UPSC Civil Services Mains Candidates List: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్‌, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ విభాగాల్లో ఖాళీల భర్తీకి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను యూపీఎస్సీ జూన్ 16న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను జులై 1న యూపీఎస్సీ విడుదల చేసింది. ఆ సమయంలో కేవలం అభ్యర్థుల హాల్‌టికెట్ నెంబర్లను మాత్రమే ప్రకటించింది. అయితే తాజాగా మెయిన్   పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల రోల్‌ నంబర్లు, పేర్ల జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచింది. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షకు మొత్తం 14627 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్ మెయిన్స్‌కు 2158 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబరు 20 నుంచి 5 రోజులపాటు  సివిల్స్ ప్రధాన పరీక్షలు, నవంబరు 24 నుంచి ఏడురోజులపాటు ఐఎఫ్‌ఎస్ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.


సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల వివరాల కోసం క్లిక్ చేయండి...


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల వివరాల కోసం క్లిక్ చేయండి...


➥ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష విధానం:
మొత్తం 1750 మార్కులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఉంటుంది. ఇవి రెండు కలిపి 2025 మార్కులకు తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 250 మార్కులు కేటాయించారు. అయితే వీటిలో ఒక్కో పేపరుకు 300 మార్కుల చొప్పున క్వాలిఫయింగ్ పేపర్లు(పేపర్-ఎ, పేపర్-బి) ఉంటాయి. వీటి మార్కులను పరిగణనలోకి తీసుకోరు.  




పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 25 నగరాల్లోని కేంద్రాల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్, విజయవాడలో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు.


ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్ పరీక్ష విధానం..
ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలోనే నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ ఇంగ్లిష్- 300 మార్కులు, పేపర్-2లో జనరల్ నాలెడ్జ్-300 మార్కులు ఉంటాయి. ఇక పేపర్-3, పేపర్-4, పేపర్-5, పేపర్-6కు సంబంధించి రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లలో నాలుగు పేపర్లు  ఉంటాయి. వీటికి ఒక్కో పేపరుకు 200 మార్కులు కేటాయించారు.


➥ పేపర్‌–1: జనరల్‌ ఇంగ్లిష్‌ - 300 మార్కులు


➥ పేపర్‌–2: జనరల్‌ నాలెడ్జ్‌ - 300 మార్కులు


➥ పేపర్‌–3: ఆప్షనల్‌ సబ్జెక్ట్‌(1) పేపర్‌–1 - 200 మార్కులు


➥ పేపర్‌–4: ఆప్షనల్‌ సబ్జెక్ట్‌(1)పేపర్‌–2 - 200 మార్కులు


➥ పేపర్‌–5: ఆప్షనల్‌ సబ్జెక్ట్‌(2)పేపర్‌–3 - 200 మార్కులు


➥ పేపర్‌–6: ఆప్షనల్‌ సబ్జెక్ట్‌(2)పేపర్‌–4 - 200 మార్కులు


★ అభ్యర్థులు ఏవైనా రెండు సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది.  ఎంపిక చేసుకున్న రెండు సబ్జెక్ట్‌ల నుంచి ఒక్కో దానిలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు. 


★ ఆప్షనల్స్‌ ఎంపికకు సంబంధించి నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్ట్‌లను పేర్కొన్నారు. అభ్యర్థులు ఆ జాబితాలోని సబ్జెక్ట్‌లనే ఆప్షనల్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది.
★ అంతేకాకుండా ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ల ఎంపిక విషయంలో కొన్ని సబ్జెక్ట్‌ కాంబినేషన్లను అనుమతించరు.


ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ల వివరాలు..


➥ అగ్రికల్చర్‌; అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌; యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌; బోటనీ; కెమిస్ట్రీ; కెమికల్‌ ఇంజనీరింగ్‌; సివిల్‌ ఇంజనీరింగ్‌; ఫారెస్ట్రీ; జియాలజీ; మ్యాథమెటిక్స్‌; మెకానికల్‌ ఇంజనీరింగ్‌; ఫిజిక్స్‌; స్టాటిస్టిక్స్‌; జువాలజీ.


➥ అగ్రికల్చర్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌; –అగ్రికల్చర్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌; –అగ్రికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ; –కెమిస్ట్రీ అండ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌; –మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌.


➥ ఇంజినీరింగ్‌ అభ్యర్థులు.. ఏదైనా ఒక ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌నే ఆప్షనల్‌గా ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. రెండో ఆప్షనల్‌గా.. వేరే విభాగాల్లోని సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి.


ప్రత్యేకంగా రెండు ఆప్షనల్స్‌.. 


➥ ఐఎఫ్‌ఎస్‌ అభ్యర్థులు పరీక్ష విధానంలో భాగంగా రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటి నుంచి నాలుగు పేపర్లకు హాజరవ్వాల్సి ఉంటుంది. అంటే.. ఆప్షనల్‌ పేపర్లకు అధిక వెయిటేజీ ఉందనే విషయం స్పష్టం. కాబట్టి ఇప్పటి నుంచే ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లపై పట్టు సాధించే విధంగా నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలి.


➥ అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను తమ అకడమిక్‌ నేపథ్యంలోని సబ్జెక్ట్‌ల నుంచి ఎంపిక చేసుకుంటారు. మరో ఆప్షనల్‌ పూర్తిగా కొత్త సబ్జెక్ట్‌. ఎందుకంటే.. ఒకే స్వరూపం ఉండే సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా తీసుకోకూడదనే నిబంధన ఉంది. ఉదాహరణకు.. అగ్రికల్చర్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. రెండో ఆప్షనల్‌గా అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకునే వీలు లేదు. అదే విధంగా బీటెక్‌ అర్హతతో పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు రెండు ఆప్షనల్స్‌ను ఇంజనీరింగ్‌ నేపథ్యం సబ్జెక్ట్‌ల నుంచి ఎంపిక చేసుకునే అవకాశం లేదు. అభ్యర్థులు ముందుగా తమ అకడమిక్‌ నేపథ్యానికి సంబంధంలేని, కొత్తగా ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌తో మెయిన్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించాలి.




మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...