ఖాట్మండు వ్యాలీలోని లలిత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీలో పానీ పూరీ అమ్మకాన్ని నిషేధించారు. పానీపూరీకి ఉపయోగించిన నీటిలో కలరా బ్యాక్టీరియా ఉందని గ్రహించిన ఈ నిర్ణయం తీసుకున్నారు.
పానీపూరీలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉందని పేర్కొంటూ మహానగరంలో పానీపూరీ విక్రయాలు, పంపిణీని నిలిపివేయాలని లలిత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీ (ఎల్‌ఎంసి) శనివారం నిర్ణయించింది.
మునిసిపల్ పోలీస్ చీఫ్ సీతారాం హచేతు చెప్పినట్టు లోయలో కలరా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. రద్దీ ప్రాంతాలలో, కారిడార్ ప్రాంతంలో పానీపూరీ విక్రయాలను ఆపడానికి మహానగరం సన్నాహాలు చేసింది.
ఖాట్మండు లోయలో మరో ఏడుగురు వ్యక్తులు కలరాకు పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. లోయలో మొత్తం కలరా రోగుల సంఖ్య 12కి చేరుకుందని ఆరోగ్య జనాభా మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎపిడెమియాలజీ అండ్ డిసీజ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ చుమన్‌లాల్ డాష్ చెప్పిన ప్రకారం ఖాట్మండు మెట్రోపాలిస్‌లో ఐదు కలరా కేసులు, చంద్రగిరి మున్సిపాలిటీ, బుధానీలకంఠ మున్సిపాలిటీలలో ఒక్కొక్కటిగా గుర్తించారు.
సోకిన వారు ప్రస్తుతం టేకులోని సుక్రరాజ్ ట్రాపికల్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
గతంలో రాజధాని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐదు కలరా కేసులు కనుగొన్నారు. సోకిన వారిలో ఇద్దరు ఇప్పటికే చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.
కలరా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. డయేరియా, కలరా మరియు ఇతర నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది.