Srilanka Crisis :  శ్రీలంకలో పెట్రోల్ దొరకడం లేదు. దిగుమతి చేసుకోవడానికి డబ్బుల్లేవు. ఈ కారణంగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ఇచ్చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయమని ఆఫర్ ఇచ్చింది. రోడ్డెక్కాలంటే పెట్రోల్ కావాలి. కానీ దొరకడం లేదు. చాలా రోజుల నుంచి పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ..  గత వారం రోజుల నుంచి పెట్రోల్‌ బంకుల్లో బారులు పెరిగాయి. ఆ క్యూలు కిలోమీటర్ వరకూ ఉంటున్నాయి. ఈ సమస్య ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు.  ప్రజారవాణా, విద్యుత్‌ ఉత్పత్తి, వైద్యసేవలు, పోర్టులు, విమానాశ్రయాలకు ఇంధన పంపిణీలో అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు.


అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కూరుకుపోయింది.  రాజధాని కొలంబోలో పాఠశాలలు మూతపడ్డాయి. మరో వైపు ప్రభుత్వ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో తగ్గిపోవడంతో 22 మిలియన్ల మంది జనాభా ఉన్న ద్వీప దేశంలో ఆహారం, మెడిసిన్స్‌, ఇంధన దిగుమతుల కోసం చెల్లింపులు చేసేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతోంది.  ప్రస్తుతం లంకలో ఇంధన నిల్వలు ఎంత ఉన్నాయనేది స్పష్టంగా తెలియరాలేదు. కొలంబో చుట్టు పక్కల ప్రాంతాల్లో పాఠశాలలను వారం పాటు మూసివేయగా.. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఇంటి నుంచే పని చేయాలని ప్రభుత్వం ఉద్యోగలను ఆదేశించింది.
  
  పెట్రోల్‌ బంకుల్లో చి వినియోగదారులకు టోకెన్లు జారీ చేస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ నింపుకోవడానికి ప్రజలకు టోకెన్‌ నంబర్లు ఇస్తున్నారు. ఇందు కోసం సైన్యం, పోలీసులు పని చేస్తున్నారు.  ప్రజలు తమ సమీప పెట్రోల్‌ బంకుల్లో తమ మొబైల్‌ నంబర్లు ఇవ్వాలని, వారికి నంబర్లు ఇచ్చిన తరువాతే పెట్రోల్‌ అమ్ముతామని ప్రభుత్వం ప్రకటించింది.  ఇంధన దిగుమతులు గురించి చర్చించడానికి ఇద్దరు మంత్రులు సోమవారం రష్యాకు బయలుదేరి వెళ్లారు. మరోవైపు శ్రీలంకలో ఇంధన పంపిణీదారులు పెట్రోల్‌ ధరలు పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఆ దేశంలో ఇంధన ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది నాలుగో సారి.


 అక్కడి కరెన్సీ ప్రకారం.. లీటర్ పెట్రోల్ ధర రూ.550కు, డీజిల్ ధర రూ.460కి చేరాయి. అసలే ఆర్థిక సమస్యలతో కకావికలం అవుతున్న పేదలు, మధ్య తరగతి వారిపై ఇది మరింత భారం మోపుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో.. చాలా మంది ప్రజలు బంకుల ముందు క్యూలలో వాహనాలు పెట్టేసి వెళ్లిపోతున్నారు. ఎప్పుడైనా పెట్రోల్, డీజిల్ రాగానే వాహనాల్లో పోయించుకోవచ్చని అలా చేస్తుండటం గమనార్హం.