Pune Hit And Run Case: మహారాష్ట్రలో బైక్‌పై వెళ్తున్న దంపతులు ఘోర ప్రమాదానికి గురై తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే హైవేపైనే ప్రమాదం జరిగింది. ఓ కార్‌ వేగంగా వచ్చి దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఇద్దరూ గాల్లో ఎగిరిపడ్డారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుణేలో అహ్మద్‌నగర్ కల్యాణ్ హైవేపై ఈ యాక్సిడెంట్ జరిగింది. బైక్‌ని వెనక నుంచి వచ్చి కార్ ఢీకొట్టింది. ఈ దెబ్బకి దంపతులు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. అదృష్టం కొద్దీ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని, చికిత్స చేస్తున్నామని వైద్యులు వెల్లడించారు. కార్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 






పుణెలో ఇలాంటి హిట్ అండ్ రన్‌ కేసులు పెరుగుతున్నాయి. పోర్షే యాక్సిడెంట్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విచారణ ఇంకా కొనసాగుతోంది. ఓ టీనేజర్ మద్యం మత్తులో కార్‌ని వేగంగా నడిపి ఓ బైక్‌ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లు మృతి చెందారు. అయితే...ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు గట్టిగానే ప్రయత్నించాడు నిందితుడు. నిందితుడి తండ్రి బడా రియల్టర్ కావడం వల్ల కేసుని తప్పుదోవ పట్టించాలని చూశాడు. కానీ...పోలీసులు నిఘా పెట్టి మరీ అరెస్ట్ చేశారు. బ్లడ్ శాంపిల్స్‌ని తారుమారు చేసినందుకు తల్లినీ అదుపులోకి తీసుకున్నారు. కేవలం మైనర్ అనే కారణం చూపించి ఇంత పెద్ద నేరాన్ని మామూలు శిక్షతో వదిలి పెట్టొద్దన్న డిమాండ్‌లు వినిపించాయి. సోషల్ మీడియాలోనూ డిబేట్ నడిచింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆ తరవాత ఇలాంటి ప్రమాదమే మరోటి జరిగింది. శిందే సేనకు చెందిన ఓ లీడర్ కొడుకు BMW కార్‌తో యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.