IPS AB Venkateswara Rao: పోస్టింగ్, జీతం అడిగితే సస్పెండ్ చేశారు- సామాజిక వర్గాన్నే తొక్కేశారు: మాజీ ఐపీఎస్ సంచలనం

Continues below advertisement

Retired IPS AB Venkateswara Rao | అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టింగ్, జీతం అడిగితే తనను సస్పెండ్ చేశారని.. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన మర్నాడే తనకు ఉద్యోగం లేకుండా చేశారని మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొసరాజు వారి వంశవృక్ష సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నాడు విజయవాడలో నిర్వహించిన కొసరాజు ఆత్మీయ సమావేశంలో ఏబీవీ మాట్లాడుతూ.. 30 ఏళ్ల సర్వీసులో కేవలం 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే సక్రమమైన పోస్టుల్లో పని చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

‘వైఎస్ జగన్ అధికారం చేపట్టిన రోజు నుంచి ఓ సామాజికవర్గంపై కఠినంగా వ్యవహరించారు. అప్పటి నుంచి కమ్మ అధికారులు టార్గెట్ గా చేసుకుని అణచివేతకు గురి చేశారు. కమ్మ వారిపై ఏకంగా యుద్ధం ప్రకటించినట్లు జగన్ వ్యవహరించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చి కమ్మ వ్యతిరేక పాలసీని తీసుకొచ్చి, దాన్ని స్టేట్ పొలసీగా మార్చేశారు. అప్పట్లో వైఎస్సార్ నాటిన విత్తనం 2019 నాటికి విష వృక్షంగా మారింది.

2004 నుంచి రాజకీయాలు కమ్మ వారిని కాపాడలేక పోతున్నాయి. కమ్మ వారి పట్ల సానుభూతి, అభిమానం ఉన్నా  కాపాడేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నాతో పాటు ఎంతో మందిని ఉద్యోగులను ఇబ్బందిపెట్టారు. కొందర్ని సస్పెండ్ చేశారు. నా కెరీర్ లో ఊహించని మచ్చను ఆపాదించాలని చూశారు, కానీ చట్టం, న్యాయం నన్ను నిప్పుగా నిలబెట్టాయి. 
కరోనా వైరస్‌కు, కోవిడ్ వాక్సిన్లకు, ఆఖరికి ఎలక్షన్ కమిషనర్ కు కులం రంగు పూసి విచక్షణా రహితంగా ప్రవర్తించారు. వరదలు, వైపరీత్యాలు వస్తే 75 శాతం విరాళాలు కమ్మ వారి నుంచి వస్తాయి. మన సామాజిక వర్గంతో పాటు సమాజానికి సైతం అందరూ తోడ్పడాలని’ మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.

Continues below advertisement