సొంత గడ్డ బెంగళూరులో జరిగిన పరాభవానికి ఆర్ సి బి ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం మొహాలీలో జరిగిన మ్యాచ్లో ఆతిధ్య పంజాబ్ కింగ్స్ జట్టును వారి గడ్డమీద ఓడించి మొన్నటి ఓటమికి ఆర్ సి బి రివేంజ్ తీర్చుకుంది. పంజాబ్ నిర్దేశించిన 158 పరుగుల టార్గెట్ ను ఆర్ సి బి సునాయాసంగా ఛేదించింది. మరో 7 బంతులు ఉండగానే ఆర్సిబి బ్యాటర్లు లక్ష్యాన్ని ఊదేశారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ప్రత్యర్థిని వారి గడ్డమీద రజత్ పాటిదార్ సేన ఓడించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితమైంది.
ఓపెనర్ విరాట్ కోహ్లీ (54 బంతుల్లో 73 పరుగులు నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్సర్), దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61 పరుగులు, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తో రాణించడంతో ఆర్సీబీ విజయం నల్లేరుపై నడకగా మారింది. పంజాబ్ బౌలర్లలో చహల్, అర్షదీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ తీశాడు. ముల్లాన్‌పూర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఛేజింగ్ మాస్టర్‌గా నిలిచాడు. చివరివరకూ క్రీజులో ఉండి ఆర్సీబీకి విజయాన్ని అందించారు. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.
ఓపెనర్ల మెరుపు ఆరంభం.. మొదట టాస్ నెగ్గిన బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. 4.2 ఓవర్లలో 42 వద్ద ప్రియాంష్ ఆర్య (15)ను ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా ఔట్ చేశాడు. తన తరువాతి ఓవర్లో మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ (17 బంతుల్లో 33 పరుగులు, 5 ఫోర్లు, 1 సిక్సర్)ను పాండ్యానే పెవిలియన్ చేర్చాడు. ఆపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను కుదురుకోనివ్వలేదు. 10 బంతులాడిన అయ్యర్ 6 పరుగులు చేసి రొమారియో షెఫర్డ్ బౌలింగ్ లో కృనాల్ పాండ్యా పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ మీద మంచి ఇన్నింగ్స్ ఆడిన నేహల్ వధేరా (5) రనౌట్ కావడంతో పంజాబ్ కు ఊహించని దెబ్బ తగిలింది.
ఆకట్టుకున్న సుయాష్ శర్మడొమెస్టిక్ బౌలర్ సుయాష్ శర్మ ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్లో పంజాబ్ కు చెందిన ఇద్దరు బ్యాటర్లను ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన సుయాష్ శర్మ రెండో బంతికి జోష్ ఇంగ్లీష్ (17 బంతుల్లో 29 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్)ను, అదే ఓవర్లో 5వ బంతికి మార్కస్ స్టోయినిస్ (1)ను సైతం క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో వికెట్ పడకుండా శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31 పరుగులు, 1 ఫోర్), మార్కో జాన్సన్ (20 బంతుల్లో 25 పరుగులు, 2 ఫోర్లు) ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కొన్నారు. కానీ స్కోరు వేగాన్ని పెంచకపోవడం, హిట్టింగ్ కు చూడకపోవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. సాధారణ టార్గెట్ కావడంతో ఏ టెన్షన్ లేకుండా బెంగళూరు విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. రొమారియో షెఫర్డ్ ఒక్క వికెట్ తీశాడు.
మొత్తం 5 విజయాలతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరగా, పంజాబ్ 4వ స్థానానికి పడిపోయింది. అయితే తొలి 5 స్థానాల్లో ఉన్న గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, పంజాబ్, లక్నో 5 మ్యాచ్‌లలో నెగ్గా.. మెరుగైన రన్ రేటుతో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో ఉంది.