ఏప్రిల్ 20 (ఆదివారం నాడు) మరో ఉత్కంఠభరితమైన డబుల్ హెడర్ జరగనుంది. సాయంత్రం జరిగే మ్యాచ్‌లో IPLలోని ముఖ్యమైన ప్రత్యర్థులు, 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ల అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ MI కంచుకోట అయిన వాంఖేడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్లో రెండు జట్ల ఆటతీరు ఏమాత్రం అభిమానులకు నచ్చడం లేదు. అయితే ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే CSKపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోవడానికి ధోనీ టీం విజయం సాధించకతప్పదు.
ధోని సేనకు డూ ఆర్ డై
IPL 2025లో ఈ రెండు జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్. మార్చి 23న జరిగిన తమ మొదటి పోరులో ముంబైపై CSK విజయం సాధించింది. ఆ తరువాత వరుస మ్యాచ్ లలో అటు చెన్నై, ఇటు ముంబై ఓడిపోయాయి. అయితే సీజన్లో ముంబైపై పైచేయి సాధించడం వారి నమ్మకాన్ని పెంచుతుంది. అయితే, పాయింట్ల పట్టికలో చెన్నై చివరి స్థానంలో ఉంది. మరో ఓటమిపాలైతే సీఎస్కే టీమ్ దాదాపు IPL 2025 ప్లేఆఫ్ పోటీ నుండి తప్పుకున్నట్లే.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ చివరి స్థానంలో (10వ స్థానం) ఉంది, 7 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలు సాధించగా, 5 ఓటములు ఉన్నాయి. ఇప్పటివరకు 4 పాయింట్లు మాత్రమే సాధించారు. మరోవైపు ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో కొంత మెరుగ్గా కనిపిస్తున్నా.. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్ నెగ్గడం ముఖ్యమే. ముంబై 7 మ్యాచ్‌లలో 3 విజయాలు, 4 ఓటములతో కేవలం 6 పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్ రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకమే. చెన్నైకి మాత్రం ఇది డూ ఆర్ డై అని చెప్పవచ్చు.
ప్లేఆఫ్ లెక్కలు ఎలా ఉన్నాయి ?
ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడానికి జట్లకు దాదాపు 16 పాయింట్లు అవసరం పడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విషయానికొస్తే మిగిలిన 7 మ్యాచ్‌లలో 6 గెలవాల్సి ఉంటుంది. ఇది దాదాపు అసాధ్యం. వారికి ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిదే. ముంబై వేదికగా నేటి రాత్రి జరిగే MI vs CSK మ్యాచ్ లో నెగ్గాలని ధోనీ టీమ్ భావిస్తోంది.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు IPL చరిత్రలో చాలా ప్రత్యేకం. ఇప్పటివరకూ లీగ్ చరిత్రలో రెండు జట్లు ముఖాముఖీ పోరులో 38 సార్లు తలపడ్డారు, MI 20 విజయాలతో ఆధిక్యంలో ఉంది, CSK 18 విజయాలు సాధించింది. తొలి మ్యాచ్ లో ఓటమికి CSKపై ప్రతీకారం కోసం ముంబై ఎదురుచూస్తోంది. ప్లేఆఫ్ బెర్త్ కోసం రేసులో నిలవాలంటే చెన్నైకి మ్యాచ్ గెలవడం ముఖ్యం. దాంతో ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న ఎల్ క్లాసికో పోరు కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.