Texas: అమెరికా టెక్సాస్ నగరంలో ఓ ట్రక్కులో 46 మృతదేహాలు లభ్యమవడం సంచలనం రేపింది. యూఎస్-మెక్సికో సరిహద్దులో మానవ అక్రమ రవాణాలో అత్యంత ఘోరమైన ఘటనలలో ఇది ఒకటని అధికారులు భావిస్తున్నారు.
వలసదారులు
టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఓ ట్రక్కులో 46 మంది వలసదారుల మృతదేహాలను గుర్తించినట్లు నగర అగ్నిమాపక విభాగం తెలిపింది. మరో 16 మంది హీట్ స్ట్రోక్‌తో అనారోగ్యానికి గురవడంతో వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో నలుగురు మైనర్‌లు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎలా జరిగింది?
నగర శివార్లలోని మారుమూల ప్రాంతంలో రైలు పట్టాల పక్కన ఈ ట్రక్కును కనుగొన్నారు. మృతదేహాలు ఉన్న ట్రక్కు చుట్టూ పోలీసు వాహనాలు, అంబులెన్సులు కనిపించాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శాన్ ఆంటోనియో పోలీసు అధికారులు ట్రక్కు డ్రైవర్ కోసం వెతుకుతున్నారు. ట్రక్కులో ఉన్న వలసదారులు ఊపిరాడకపోవడంతో మరణించారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మెక్సికో నుంచి అమెరికాకు చాలా మంది అక్రమంగా వలస వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఎండవేడిమికి తట్టుకోలేక కొంత మంది మరణిస్తే మరికొంతమంది మానవ అక్రమ రవాణాకు బలైపోతున్నారు.
Also Read: Corona Cases: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 11,793 మందికి వైరస్