IPL 2025 Records | ఏప్రిల్ 19న రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. లీగ్ చరిత్రలో అతిపిన్న వయస్కుడిగా రికార్డులు తిరగరాశాడు. ఆ మరుసటి రోజే చెన్నై సూపర్ కింగ్స్ 17 ఏళ్ల ఆయుష్ మాత్రేకు IPL అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. ఆయుష్ మాత్రే రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. ఆఫ్-స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఆయుష్ మాత్రేను మెగా వేలంలో CSK 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.
నేడు ముంబైలోని వాంఖేడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో CSK కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జట్టులో మార్పులపై స్పందించాడు. విఫలమవుతున్న రాహుల్ త్రిపాఠి స్థానంలో యువ సంచలనం ఆయుష్ మాత్రేకు అవకాశం ఇస్తున్నామని తెలిపాడు. రాహుల్ త్రిపాఠి ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌లలో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. సాధారణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉండేవారు. కానీ ప్రస్తుతం జట్టులో చాలా మార్పులు వచ్చాయి.
ఎవరీ ఆయుష్ మాత్రే..
ఆయుష్ మాత్రే జూలై 16, 2007న జన్మించాడు. ఇంకా చెప్పాలంటే అతడు నెలల పిల్లాడుగా ఉన్న సమయంలోనే ఐపీఎల్ తొలి సీజన్ మొదలైంది. ఆయుష్ మాత్రే పుట్టిన కొన్ని రోజులకు ధోని 2007లో మొదటిసారిగా భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ఆయుష్ అదే దిగ్గజం ధోని కెప్టెన్సీలో సీఎస్కే తరఫున ఆడుతూ ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. ఆయుష్ 2024-25 లో ఇరాని ట్రోఫీలో ముంబై తరఫున ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఆయుష్ 31.50 సగటుతో 504 పరుగులు చేశాడు. ఇటీవల సైతం అతడు 2 శతకాలు బాది సత్తా చాటాడు.
విజయ్ హజారే ట్రోఫీలో ఈ యువ సంచలనం ఆయుష్ మాత్రే రాణించాడు. ఈ 50 ఓవర్ డొమెస్టిక్ టోర్నమెంట్‌లో 7 ఇన్నింగ్స్‌లలో 65.42 సగటుతో ఏకంగా 458 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్‌లో నాగాలాండ్‌తో మ్యాచ్‌లో 181 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలో 150+ పరుగుల ఇన్నింగ్స్ ఆడిన అతి చిన్న వయస్కుడైన క్రికెటర్‌గా ఆయుష్ మాత్రే నిలిచాడు. ఆసియాకప్ లో 44కి పైగా సగటుతో రాణించి 176 పరుగులు చేసి ఇంప్రెస్ చేశాడు.
దేశవాళీ క్రికెట్లో ఇటీవల సంచలనం చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ముంబై బ్యాటర్ ఆయుష్ మాత్రే బద్దలు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో (17 ఏళ్ల 168 రోజులు)లో 150 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా మాత్రే రికార్డులకెక్కాడు. నాగాలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు మాత్రే. అంతకుముందు జైస్వాల్ 17 ఏళ్ల 291 రోజుల వయసులో ఈ ప్రపంచ రికార్డును నమోదు చేయగా, తాజాగా ఆయుష్ మాత్రే ఆ రికార్డును బద్ధలుకొట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్: షేక్ రషీద్, రచీన్ రవీంద్ర, ఆయుష్ మ్హాత్రే, రవీంద్ర జడేజా, శివం దూబే, విజయ్ శంకర్, జేమీ ఒవర్టన్, ఎం.ఎస్. ధోని (కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మథీషా పతిరానా