కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్యకు గురయ్యారు. బెంగళూరులోని హైసోర్ లేఅవుట్‌లోని తన నివాసంలో ఓం ప్రకాష్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారని పోలీసు అధికారులు తెలిపారు. 1981 బ్యాచ్ అధికారి అయిన 68 ఏళ్ల ఈ రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి. ఆయన నివాసంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో రక్తపు మడుగులో మాజీ డీజీపీ ఓం ప్రకాష్ పడి ఉన్నట్లు గుర్తించి పోలీసుకు సమాచారం అందించారు.
ఆయన శరీరంపై పదునైన ఆయుధంతో దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు గుర్తించారు. మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో ఆయన భార్య పల్లవి పాత్ర ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పీటీఐ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. మాజీ డీజీపీ మృతిచెందారన్న సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవపరీక్ష కోసం డెడ్ బాడీని పంపారు. ఫోరెన్సిక్ బృందం దర్యాప్తులో కీలకంగా మారనుంది.
మాజీ కర్ణాటక డీజీపీ ఓం ప్రకాశ్ హత్యలో భార్య హస్తం ఉందా..
మాజీ డీజీపీ ఓం ప్రకాష్ ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఆయన భార్య పల్లవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇది భార్య పని లేక సన్నిహిత కుటుంబసభ్యుల పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. కుటుంబ వివాదం హత్యకు దారి తీసిందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్ ప్రకారం.. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను మూడు సార్లు కత్తి లేక పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. భార్యనే ఓం ప్రకాష్ ను హత్య చేసిందని, లేక వేరొకరి సాయంతో హత్య చేయించిందా అని అనుమానిస్తున్నారు.
తన ప్రాణాలకు ముప్పు ఉందని కొందరు సన్నిహితులకు ఓం ప్రకాష్ ఇటీవల చెప్పారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు ఆయన భార్య, కుమార్తెలను విచారించారు.
బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానాంద్ మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 4 నుండి 4:30 గంటల మధ్య మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ మరణించారని సమాచారం అందింది. ఆయన కుమారుడిని సంప్రదించాం. ఆయన ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశారు. దాని వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి ఆయన చనిపోయి ఉంటారని” అన్నారు.
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్..
ఓం ప్రకాశ్ 2015 మార్చి 1న కర్ణాటక 38వ డీజీపీగా నియమితులయ్యారు. ఆయన గతంలో హోం గార్డ్స్ కమాండెంట్ జనరల్, అగ్నిమాపక, అత్యవసర సేవలు, పౌర హక్కులు, కర్ణాటక లోకాయుక్త, సిఐడీ వంటి అనేక కీలక పదవులను నిర్వహించారు. రవాణా కమిషనర్‌గా కూడా సేవలు అందించారు. కార్వార్ జిల్లాలోని భట్కల్ ప్రాంతంలో కమ్యూనికేషన్ ఉద్రిక్తతలను సమర్థవంతంగా నిర్వహించారు. బెంగళూరులో జరిగిన రెండు ప్రధాన ఉగ్రవాద ఘటనల దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. 2013 ఏప్రిల్ 17న బీజేపీ ఆఫీసు సమీపంలో జరిగిన బాంబు పేలుడు, 2014 డిసెంబర్ 28న చర్చ్ స్ట్రీట్ పేలుడు ఘటన కేసులు దర్యాప్తు చేశారు.