Donald Trump Family: అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్‌  ట్రంపు (Donald Trump)కుటుంబం ఎట్టకేలకు మళ్లీ అధికారిక గృహం వైట్‌హౌస్‌(White House)లో అడుగుపెట్టింది. గతంలోనూ ట్రంప్ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నా...అప్పటికీ ఇప్పటికే  ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. పెద్దవాళ్లకి మరింత వయసు పెరిగింది.

 

ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు 

అమెరికా అధ్యక్షుడు ( America President)గా తిరిగి రెండోసారి ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌... ఎట్టకేలకు మళ్లీ వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టారు. కుటుంబంతో కలిసి అధికారిక నివాసంలో ఆయన ఠీవిగా నడిచి వచ్చారు. గతంలోనూ  ఇదే భవనంలో  వారు నివసించినా...అప్పటికీ ఇప్పటికీ ఎన్నోమార్పులు చోటుచేసుకున్నాయి. భవనంలో ఎలాంటి మార్పులు లేకపోయినా, ట్రంప్ కుటుంబంలో మాత్రం పెద్దమార్పులే వచ్చాయి. గతంలో  చిన్న పిల్లలుగా ఉన్నవారు ఇప్పుడు టీనేజీలోకి  వచ్చేశారు. టీనేజీలో ఉన్నవారు  పెద్దమనుషులాగా మారిపోయారు. ఇక ట్రంప్(Donald Trump) మాత్రం అప్పటికీ ఇప్పటికీ నవ యువకుడిలాగే ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు హుషారుగా  కనిపించారు. 

 

ట్రంప్‌కు మొత్తం మూడు పెళ్లిళ్లు కాగా... ఐదుగురు పిల్లలు ఉన్నారు.మొదటి భార్య ఇవానా ట్రంప్‌తోపాటు ,మార్లా మాపుల్స్‌ను గతంలోనే విహాహం చేసుకోగా...ప్రస్తుతం ఉన్న  మెలానియా మూడో భార్య. ఐదుగురు పిల్లల్లో  ముగ్గురికి ఇప్పటికే వివాహం కాగా....10 మంది మనవళ్లు, మనవరాళ్లు పుట్టారు. మరొకరు డెలివరీకి సిద్ధంగా ఉన్నారు. ట్రంప్ అధికారం నుంచి దిగిపోయేటప్పుడు  అతని చిన్న కుమారు బారన్( Barron) ఐదో తరగతి చదువుతుండగా ఇప్పుడు అతని కాలేజీకి వెళ్తున్నాడు. అప్పట్లో  ట్రంప్‌తో ముద్దుముద్దు మాటలు మాట్లాడిన అతని మనవరాలు కై (Kai) ఇప్పుడు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయోన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పైగా ఆమె మంచి గోల్ఫ్‌ క్రీడాకారిణిగా రాణిస్తోంది.

వైట్‌హౌస్‌లో తాత ట్రంప్ ఒడిలో కూర్చుని ఫొటోలకు పోజులిచ్చిన మరో మనవడు జోసెఫ్‌(Joseph)కు ఇప్పుడు 11 ఏళ్లు వచ్చాయి. వారంతా నాటి తీపి గుర్తులను మరోసారి గుర్తు చేసుకున్నారు. వారి వారి గదులను కలియచూసుకున్నారు. చిన్ననాటి గుర్తులను నెమరవేసుకున్నారు.

 

ట్రంప్‌ బలం, బలగం...

 

ట్రంప్‌ భార్య మెలానియా(Melania) ఈసారి ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు. తొలిసారి ఎన్నికల సందర్భంగా ఆయన వెన్నంటే ఉన్న ఆమె..ఈసారి ఆసక్తి చూపలేదు. ప్రచారం ప్రారంభం రోజు కనిపించిన ఆమె మళ్లీ రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో తళుక్కమంది ఆ తర్వాత ఎన్నికల రోజు రాత్రి మాత్రమే ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో  ట్రంప్‌ విజయం సాధించినా  ఆమె వైట్ హౌస్‌కు వస్తుందా రాదా అన్న అనుమానాలు ఎక్కువయ్యాయి. ఆ అనుమానాలను  పటాపంచలు చేస్తూ.... అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు తీసుకెళ్లాలనుకుంటున్న ఫర్నీచర్‌ను కూడా ఆమె ఇప్పటికే ఎంపిక చేసి సిద్ధంగా ఉంచుకున్నట్లు సమాచారం. 

ట్రంప్‌ పెద్దకుమారుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌(Donald Trump Jr)... అధ్యక్షుడికి రాజకీయపరంగానూ, బిజినెస్‌పరంగానూ చేదోడువాదోడుగా ఉంటాడు. అతని స్నేహితుడైన జేడీవాన్స్‌(JD Vance)ను ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేయడానికి తండ్రిని అతడే ఒప్పించాడు. ట్రంప్‌ కుటుంబానికి కీలకమైన రియల్‌ ఎస్టేట్ వ్యాపార వ్వహారాలన్నీ ఇతనే చూసుకుంటాడు.

ఇక ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ (Ivanka Trump)గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తొలి ఎన్నికల్లోనూ, ఇప్పుడూ ట్రంప్‌ ప్రచారంలో ఆమే ముందుండి నడిపించారు. పైగా తొలిసారి ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు వైట్‌హౌస్‌లో సీనియర్ సలహాదారుగా పనిచేసింది. 2020లోనూ  ఆమె తండ్రి తరఫున ప్రచారం చేసినా... ఓటమి తర్వాత కుటుంబంతో కలిసి ఫ్లోరియా వెళ్లిపోయారు. ఈసారి మాత్రం కుటుంబంతో గడిపేందుకు రాజకీయాల నుంచి దూరంగా ఉండనున్నట్లు తెలిపారు.