Joe Biden Greets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రధాని మోదీ భుజం తట్టి బైడెన్ ఆప్యాయంగా పలకరించారు.
జీ7 సదస్సులో
అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడాలతో కూడిన జీ7 కూటమి శిఖరాగ్ర సమావేశం దక్షిణ జర్మనీలో ప్రకృతి సోయగాల మధ్య కొలువుదీరిన ఎల్‌మావ్‌లో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఆహ్వానం మేరకు మోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ భేటీకి భారత ప్రధానితో పాటు అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్, దక్షిణాఫ్రికా నేతలను జర్మన్ ఛాన్సలర్ ఆహ్వానించారు. ఈ శిఖరాగ్ర సదస్సులో మోదీ దాదాపు 12 మంది దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
బైడెన్ పలకరింపు
ఈ సదస్సు అనంతరం ఫోటో సెషన్ సందర్భంగా దేశాధినేతలంతా రెడీ అవుతున్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో మాట్లాడుతున్నారు. అప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేరుగా మోదీ వద్దకు నడుచుకుంటూ వెళ్లి భుజం తట్టి మరీ పలకరించారు. వెంటనే మోదీ కూడా ఆయన వైపు తిరిగి షేక్ హ్యాండ్ ఇస్తూ చిరునవ్వుతో పలకరించారు. ఈ పలకరింపు ఆ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలవాలని ఈ సదస్సులో జీ7 దేశాలు తీర్మానం చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని జీ7 దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. జీ7 దేశాలు.. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని, సాయం చేయాలని వ్లొదిమిర్ జెలెన్స్‌కీ ఇటీవల కోరారు. అప్పుడే రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ సిద్ధమవుతుందని జెలెన్స్‌కీ అన్నారు.
Also Read: Texas: సరిహద్దులోని ట్రక్కులో 46 మృతదేహాలు- అసలేం జరిగింది?
Also Read: Corona Cases: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 11,793 మందికి వైరస్