IPL 2025 LSG VS RR Updates: లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఓవ‌రాల్ గా మూడు ఐపీఎల్ రికార్డుల‌ను త‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. ముందుగా 14 ఏళ్ల 23 రోజుల వ‌యసులో అరంగేట్రంచేసి, ఈ ఘ‌న‌త సాధించిన అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా రికార్డుల‌కెక్కాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మాజీ ప్లేయ‌ర్ ప్ర‌యాస్ రే బర్మ‌న్ పేరిట ఉండేది. 2019లో ఆర్సీబీ త‌ర‌పున త‌ను ఈ ఘ‌న‌త సాధించాడు. 16 ఏళ్ల 157 రోజుల వ‌య‌సులో త‌ను అరంగేట్రం చేసి, యంగెస్ట్ డెబ్యూటెంట్ రికార్డును కొల్ల‌గొట్టాడు. దాదాపు 6 ఏళ్ల‌కు పైగా ఈ రికార్డు ప‌దిలంగా ఉండ‌గా, తాజా మ్యాచ్ తో ఈ రికార్డు బ‌ద్ద‌లైంది. ఈ మ్యాచ్ లో 20 బంతుల్లోనే 34 ప‌రుగులు చేసిన వైభ‌వ్‌.. రెండు ఫోర్లు, మూడు సిక్స‌ర్లు కొట్ట‌డంతో పాటు, య‌శ‌స్వి జైస్వాల్ తో క‌లిసి 85 ప‌రుగుల తొలి వికెట్ భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశాడు. 

సిక్స‌ర్ బాదిన యంగెస్ట్ ప్లేయర్.. ఇక ఈ మ్యాచ్ లో త‌ను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స‌ర్ గా బాదిన వైభ‌వ్.. ఈ ఘ‌న‌త సాధించిన పదో ఐపీఎల్ బ్యాట‌ర్ గా నిలిచాడు. గ‌తంలో ఈ రికార్డు.. రాబ్ క్వినీ (ఆస్ట్రేలియా), కెవ‌న్ కూప‌ర్ , అండ్రీ ర‌స్సెల్, కార్లోస్ బ్రాత్ వైట్, జావోన్ సీయ‌ర్లెస్ (వెస్టిండీస్), అనికేత్ చౌద‌రీ, సిద్దేశ్ లాడ్‌, స‌మీర్ రిజ్వీ (ఇండియా), మ‌తీష్ తీక్ష‌ణ గ‌తంలో ఫ‌స్ట్ బాల్ సిక్స‌ర్ కొట్టిన జాబితాలో నిలిచారు. అలాగే అత్యంత యంగ్ ఏజ్ లో సిక్స‌ర్, ఫోర్ బాదిన రికార్డుల‌ను కూడా వైభ‌వ్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇంత‌కుముందు ఈ రికార్డులు రియాన్ ప‌రాగ్ (17 ఏళ్ల 161 రోజులు- సిక్సర్), ప్ర‌యాస్ రే బర్మ‌న్ (ఫోర్‌) పేరిట ఉండేది. 

చేజేతులా ఓడిన రాయ‌ల్స్.. 181 ప‌రుగుల ఛేజింగ్ తో బ్యాటింగ్ ప్రారంభించిన రాయ‌ల్స్.. ఒక ద‌శ‌లో 156-2తో నిలిచింది. చివ‌రి మూడు ఓవ‌ర్ల‌లో 25 ప‌రుగులు చేయాల్సిన ద‌శ‌లో వెంట‌వెంట‌నే య‌శ‌స్వి జైస్వాల్ (74), కెప్టెన్ రియాన్ ప‌రాగ్ (39) వికెట్ల‌ను కోల్పోయి, క‌ష్టాల్లో ప‌డింది. ఇక చివ‌రి ఓవ‌ర్ లో 9 ప‌రుగులు చేస్తే గెలుస్తుంద‌నుకున్న రాయ‌ల్స్ ను అవేశ్ ఖాన్ నిలువ‌రించాడు. కేవ‌లం ఆరు ప‌రుగులు మాత‌మ్రే ఇచ్చి, ఒక వికెట్ తీయ‌డంతో రెండు ప‌రుగుల‌తో ల‌క్నో సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన అవేశ్ కే ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ఈ ప‌రాజ‌యంతో టోర్నీ ఈ సీజ‌న్ లో ఆరు ఓట‌ములు న‌మోదు చేసిన తొలి జ‌ట్టుగా నిలిచిన రాయ‌ల్స్.. త‌మ ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. ముఖ్యంగా చివ‌రి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో, తాజాగా ఈ మ్యాచ్ లో గెలిచే పొజిష‌న్ లో ఉండి, ఓడిపోవ‌డం గ‌మ‌నార్మం.. నాకౌట్ కు అర్హ‌త సాధించాలంటే మిగ‌తా ఆరు మ్యాచ్ ల్లోనూ గెల‌వ‌డం త‌ప్ప‌నిస‌రి.