానీ నడిరోడ్డు మీద రైతులను బీజేపీ ప్రభుత్వం చంపుతుంటే, వారిని హింసిస్తుంటే చిరంజీవి ఢిల్లీకి వెళ్లి ఎందుకు నిరసన తెలపలేదో. నీ సినిమాతో నువ్వు బాగు పడ్డావు. నీ సినిమా రైతుల కడుపు నింపలేదు. సినిమా హిట్ అయ్యింది. నీ తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీకి, ప్రధాని మోదీకి దోస్త్. బీజేపీతో కలిసి పనిచేసే చంద్రబాబు సైతం రైతుల సమస్యలపై ఎందుకు పోరాటం చేయలేదు. మీ అందరూ ఢిల్లీకి వెళ్లి ఎందుకు రైతుల పక్షాన నిలిచి, కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలపై ఎందుకు నిరసన తెలపలేదని’ జగ్గారెడ్డి ప్రశ్నించారు.






రాహుల్ గాంధీ ఎండ, వాన లెక్క చేయకుండా దేశ వ్యాప్తంగా 9 వేల కోట్లు కిలోమీటర్ల యాత్ర చేశారు. చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అయితే సినిమాల్లో సమస్యలపై పోరాడతారు కానీ, నిజ జీవితంలో రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చిన వారిపై ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. రైతుల పేరుతో సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తారు, కానీ నిజ జీవితంలో మాత్రం వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీకి కట్టుబడి ఉందన్నారు.


‘హరీష్ రావు ఆర్థిక మంత్రిగా, మీ మామ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో మీరు రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ ఆ మొత్తం నుంచి రైతులకు మీరు ఇచ్చింది కేవలం రూ.26 వేల కోట్లు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కేవలం 6 నెలల్లో రూ. 31 వేల కోట్లు మాఫీ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఒకేసారి రూ.75 వేల కోట్లు రుణమాఫీ చేశాం. వైఎస్సార్ ఆరోజు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నారని’ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.