Titanic Marriage Couple: టైటానిక్ శిథిలాల సందర్శనకు వెళ్లిన మినీ జలాంతర్గామి పేలిపోయి ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. టైటాన్ అనే సబ్‌మెర్సిబుల్ మెరైన్ సముద్ర అడుగున నీటి ఒత్తిడిని తట్టుకోలేక దెబ్బతిని పేలిపోయిందని అమెరికన్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. అయితే టైటానిక్ శిథిలాలకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరోసారి వైరల్ అవుతున్నఆ వార్త ఏంటంటే..
2001 లో న్యూయార్క్ కు చెందిన ఓ జంట టైటానిక్ శిథిలాలపై పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ వివాహ తీరుపై మిశ్రమ స్పందన వచ్చింది. అయితే తాజాగా టైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లిన సబ్‌మెర్సిబుల్, అందులో ప్రయాణించిన ఐదుగురు వ్యక్తులు చనిపోయిన వార్త నేపథ్యంలో 22 ఏళ్ల క్రితం జరిగిన పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ కు చెందిన డేవిడ్ లీబోవిట్జ్, కింబర్లీ మిల్లర్ లు టైటానిక్ డెక్ పై పెళ్లి చేసుకున్నారు. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం కింద నాలుగు కిలోమీటర్ల లోతులో టైటానిక్ శిథిలాల వద్ద ఈ పెళ్లి జరిగినట్లు బీబీసీ లో ప్రచురించబడిన ఒక నివేదిక పేర్కొంది. ఈ వివాహ వేడుకను రష్యన్ షిప్ అకాడెమిక్ కెల్డిష్ కార్యకలాపాల కేంద్రం నుంచి క్రూయిజ్ లైనర్ QE2 కెప్టెన్ రాన్ వార్విక్ నిర్వహించినట్లు ఆ నివేదిక పేర్కొంటుంది. లీబోవిట్జ్, మిల్లర్ ఫ్లేమ్ జంట తమ పెళ్లి సమయంలో రిటార్డెంట్ సూట్లు ధరించారు. అప్పట్లో వారు ప్రయాణించిన సబ్‌మెర్సిబుల్ చాలా చిన్నది. దాంతో ప్రయాణం ఆసాంతం వాళ్లు మోకాళ్లపైనే కూర్చోవాల్సి వచ్చింది.
అంతకుముందు సబ్‌సీ ఎక్స్‌ప్లోరర్ అనే డైవింగ్ కంపెనీ నిర్వహించిన పోటీలో లోబోవిట్జ్ గెలవడంతో వాళ్లకు టైటానిక్ శిథిలాల వద్దకు వెళ్లి వివాహం చేసుకునే ఆఫర్ వచ్చింది. అప్పట్లో బ్రిటీష్ టైటానిక్ సొసైటీ ఈ వివాహాన్ని ఖండించింది. అదో పబ్లిసిటీ స్టంట్ అని విమర్శించింది. అప్పట్లో ఈ పెళ్లి వేడుకపై మిశ్రమ స్పందన వచ్చింది. టైటానిక్ శకలాల వద్ద పెళ్లి అనే ఆలోచనను కొంత మంది తప్పు పట్టారు. మరికొంత మంది మాత్రం వారి ఆలోచనను మెచ్చుకున్నారు.
Also Read: టైటాన్ సబ్ మెరైన్ ఎపిసోడ్ విషాదాంతం- పైలట్ సహా ఐదుగురు మృతి చెంది ఉంటారని ప్రకటన
ప్రమాదం జరగడంపై జేమ్స్ కామెరూన్ ఆశ్చర్యం
టైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లిన సబ్‌మెర్సిబుల్ కు ప్రమాదం జరగడం, అందులో ప్రయాణించిన ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తనని ఆశ్చర్యపరిచిందని లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అన్నారు. 'టైటానిక్ ఘోరం జరిగిన చోటే ఈ ఘటన జరగడం నన్ను ఆశ్చర్యపరిచింది. టైటానిక్ శిథిలాలు ఉన్న ప్రాంతం అత్యంత క్రూరమైనది. అలాంటి ప్రమాదకర ప్రాంతంలో ఎంతో అప్రమత్తతో వ్యవహరించాలి. ఓషన్ గేట్ మినీ సబ్‌మెరైన్ కు అధునానత సెన్సార్లు ఉన్నాయి. ప్రమాదానికి ముందు పగుళ్లు వచ్చి ఉండవచ్చు. ఇది గమనించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి వాళ్లు బయటకు వచ్చే లోపే అది పేలి పోయి ఉండవచ్చు' అని జేమ్స్ కామెరూన్ అన్నారు. టైటానిక్ మునిగిన ప్రాంతాన్ని ఆయన ఇప్పటి వరకు 30 సార్లకు పైగా సందర్శించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన పాల్ హెన్రీ అనే వ్యక్తి జేమ్స్ కు స్నేహితుడే. ఆయన కూడా టైటానిక్ శిథిలాల ప్రాంతాన్ని ఇప్పటి వరకు 37 సార్లు సందర్శించడం గమనార్హం.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial