Ukrainian Man Video Went Viral: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలో ఎంతో మంది సైనికులతో పాటు ఆ దేశ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతోన్న వేళ పలు దేశాల నుంచి వస్తున్న అభ్యర్థనలపై స్పందించిన రష్యా ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ ఆర్మీ లొంగిపోతే, తాము చర్చలకు సిద్ధమని రష్యా విదేశాంగ మంత్రి తెలిపారు. యుద్ధానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రపంచ దేశాలను కదిలిస్తున్నాయి.
తమ దేశాన్ని రష్యా ఆక్రమిస్తుందని ఉక్రెయిన్ పౌరులు (Ukrainia Crisis) ఆందోళన చెందుతున్నారు. కొందరు తమ వాహనాలలో ఎలాగైనా సరే దేశం నుంచి బయట పడాలని యత్నిస్తున్నారు. శుక్రవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా దాడులు మొదలుపెట్టింది. కీవ్ నగరంలో రష్యా యుద్ధ ట్యాంకు కారు మీదకు దూసుకొచ్చినా ఓ వ్యక్తి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్యా దురాగతాలకు ఇది పరాకాష్ట అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లక్ అంటే అతడితే, యుద్ధ ట్యాంకులు మీదకు దూసుకొచ్చినా ఆ పెద్దాయన ప్రాణాలతో బయటపడ్డారని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.
కీవ్ నగరంలో రష్యా దాడులు
ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. తమ ప్రాంతాన్ని రష్యా ఆక్రమిస్తుందని భావించిన ఓ వ్యక్తి కారులో ఆ నగరాన్ని విడిచి వెళ్లేందుకు యత్నించారు. కానీ రోడ్డుపై గస్తీ కాస్తున్న ఓ రష్యా యుద్ధ ట్యాంకు ఇది గమనించి అప్రమత్తమైంది. ఉక్రెయిన్ వ్యక్తి ప్రయాణిస్తున్న కారుపైకి దూసుకొచ్చింది (Ukrainian Man Miraculously Survives Russian Tank Running Over His Car). ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో వీడియో తీస్తున్న వారు సైతం భయంతో కేకలు వేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు షేర్ చేసిన వీడియో గమనిస్తే.. ముందుకు కారుపైకి రష్యా యుద్ధ ట్యాంకు దూసుకురాగా, ఆ తరువాత కొందరు కారులో చిక్కుకున్న ఉక్రెయిన్ వ్యక్తిని వాహనం నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.
యుద్ధ ట్యాంకును తట్టుకున్న పెద్దాయన
అతడికి భూమి మీద ఇంకా నూకలున్నాయని కొందరు అంటుంటే.. శత్రువులు యుద్ధ ట్యాంకులతో దూసుకొచ్చినా ఎదుర్కొన్న గుండె అది అని వీడియోను ఉక్రెయిన్ పౌరులు వైరల్ చేస్తున్నారు. ఉక్రెయిన్ రాజధానిలో పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు ఈ వీడియో ఉదాహరణ అని ఆ దేశ పౌరులు ట్వీట్లు చేస్తున్నారు. తొలిరోజు రష్యా దాడిలో 137 మంది చనిపోయారని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు.
Also Read: Russia Ukraine War: కనికరించిన పుతిన్- ఉక్రెయిన్‌తో చర్చలకు ఓకే, కానీ అలా చేస్తేనే!
Also Read: Ukraine War Scenes : ఉక్రెయిన్‌లో గుండెలు పిండేసే సన్నివేశాలు ఎన్నో ! చూసి తట్టుకోగలరా ?