World's Most Expensive Tea Powder: భారతదేశంలో తేయాకు పెద్ద ఎత్తున పండిస్తారు. అందుకే, మన దగ్గర టీ పొడి తక్కువ ధరకు, మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది. మన దేశంలో, సగటున ఒక కిలో టీ పొడి రూ. 500 పలుకుతోంది. బాగా డబ్బున్న వాళ్లు వేలు, లక్షలు పోసి ప్రీమియం టీ పౌడర్ కొంటుంటారు. కోట్లాది రూపాయల ఖరీదైన టీ పొడులు కూడా ప్రపంచంలో ఉన్నాయి. అయితే, అన్నింటి కంటే అత్యంత ఖరీదైన టీ మాత్రం ఒక్కటే. ఆ తేయాకును మన పొరుగు దేశం చైనాలో పండిస్తారు.


ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేయాకు పేరు ఏంటి?
ప్రపంచంలోనే ఖరీదైన తేయాకు రేటు 1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. మన రూపాయల్లో చెప్పుకుంటే, కిలో ధర 8 కోట్ల 20 లక్షల రూపాయల పైమాటే. ఆ టీ రకాన్ని చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఉయి పర్వతాల్లో పండిస్తారు. చివరిసారిగా, 2005లో ఈ టీని పండించారు. అంత గొప్ప తేయాకు రకం పేరు 'డా హాంగ్ పావో' (DA-HONG PAO). 


బంగారం కన్నా ఖరీదైన టీ పొడి
డా హాంగ్ పావో తేయాకు కిలో రేటు రూ. 8.20 కోట్ల చొప్పున, గ్రాము టీ పొడి ధర రూ. 82 వేలు అవుతుంది. ప్రస్తుతం, 24 కేరెట్ల స్వచ్ఛమైన బంగారం ఒక గ్రాము రేటు 6 వేల దగ్గర ఉంది. ఈ లెక్కన, ఒక గ్రాము బంగారం కంటే ఒక గ్రాము టీ పొడి ధర ఎన్నో రెట్లు ఎక్కువ. 2002లో, కేవలం 20 గ్రాముల విలువైన టీ పొడి 1,80,000 యువాన్లకు లేదా 28,000 డాలర్లకు (దాదాపు 23 లక్షల రూపాయలు) అమ్మారు.


అరుదైన లక్షణం కారణంగా ఈ తేయాకు రకాన్ని జాతీయ సంపదగా చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇది, పోయే ప్రాణాలను నిలబెడుతుందట. అందుకే ప్రాణాధార టీ అని కూడా పిలుస్తారు. 1972లో, అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌ చైనాలో పర్యటించినప్పుడు, చైనా అధ్యక్షుడు మావో 200 గ్రాముల టీ పౌడర్‌ను నిక్సన్‌కు బహుమతిగా ఇచ్చారు. 1849లో, బ్రిటిష్ బొటానిస్ట్‌ (వృక్ష శాస్త్రవేత్త) రాబర్ట్ ఫార్చ్యూన్ మౌంట్ ఉయికి రహస్యంగా వెళ్లి, ఆ తేయాకు రకాన్ని భారత్‌కు తీసుకొచ్చాడు.


ఈ టీ మార్కెట్‌లో దొరకదు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డా హాంగ్ పావో మార్కెట్‌లో దొరకదు. ఇది అరుదైన రకం కాబట్టి వేలం ద్వారా మాత్రమే కొనుక్కోవాలి. దీనిని, దశాబ్దం క్రితం చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో ఉన్న యాన్ పర్వతాల్లో ఒక పారిశ్రామికవేత్త, పాండాల సంరక్షుడు కలిసి పెంచారు. 50 గ్రాముల మొదటి బ్యాచ్‌ టీ పొడిని 3,500 డాలర్లకు (రూ. 2.90 లక్షలు) వాళ్లు అమ్మారు. అప్పటి నుంచి ఇది అత్యంత ఖరీదైన టీలలో ఒకటిగా నిలిచింది.


డా హాంగ్ పావో టీ చరిత్ర ఏంటి?
చైనాలోని మింగ్ రాజవంశం కాలంలో డా హాంగ్ పావో సాగు ప్రారంభమైంది. ఆ సమయంలో మింగ్ రాణి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైందని చైనా ప్రజలు నమ్ముతారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈ టీ తాగమని చైనా వైద్యులు సలహా ఇచ్చారట. రోజూ ఈ టీ తాగిన తర్వాత ఆమె పూర్తిగా కోలుకుంది. అందుకే దీనిని ప్రాణాధార టీ అని పిలుస్తారు. రాణి కోలుకోవడంతో, ఆ తేయాకు పంటను దేశమంతా పెంచాలని రాజు ఆదేశించాడు. రాజు ధరించే పొడవాటి వస్త్రం పేరు మీదుగా ఈ టీ ఆకుకు డా హాంగ్ పావో అని పేరు పెట్టారు.


మరో ఆసక్తికర కథనం: ITR-1 ఎవరు ఫైల్ చేయాలి, ఎవరు ఎలిజిబుల్‌ కాదు? 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial