యుద్ధం అంటే వినాశనం. అది ఒక వైపు మాత్రమే కాదు ప్రారంభించిన వారికీ నష్టమే. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్‌లలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో ఎన్నో హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. యుద్ధానికి వెళ్తున్న వారు తమ కుటుంబాలను వదిలి వెళ్తూ మళ్లీ చూస్తామో లేదో అని తనివి తీరా ముద్దులు పెట్టుకుంటున్నారు.
ఓ చోట కుప్పలు, కుప్పలుగా పడి ఉన్న ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు, గాయపడిన వారి దేహాలు చూపరుల కంట తడి పెట్టిస్తున్నాయి.
రష్యా సైన్యం పౌరుల మీద కూడా విరుచుకుపడుతోంది. చిన్న పిల్లలనూ వదిలి పెట్టడం లేదు. సైకిల్‌పై బయటకు వచ్చిన ఓ పధ్నాలుగేళ్ల ఉక్రెయిన్ బాలికను రష్యా సైన్యం పొట్టన పెట్టుకుంది
ఇక యుద్దం కారణంగా చిన్న పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మళ్లీ చూస్తామో లేదోనన్న బెంగతో అటు చిన్నారులు..,ఇటు తల్లిదండ్రుల ఆవేదన అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది.
బంకర్లలో తలదాచుకుంటున్న వారు ధైర్యం చెప్పుకోవడానికి పాటలు పాడుకుంటున్నారు. ఎక్కడఉన్నా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు.
రష్యాలోనూ యుద్దానికి మద్దతు లభిచడం లేదు. అక్కడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు. అయితే వీటిపై రష్యా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ఉక్రెయిన్‌లో హృదయ విదారక దృశ్యాలు యుద్దం ఎంత భయంకరమైనదో ప్రజల కళ్లకు కడుతున్నాయి. అందుకే ఈ యుద్ధం ఆగిపోవాలని అందరూ కోరుకుంటున్నారు.