సాధారణంగా బెండకాయలు(Ladyfingers) ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కానీ ఓ రైతు మాత్రం తోటి రైతులకు భిన్నంగా ఎరుపు రంగులో ఉండే బెండకాయలను పండిస్తున్నాడు. అది కూడా పూర్తి సేంద్రియ పద్ధతిలోనే పంట సాగు చేస్తున్నాడు. ఈ అరుదైన రకమైన బెండ ప్రస్తుతం జగిత్యాల(Jagityala) జిల్లాలోని వ్యవసాయ అధికారులను, రైతులను  ఆకట్టుకుంటోంది. ఈ ఎర్ర బెండ సాగుతో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న శ్రీనివాస్ అనే రైతు సక్సెస్ స్టోరీ ఇది. 



సాధారణంగా ఆకుపచ్చ బెండ తింటే తెలివితేటలు ఎక్కువగా వస్తాయని, చురుగ్గా ఉంటారని  చెబుతుంటారు. అదే విధంగా ముదురు ఎరుపు రంగులో ఉండే ఎర్ర బెండ లోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎర్రగా నిగనిగ లాడుతూ అందంగా కనిపించే ఈ బెండకు ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఆ గిరాకీని అంది పుచ్చుకుంటున్నారు జగిత్యాల జిల్లా  గోపాల్రావుపేట గ్రామానికి చెందిన  శ్రీనివాస్ అనే రైతు. వినూత్నమైన ఆలోచనతో ఇతర రైతులకు భిన్నంగా ఆలోచించి లాభాల బాటలో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఎర్ర బెండను రాధిక రకం అని పిలుస్తారు. 


రెండింతల లాభాలు


శ్రీనివాస్ గత ఎనిమిది సంవత్సరాలుగా కూరగాయలతో పాటు వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు. అయితే  ఎప్పుడు పండించే పంటలేనా కూరగాయల(Vegitables)లో ఏదైనా కొత్తగా సాగు చేద్దామన్న ఆలోచన తట్టింది. దీంతో  మార్కెట్ లో ఎరుపు రంగు బెండకు ఉన్న డిమాండ్ ను గుర్తించి బెంగళూరు నుంచి విత్తనాలను సేకరించి పండించడం మొదలుపెట్టాడు. మూడు గుంటల భూమిలో సాగు చేసిన ఈ బెండకాయలను చూసి మిగతా రైతులు మొదట ఆశ్చర్యపోయారు. అసలు డిమాండ్ ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ శ్రీనివాస్ మాత్రం ఎంతో ధీమాతో ఉండటమే కాదు, పండించే విధానాలను చక్కగా అమలు చేశాడు. తాను అనుకున్నట్లుగా పంట దిగుబడి బాగా రావడంతో ఆకుపచ్చ బెండ(Green ladyfingers) కంటే రెండింతల లాభాలు వచ్చాయి. ఇక ఈ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వ్యవసాయంలో వినూత్న విధానాలను కొత్త వంగడాలను సాగు చేస్తూ శ్రీనివాస్ అటు సాంకేతిక పరిజ్ఞానంతో ఇటు సంప్రదాయ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా మంచి పంట రకాలను ఎంపిక చేసుకొని అధిక మొత్తంలో సాగుచేస్తూ ఆదాయాన్ని పొందవచ్చని చెపుతున్నాడు. 


ఎరువు బెండతో మేలు 


ఆకుపచ్చ బెండకాయతో పోలిస్తే ఎరుపు బెండకాయలో పోషకాలుఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గుండె జబ్బులు(Heart Disease), మధుమేహం(Diabetes), రక్త పోటు(BP),  కొవ్వు సమస్యలతో బాధపడేవారికి ఈ బెండకాయ ఎంతో ఉపయోగపడుతోంది. ఆరోగ్య సమస్యలు ఉన్నా వాళ్లు ఈ బెండకాయ ఎంత తిన్నా మంచిదే అంటున్నారు వైద్యులు. సేంద్రియ పద్దతిలో పండినది కావడంతో ఎక్కువ మంది వినియోగదారులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.