ఆవేశ్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో రాజస్థాన్ రాయల్స్‌పై 2 పరుగుల తేడాతో గెలిచి లక్నో సూపర్ జెయింట్స్ ఊపిరిపీల్చుకుంది. కానీ ఆ జట్టును ఓ భయం వెంటాడుతూనే ఉంది. అదే కెప్టెన్ రిషభ్ పంత్ పేలవ ఫామ్. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర (రూ.27 కోట్లు) పలికిన పంత్ ప్రదర్శన దారుణంగా ఉంది. శనివారం రాజస్థాన్‌తో జరిగిన పోరులోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఓపెనర్లిద్దరూ స్వల్ప స్కోర్లకే ఔటైపోయి టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆచితూచి ఆడాల్సిన కెప్టెన్ మరోసారి ఓ చెత్త షాట్ ఆడి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడింది. టాస్ గెలిచిన లక్నో మొదట బ్యాటింగ్ ఎంచుకోగా మార్‌క్రమ్‌తోపాటు ఓపెనర్‌గా వచ్చిన మిచెల్ మార్ష్ కేవలం 4 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన పూరన్ సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. 11 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు.
వెనువెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న వేళ క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. ఆచిత కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సింది పోయి తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. 9 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేశాడు. హసరంగ బౌలింగ్‌లో ఓ చెత్త షాట్ ఆడి కీపర్ ధ్రువ్ జురెల్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 7 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేసి కేవలం 108 రన్స్ మాత్రమే చేశాడు. ఆడిన మొత్తం మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క దాంట్లో రాణించాడు. ఏప్రిల్ 14న చెన్నై సూపర్ కింగ్స్‌పై 63 రన్స్ చేశాడు. ఇక అన్ని మ్యాచ్‌లలో దారుణంగా విఫలమయ్యాడు. లక్నో దిల్లీతో తలపడగా 6 బాల్స్ ఆడి డకౌట్ అవగా.. హైదరాబాద్‌పై 15, పంజాబ్‌పై 2, ముంబైపై 2, గుజరాత్‌పై 21 చేశాడు. 98.14 స్ట్రైక్‌రేట్‌తో పంత్ యావరేజ్ స్కోరు 15 మాత్రమే.
పంత్ రాణించాల్సిందే..LSG తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 22న వారి సొంత మైదానమైన ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 3 ఓటములతో ఉన్న లక్నో 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. టాప్ ఆర్డర్లో విచెల్ మార్ష్, మార్క్రమ్, నికొలస్ పూరన్ రాణిస్తుండడంతో ఆ జట్టు మిడిలార్డర్‌పై పెద్దగా ప్రభావం పడడం లేదు. కానీ వారు విఫలమైతే మిడిలార్డర్ లో ఉన్న పంత్ రాణించాల్సి ఉంటుంది. ప్లేఆఫ్ రేసులో జట్టు కొనసాగాలంటే.. పంత్ తన ఫామ్‌ను పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సూపర్ విజయంరాజస్థాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట లక్నో బ్యాటింగ్ చేయగా.. మార్క్రమ్ (66), ఆయుశ్ బదోని (50) రాణించారు. చివర్లో అబ్దుల్ సమద్ చెలరేగి 10 బంతుల్లో 30 రన్స్ చేయడంతో ఆ జట్టు 180 లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచింది. ఆ తర్వాత బ్యాంటింగ్‌కు దిగిన రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (74), 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్వవంశీ (34) దంచికొట్టడంతో సునాయాసంగా గెలుస్తుందనుకున్న రాజస్థాన్ ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 9 రన్స్ అవసరముండగా ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో రాయల్స్ జట్టు 2 రన్స్ తేడాతో ఓడింది.