IPL 2025 PBKS vs RCB | ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ తొలి మ్యాచ్ లో ఆతిథ్య పంజాబ్ కింగ్స్ జట్టును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు నిలువరించారు. మొహాలీలోని ముల్లాన్‌పూర్ క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. రొమారియో షెఫర్డ్ ఒక్క వికెట్ తీశాడు.

ఓపెనర్లను ఔట్ చేసిన కృనాల్ పాండ్యా

మొదట టాస్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అసలే ప్రతికూల వాతావరణం కావడంతో ఛేజింగ్ వైపు మొగ్గు చూపాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో అదే ప్రత్యర్థి చేతిలో ఆర్సీబీ ఓటమిపాలైంది. దాంతో ఈ మ్యాచ్ లో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఫలితాలు రాబట్టారు. ఎప్పటిలాగే పంజాబ్ ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. 4.2 ఓవర్లలో టీం స్కోరు 42 వద్ద ప్రియాంష్ ఆర్య (15)ను కృనాల్ పాండ్యా ఔట్ చేశాడు. తన తరువాతి ఓవర్లో మరో పంజాబ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ (17 బంతుల్లో 33 పరుగులు, 5 ఫోర్లు, 1 సిక్సర్)ను సైతం పాండ్యానే పెవిలియన్ చేర్చాడు. కాగా, ఓపెనర్ల క్యాచ్‌లు రెండూ పట్టింది టిమ్ డేవిడ్. ఆపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను క్రీజులో కుదురుకోనివ్వలేదు ఆర్సీబీ బౌలర్లు. 10 బంతులాడిన అయ్యర్ 6 పరుగులు చేసి రొమారియో షెఫర్డ్ బౌలింగ్ లో షాట్ కు ప్రయత్నించగా కృనాల్ పాండ్యా పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. గత మ్యాచ్ లో వేగంగా ఆడిన నేహల్ వధేరా (5) లేని పరుగుకు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. 

ఆస్ట్రేలియన్ల ఆటకట్టించిన సుయాష్ శర్మదేశవాలీ బౌలర్ సుయాష్ శర్మ ఒకే ఓవర్లో పంజాబ్ ను రెండు సార్లు దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన సుయాష్ శర్మ రెండో బంతికి జోష్ ఇంగ్లీష్ (17 బంతుల్లో 29 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. బంతిని అంచనా వేయకుండా భారీ షాట్ ఆడేందుకు యత్నించగా బీట్ అయ్యాడు. బంతి నేరుగా వికెట్లను హిట్ చేయడంతో పంజాబ్ 112 పరుగులకు 5వ వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో 5వ బంతికి మరో ఆసీస్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ (1)ను సైతం లెగ్ స్పిన్నర్ సుయాష్ శర్మ క్లీన్ బౌల్డ్ చేసి ఆర్సీబీలో ఉత్సాహాన్ని నింపాడు. 

తరువాత మరో వికెట్ పడకుండా శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31 పరుగులు, 1 ఫోర్), మార్కో జాన్సన్ (20 బంతులలో 25 పరుగులు, 2 ఫోర్లు) అతి జాగ్రత్తగా ఆడారు. వికెట్ పడకుండా బౌలర్లను ఎదుర్కొన్నారు కానీ స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేయలేకపోయారు. ముఖ్యంగా శశాంక్ సింగ్ మరీ నెమ్మదిగా ఆడటంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.